
ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నీకి భారత జట్టు ప్రకటన
శ్రేయస్, జైస్వాల్‌లకు దక్కని చోటు
బుమ్రా పునరాగమనం
తిలక్ వర్మ చోటు పదిలం
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో బ్యాటర్‌గా అసాధారణ ప్రదర్శన కనబర్చడంతో పాటు నాయకుడిగా కూడా సత్తా చాటిన శుబ్‌మన్ గిల్ ఇప్పుడు టి20ల్లో కూడా పునరాగమనం చేశాడు. దాదాపు ఏడాది కాలంగా ఈ ఫార్మాట్‌కు దూరంగా ఉన్న గిల్‌ను ఇప్పుడు జట్టులోకి ఎంపిక చేయడంతో పాటు వైస్ కెప్టెన్సీ కూడా ఇచ్చి భవిష్యత్తులో అతడిని అన్ని ఫార్మాట్‌లలో సారథిగా చూడాలనుకుంటున్నట్లు బీసీసీఐ సందేశం ఇచ్చింది.
వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత బుమ్రా మళ్లీ టి20ల్లో ఆడనుండగా... అనూహ్యంగా హర్షిత్ రాణా, జితేశ్ శర్మలకు చోటు దక్కింది. ఐపీఎల్‌లో అద్భుతంగా ఆడిన శ్రేయస్ అయ్యర్, ఫామ్‌లో ఉన్న యశస్వి జైస్వాల్‌లను కూడా ఎంపిక చేయకుండా ఆసియా కప్ కోసం టీమిండియాను సెలక్టర్లు ప్రకటించారు.
ముంబై: ఆసియా కప్ టి20 టోర్నీలో పాల్గొనే భారత పురుషుల క్రికెట్ జట్టును అజిత్ అగార్కర్ నాయకత్వంలో సెలక్షన్ కమిటీ మంగళవారం ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని 15 మంది సభ్యుల జట్టుకు శుబ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. మరో ఐదుగురు ఆటగాళ్లను రిజర్వ్‌లుగా ఎంపిక చేశారు.
సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఆసియా కప్ టోర్నీ జరుగుతుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి–మార్చిలో భారత్‌లో జరిగే టి20 వరల్డ్ కప్‌కు ముందు టీమిండియా దాదాపు 20 మ్యాచ్‌లు ఆడనుంది. దీనిని దృష్టిలో ఉంచుకుంటూ జట్టును ఎంపిక చేశారు.
కీపర్‌గా జితేశ్‌కు చాన్స్...
శుబ్‌మన్ గిల్ ఏడాది క్రితం తన చివరి టి20 ఆడాడు. శ్రీలంకతో జరిగిన ఆ సిరీస్‌లో అతను వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే ఆ తర్వాత టెస్టులు, వన్డేల కారణంగా టి20లు ఆడలేదు. ఇప్పుడు తాజాగా ఇంగ్లండ్‌తో టెస్టుల్లో చూపించిన ఫామ్‌తో పాటు ఐపీఎల్‌లో కూడా రాణించడంతో సెలక్టర్లు అతడిని మళ్లీ జట్టులోకి తీసుకొచ్చారు. ఇప్పటికే వన్డే జట్టుకు కూడా వైస్ కెప్టెన్‌గా ఉన్న అతను మున్ముందు కెప్టెన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
దూకుడు మీదున్న అభిషేక్ శర్మతో కలిసి అతను ఓపెనింగ్ చేస్తాడు. గిల్ రాకతో తుది జట్టులో సంజు సామ్సన్‌కు చోటు దక్కడం కష్టమే. అందుకే ఫినిషింగ్‌కు తగినవాడిగా భావిస్తూ వికెట్ కీపర్‌గా జితేశ్ శర్మను ఎంపిక చేశారు. బ్యాటింగ్‌లో నిలకడగా రాణిస్తున్న హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మకు ఢోకా లేకుండా పోయింది.
వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత టి20లు ఆడని బుమ్రా, కుల్దీప్ ఈ కీలక టోర్నీతో మళ్లీ బరిలోకి దిగుతున్నారు. ఇతర బౌలర్లు వరుణ్ చక్రవర్తి, అర్‡్షదీప్ సింగ్ మరో చర్చకు తావు లేకుండా జట్టులో నిలిచారు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివమ్ దూబేల రూపంలో ముగ్గురు ఆల్‌రౌండర్లు జట్టులో ఉన్నారు.
హర్షిత్‌కు మరో అవకాశం
ఐపీఎల్‌లో 604 పరుగులు సాధించడంతో పాటు పంజాబ్‌ను ఫైనల్‌కు చేర్చిన శ్రేయస్ అయ్యర్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. ఈ ఫార్మాట్‌లో సెలక్టర్లు అతనిపై నమ్మకం ఉంచట్లేదు. అభిషేక్ మెరుపు బ్యాటింగ్ కారణంగా జైస్వాల్‌ను పక్కన పెట్టాల్సి వచ్చింది. ఇప్పటికే ముగ్గురు స్పిన్నర్లు ఉండటంతో సుందర్‌ను కూడా ఎంపిక చేయకుండా స్పెషలిస్ట్ బ్యాటర్‌గా రింకూ సింగ్‌ను తీసుకున్నారు. పేసర్ హర్షిత్ రాణా ఎంపిక మాత్రం అనూహ్యం. ఏకైక టి20 ఆడిన అతను ఐపీఎల్‌లోనూ రాణించలేదు. అయితే ప్రసిధ్ కృష్ణతో పోలిస్తే కాస్త బ్యాటింగ్ చేయగలగడం అతనికి సానుకూలంగా మారింది.
భారత టి20 జట్టు: సూర్యకుమార్ (కెప్టెన్), గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్, సామ్సన్, తిలక్, దూబే, హార్దిక్, జితేశ్, అక్షర్, రింకూ సింగ్, కుల్దీప్, హర్షిత్, బుమ్రా, అర్ష్ దీప్, వరుణ్ చక్రవర్తి. రిజర్వ్: ప్రసిధ్ కృష్ణ, సుందర్, రియాన్ పరాగ్, జురేల్, యశస్వి జైస్వాల్.
ఇంగ్లండ్‌లో మా అంచనాలకు మించి రాణించి గిల్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. నాయకత్వ లక్షణాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గిల్, జైస్వాల్ లేకపోవడం వల్లే అభిషేక్ శర్మ, సామ్సన్ జట్టులోకి వచ్చారనే విషయం మర్చిపోవద్దు. అభిషేక్‌ను పక్కన పెట్టే పరిస్థితి లేదు కాబట్టి దురదృష్టవశాత్తూ జైస్వాల్‌కు స్థానం దక్కలేదు. బుమ్రాకు మళ్లీ విశ్రాంతినిచ్చే విషయంలో ఎలాంటి ప్రణాళికలు లేవు. ఐపీఎల్‌తో పాటు దేశవాళీలో రాణించడంతోనే జితేశ్‌ను ఎంపిక చేశాం. శ్రేయస్ విషయంలో అతని తప్పుగానీ, మా తప్పుగానీ లేదు. ఎవరి స్థానంలో అతడిని తీసుకుంటాం? తన అవకాశం కోసం అతను ఎదురు చూడాల్సిందే. – అజిత్ అగార్కర్, చీఫ్ సెలక్టర్