
న్యూజిలాండ్ క్రికెటర్ టామ్ బ్రూస్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుకుంటున్న స్కాట్లాండ్‌కు వలస వెళ్లాడు. న్యూజిలాండ్ తరఫున సరైన అవకాశాలు రాకపోవడంతో అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు. త్వరలో జరుగనున్న వరల్డ్‌కప్ లీగ్-2 మ్యాచ్‌ల కోసం బ్రూక్ స్కాట్లాండ్ వన్డే జట్టుకు ఎంపికయ్యాడు.
బ్రూస్ తండ్రి స్వస్థలం స్కాట్లాండే కావడంతో అతనికి ఈ అవకాశం దక్కింది. బ్రూస్ న్యూజిలాండ్‌కు ఆడకముందు 2016లో స్కాట్లాండ్ డెవలెప్‌మెంట్ జట్టుకు ఆడాడు.
2017లో బ్రూస్ న్యూజిలాండ్ తరఫున టీ20ల్లో అరంగేట్రం చేశాడు. బ్రూస్ న్యూజిలాండ్ తరఫున రెండో మ్యాచ్‌లోనే మ్యాచ్ విన్నింగ్ హాఫ్ సెంచరీ సాధించి పర్వాలేదనిపించాడు. ఆతర్వాత అతను అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోయాడు. తదుపరి 15 ఇన్నింగ్స్‌ల్లో మరో ఫిఫ్టి మాత్రమే చేయగలిగాడు. దీంతో జట్టులో స్థానం గల్లంతైంది.
2020లో స్వదేశంలో భారత్‌తో జరిగిన సిరీస్‌లో అతను చివరిసారిగా న్యూజిలాండ్‌కు ఆడాడు. ఆ సిరీస్‌లో వరుస డకౌట్ల కారణంగా అతనిపై వేటు పడింది. ఆ సిరీస్‌ను న్యూజిలాండ్ 0-5 తేడాతో భారత్‌కు కోల్పోయింది.
భారత్‌తో సిరీస్ తర్వాత బ్రూస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా జట్టులోకి రాలేకపోయాడు. దీంతో కెరీర్‌ను కొనసాగించేందుకు తన తండ్రి స్వస్థలమైన స్కాట్లాండ్‌కు వలస వెళ్లాడు. అక్కడ దేశవాలీ మ్యాచ్‌ల్లో సత్తా చాటి వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. 2017-2020 మధ్యలో బ్రూస్ న్యూజిలాండ్ తరఫున 17 మ్యాచ్‌లు ఆడి 2 హాఫ్ సెంచరీల సాయంతో 122.44 స్ట్రయిక్‌రేట్‌తో 279 పరుగులు చేశాడు.
స్కాట్లాండ్ వన్డే జట్టుకు ఎంపికైన అనంతరం బ్రూస్ ఇలా అన్నాడు. "మా కుటుంబానికి స్కాటిష్ చరిత్ర ఉంది. స్కాట్లాండ్‌కు ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉంది. ప్రపంచ వేదికపై స్కాట్లాండ్ విజయానికి నా వంతు కృషి చేస్తాను". ఈ మార్పుతో బ్రూస్ రెండు దేశాలకు ప్రాతినిధ్యం వహించిన అరుదైన ఆటగాళ్ల జాబితాలో చేరాడు.
కాగా, వరల్డ్‌కప్ లీగ్-2లో భాగంగా స్కాట్లాండ్ కెనడా, నమీబియా దేశాలతో ఆగస్ట్ 29-సెప్టెంబర్ 6 మధ్యలో నాలుగు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది.