‘చీటింగ్‌కు కూడా వెనుకాడరు.. కళ్లు కనిపించడం లేదా బాబూ’ | IND Vs ENG 4th Test: England Slammed By Netizens For Claiming And Celebrating Grounded Catch Of Jaiswal, Video Viral - Sakshi
Sakshi News home page

Ind Vs Eng 4th Test: ‘ఛీ.. ఛీ.. చీటింగ్‌కు కూడా వెనుకాడరు’.. ఇలా ఉన్నారేంట్రా బాబూ!

Feb 24 2024 5:52 PM | Updated on Feb 24 2024 7:18 PM

England Slammed By Netizens For Claiming Celebrating Grounded Catch Of Jaiswal - Sakshi

చీటింగ్‌కు కూడా వెనుకాడరు.. ఫ్యాన్స్‌ ఫైర్‌ (PC: Foxcricket X)

రాంచి టెస్టు సందర్భంగా ఇంగ్లండ్‌ ఆటగాళ్లు వ్యవహరించిన తీరుపై టీమిండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస క్రీడా స్ఫూర్తి కూడా ప్రదర్శించడం చేతకాదా అని మండిపడుతున్నారు. 

ప్రత్యర్థి జట్టు బ్యాటర్‌ను గందరగోళంలో పడేయాలనే తలంపుతో ఇంతకు దిగజారుతారా అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. అసలు విషయమేమిటంటే.. నాలుగో టెస్టు రెండో రోజు ఆటలో భాగంగా ఇంగ్లండ్‌ 353 పరుగుల వద్ద ఆలౌట్‌ అయి తొలి ఇన్నింగ్స్‌ ముగించింది.

ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆదిలోనే ఓపెనర్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(2) వికెట్‌ కోల్పోయింది. ఈ దశలో వన్‌డౌన్‌ బ్యాటర్‌ శుబ్‌మన్‌ గిల్‌(38)తో కలిసి మరో ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పేందుకు ప్రయత్నించాడు.

ఈ నేపథ్యంలో 20వ ఓవర్‌లో ఇంగ్లండ్‌ పేసర్‌ ఒలీ రాబిన్సన్‌ వేసిన ఆరో బంతిని తప్పుగా అంచనా వేసిన జైస్వాల్‌.. షాట్‌ ఆడటంలో విఫలమయ్యాడు. ఈ క్రమంలో బంతి బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకుని వికెట్‌ కీపర్‌ బెన్‌ ఫోక్స్‌ చేతిలో పడ్డట్లుగా అనిపించింది.

దీంతో జైస్వాల్‌ అవుటైనట్లేనంటూ ఇంగ్లండ్‌ ఆటగాళ్లు పెద్ద ఎత్తున సెలబ్రేట్‌ చేసుకున్నారు. అయితే, రివ్యూలో భాగంగా తొలి రీప్లేలో ఫలితం సరిగ్గా తేలకపోయినా అలాగే సంబరాలు చేసుకున్నారు.

అయితే, ఫలితాన్ని సరిగ్గా అంచనా వేసేందుకు థర్డ్‌ అంపైర్‌ ఒకటికి రెండుసార్లు బాల్‌ ట్రాకింగ్‌ చేశాడు. ఈ క్రమంలో బాల్‌ తొలుత నేలను తాకి.. ఆ తర్వాత వికెట్‌ కీపర్‌ చేతుల్లో పడినట్లు తేలింది. దీంతో జైస్వాల్‌ నాటౌట్‌గా తేలగా.. ఇంగ్లండ్‌ ఆటగాళ్లు ముఖ్యంగా కెప్టెన్‌ స్టోక్స్‌ తల పట్టుకుంటూ అసహనం వ్యక్తం చేశాడు.

ఈ నేపథ్యంలో ఇంగ్లిష్‌ ఆటగాళ్లు ఓవరాక్షన్‌ చేస్తూ అతిగా సెలబ్రేట్‌ చేసుకున్నారంటూ టీమిండియా ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. ఎలాగోలా ఒత్తిడి పెంచి జైస్వాల్‌ను అవుట్‌గా ప్రకటింపజేయడంలో భాగంగానే ఇలా ‘చీటింగ్‌’కు పాల్పడేందుకు కూడా వెనుకాడలేదని నెట్టింట ట్రోల్‌ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ ఘటన సమయానికి జైస్వాల్‌ 40 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా.. టీమిండియా స్కోరు 68-1. ఇక రెండో రోజు ఆట ముగిసే సరికి టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. జైస్వాల్‌(73) అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement