షెల్టన్‌కు షాక్‌ | Fourth seed Shelton loses in first round of Wimbledon | Sakshi
Sakshi News home page

షెల్టన్‌కు షాక్‌

Jul 1 2026 4:23 AM | Updated on Jul 1 2026 4:23 AM

Fourth seed Shelton loses in first round of Wimbledon

తొలి రౌండ్‌లోనే ఓడిన నాలుగో సీడ్‌

ప్రపంచ 140వ ర్యాంకర్‌ విర్టానెన్‌ సంచలనం

శ్రమించి గెలిచిన స్వియాటెక్, రిబాకి

లండన్‌: వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో రెండో రోజు మంగళవారం సంచలనం నమోదైంది. పురుషుల సింగిల్స్‌ విభాగంలో ప్రపంచ ఐదో ర్యాంకర్, నాలుగో సీడ్‌ బెన్‌ షెల్టన్‌ (అమెరికా) తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టాడు. ప్రపంచ 140వ ర్యాంకర్‌ ఒట్టో విర్టానెన్‌ (ఫిన్‌లాండ్‌) అద్భుత ప్రదర్శనతో షెల్టన్‌ను బోల్తా కొట్టించాడు. కెరీర్‌లో ఆరోసారి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆడుతున్న విర్టానెన్‌ 6–4, 3–6, 6–7 (8/10), 6–2, 7–6 (11/9)తో షెల్టన్‌పై గెలిచి రెండోసారి వింబుల్డన్‌ టోర్నీలో రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. 

4 గంటల 21 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో విర్టానెన్‌ 14 ఏస్‌లు సంధించి, ఆరు డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు. మరోవైపు షెల్టన్‌ 19 ఏస్‌లు కొట్టి, ఏడు డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు. నెట్‌ వద్దకు 60 సార్లు దూసుకొచ్చిన విర్టానెన్‌ 35 సార్లు పాయింట్లు గెలిచాడు. షెల్టన్‌ 66 సార్లు నెట్‌వద్దకు వచ్చి 43 సార్లు పాయింట్లు సాధించాడు. షెల్టన్‌ సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్‌ చేసిన విర్టానెన్‌ తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయాడు. 60 విన్నర్స్‌ కొట్టిన విర్టానెన్‌ 47 అనవసర తప్పిదాలు చేశాడు. షెల్టన్‌ 68 విన్నర్స్‌ కొట్టి, 41 అనవసర తప్పిదాలు చేశాడు. అయితే కీలకమైన టైబ్రేక్‌లో విర్టానెన్‌ పైచేయి సాధించి విజయాన్ని అందుకున్నాడు.  

కష్టపడి గెలిచిన జ్వెరెవ్‌ 
మరోవైపు ఫ్రెంచ్‌ ఓపెన్‌ చాంపియన్, రెండో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) తొలి రౌండ్‌ దాటడానికి శ్రమించాడు. 2 గంటల 55 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో జ్వెరెవ్‌ 6–4, 6–7 (8/10), 7–6 (7/5), 7–6 (7/0)తో అలెగ్జాండర్‌ బ్లాక్స్‌ (బెల్జియం)పై గెలుపొంది రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. ఇతర తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో ఐదో సీడ్‌ అలెక్స్‌ డిమినార్‌ (ఆ్రస్టేలియా) 7–6 (7/5), 6–1, 6–0తో బురుచాగా (అర్జెంటీనా)పై, ఆరో సీడ్‌ టేలర్‌ ఫ్రిట్జ్‌ (అమెరికా) 6–3, 6–4, 6–3తో లాజోవిచ్‌ (సెర్బియా)పై, పదో సీడ్‌ అలెగ్జాండర్‌ బుబ్లిక్‌ (కజకిస్తాన్‌) 3 గంటల 40 నిమిషాల్లో 4–6, 6–3, 6–7 (10/12), 6–3, 6–4తో కొకినాకిస్‌ (థాయ్‌లాండ్‌)పై విజయం సాధించారు. 

జొకోవిచ్‌ శుభారంభం 
కెరీర్‌లో 25వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ లక్ష్యంగా వింబుల్డన్‌ టోర్నీలో బరిలోకి దిగిన సెర్బియా దిగ్గజం నొవాక్‌ జొకోవిచ్‌ శుభారంభం చేశాడు. తొలి రౌండ్‌లో జొకోవిచ్‌ 6–4, 5–7, 6–4, 6–4తో చైనా ప్లేయర్‌ యిబింగ్‌ వుపై గెలుపొంది రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టాడు. 3 గంటల 12 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్‌ 15 ఏస్‌లు సంధించాడు. ఒక్క డబుల్‌ ఫాల్ట్‌ కూడా చేయలేదు. తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్‌ చేశాడు.  

స్వితోలినా నిష్క్ర మణ 
మహిళల సింగిల్స్‌లో ఎనిమిదో సీడ్‌ స్వితోలినా (ఉక్రెయిన్‌) తొలి రౌండ్‌లోనే నిష్క్ర మించింది. డిఫెండింగ్‌ చాంపియన్, మూడో సీడ్‌ ఇగా స్వియాటెక్‌ (పోలాండ్‌), మాజీ విజేత రిబాకినా (కజకిస్తాన్‌) మూడు సెట్‌లపాటు పోరాడి రెండో రౌండ్‌కు చేరుకున్నారు. దరియా స్నిగుర్‌ (ఉక్రెయిన్‌) 7–5, 6–2తో స్వితోలినాపై సంచలన విజయం సాధించింది. స్వియాటెక్‌ 6–1, 2–6, 6–3తో టేలర్‌ టౌన్‌సెండ్‌ (అమెరికా)పై, రెండో సీడ్‌ రిబాకినా 6–4, 1–6, 6–3తో లూయిస్‌ బోయిసన్‌ (ఫ్రాన్స్‌)పై, ఆరో సీడ్‌ అనిసిమోవా (అమెరికా) 6–3, 6–2తో లీనా జొర్జెస్కా (నార్త్‌ మెసిడోనియా)పై విజయం సాధించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement