ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2026 వేలం నేపథ్యంలో ఫ్రాంఛైజీ ట్రేడ్ డీల్స్ పూర్తి చేసుకున్నాయి. అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను విడుదల చేసేందుకు శనివారమే (నవంబరు 15) ఆఖరి తేదీ కావడంతో తాము ట్రేడ్ చేసుకున్న ఆటగాళ్ల వివరాలను వెల్లడిస్తున్నాయి.
జడ్డూ అటు.. సంజూ ఇటు
ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)- రాజస్తాన్ రాయల్స్ (RR) మధ్య జరిగిన భారీ ట్రేడ్ వార్తల్లో నిలిచింది. ముందుగా ఊహించినట్లే సీఎస్‌కే.. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను.. రాజస్తాన్‌కు ఇచ్చేసి.. ఆ జట్టు సారథి సంజూ శాంసన్‌ను తమ చెంతకు చేర్చుకుంది.
ధరలో మార్పు
అయితే, ఈ ఒప్పందంలో భాగంగా సీఎస్‌కే సంజూకు రాజస్తాన్ గతంలో చెల్లించిన మొత్తాన్ని ఇచ్చి రూ. 18 కోట్లకు తీసుకోగా.. రాజస్తాన్ మాత్రం జడ్డూ ధరను రూ. 18 కోట్ల నుంచి రూ. 14 కోట్లకు తగ్గించింది. జడ్డూతో పాటు సామ్ కర్రన్ (రూ. 2.4 కోట్లు)ను కూడా సీఎస్‌కే నుంచి తీసుకుంది.
ఇదిలా ఉంటే.. రాజస్తాన్ రాయల్స్‌ను వీడిన నేపథ్యంలో సంజూ శాంసన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. సమయం వచ్చింది గనుకే తాను జట్టును వీడానంటూ అతడు స్పష్టతనిచ్చాడు.
నా సర్వస్వం ధారబోశాను
ఈ మేరకు.. ‘‘మనం ఇక్కడ (ప్రపంచంలో) కొన్నాళ్ల పాటే ఉంటాము. ఫ్రాంఛైజీ కోసం నా సర్వస్వం ధారబోశాను. క్రికెట్‌ను గొప్పగా ఆస్వాదించాను. జీవితానికి సరిపడా జ్ఞాపకాలు, బంధాలు పోగు చేసుకున్నాను. ఫ్రాంఛైజీలోని ప్రతి ఒక్కరిని నా కుటుంబ సభ్యుడిగానే భావించాను. ఇప్పుడు సమయం వచ్చింది.. అందుకే నేను ఈ జట్టును వీడి వెళ్తున్నా.
నాకు ఇక్కడ లభించిన దానికి నేను ఎల్లప్పుడూ రుణపడే ఉంటాను’’ అంటూ సంజూ శాంసన్ ఉద్వేగానికి లోనయ్యాడు. ఈ సందర్భంగా రాయల్స్‌తో చేరిన తొలి నాళ్లలో దిగిన ఫొటోను సంజూ షేర్ చేశాడు. కాగా 2013లో రాజస్తాన్ రాయల్స్ జట్టులో చేరిన కేరళ స్టార్ సంజూ.. 2016లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు మారాడు. రెండేళ్లు అదే జట్టుకు ఆడాడు.
ఫైనల్‌కు చేర్చిన సారథి
ఆ తర్వాత మళ్లీ 2018లో రాయల్స్‌లోకి తిరిగి వచ్చిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. 2025 వరకు జట్టుతో కొనసాగాడు. కెప్టెన్‌గా రాజస్తాన్‌ను ముందుకు నడిపించిన సంజూ 2022 సీజన్‌లో ఫైనల్‌కు చేర్చాడు.
అయితే, గుజరాత్ టైటాన్స్‌తో టైటిల్ పోరులో ఓడిన రాజస్తాన్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 176 మ్యాచ్‌లు ఆడిన సంజూ.. 4704 పరుగులు సాధించాడు. ఇందులో మూడు శతకాలు ఉండటం విశేషం.


