
టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనలో ఇప్పటికీ దూకుడు అలాగే ఉందని.. మైదానంలో తనను తాను ఇలా ఆవిష్కరించుకోవడం తన సహజమైన భావోద్వేగం అని తెలిపాడు. అయితే, వయసు పెరుగుతున్న దృష్ట్యా ఇంట్లో వాళ్ల కోసం కొన్నిసార్లు తనను తాను సంభాళించుకుంటున్నానని తెలిపాడు.
కోహ్లితోనూ గొడవ
టీమిండియాకు ఆడిన రోజుల్లో గంభీర్ ఎంత అగ్రెసివ్‌గా ఉండేవాడో క్రికెట్ ప్రేమికులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా దాయాది పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో దూకుడు ప్రదర్శిస్తూ ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చేవాడు. అంతేకాదు.. భారత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli)తోనూ.. ఈ వరల్డ్‌కప్ విన్నర్ గొడవ పడిన విషయం తెలిసిందే.
ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ‘ఢిల్లీ బాయ్స్’ గంభీర్- కోహ్లి రెండుసార్లు తీవ్ర స్థాయిలో వాగ్వాదం చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. 43 ఏళ్ల గంభీర్ టీమిండియా హెడ్‌కోచ్‌గా వచ్చిన తర్వాత పాత పగలు పక్కనపెట్టి కోహ్లితో కలిసిపోయాడు. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని స్వయంగా వీరిద్దరు చెప్పడంతో అభిమానుల మధ్య సోషల్ మీడియా ఫైట్స్‌కు తెరపడింది.
ఎప్పుడూ గంభీరంగానే
ఇక గంభీర్ డగౌట్‌లోనూ ఎప్పుడూ గంభీరంగానే ఉంటాడన్న విషయం తెలిసిందే. అతడి ముఖంలో అమావాస్యకో.. పున్నమికో గానీ నవ్వు కనిపించదు. ఎప్పుడూ సీరియస్‌గా ఉండే గంభీర్‌పై ఈ విషయంలో ఎన్నో మీమ్స్ కూడా వస్తూ ఉంటాయి.
నేను మారలేదు
ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన గౌతం గంభీర్ తన వ్యవహారశైలి గురించి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘నాలో ఇప్పటికీ ఆ దూకుడు అలాగే ఉంది. నేను మారలేదు. అగ్రెసివ్‌గా ముందుకు వెళ్లాలనుకున్నపుడు గొడవ పడటమే నాకు ముందుగా గుర్తుకువస్తుంది.
ఇంట్లో పిల్లలు ఉన్నారు
అయితే, వయసు పెరిగింది కాబట్టి.. నా మనసు.. ‘ఇంట్లో పిల్లలు ఉన్నారు’ కదా అని హెచ్చరిస్తుంది’’ అంటూ గంభీర్ సరదాగా వ్యాఖ్యానించాడు. కాగా టీమిండియా ప్రస్తుతం స్వదేశంలో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌తో బిజీగా ఉంది.
రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్టులో విండీస్‌ను ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో చిత్తు చేసిన గిల్ సేన.. శుక్రవారం మొదలుపెట్టిన రెండో టెస్టులోనూ జోరు కనబరుస్తోంది. టీమిండియా- వెస్టిండీస్ రెండో టెస్టు తొలిరోజు ఆట సందర్భంగా గంభీర్ స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ పైవిధంగా స్పందించాడు.
టీమ్ డిన్నర్
ఇక ఈ మ్యాచ్‌కు ముందు గౌతీ తన ఇంట్లో టీమిండియాకు డిన్నర్‌పార్టీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో పాటు జస్‌ప్రీత్ బుమ్రా,ధ్రువ్ జురెల్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, ప్రసిద్ కృష్ణ సహా కోచ్‌లు ర్యాన్ టెన్ డష్కాటే, మోర్నీ మోర్కెల్, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా గంభీర్ పార్టీకి హాజరైనట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి గిల్‌కు పగ్గాలు అప్పగించడంపై గంభీర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో గౌతీ టీమ్ డిన్నర్ ఇవ్వడం గమనార్హం.
చదవండి: ‘యువీ గనుక తన పిల్లల్ని.. నాకు అప్పగిస్తే వారికీ అదే ‘గతి’ పట్టిస్తా’