
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. రెండో రోజు టీ విరామం తర్వాత భారత తొలి ఇన్నింగ్స్ 587 పరుగుల వద్ద ముగిసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రికార్డు డబుల్ సెంచరీ (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి భారత్‌కు ఈ స్థాయి స్కోర్ అందించాడు.
ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి రోజు 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసిన భారత్.. ఇవాళ (రెండో రోజు) మరో 264 పరుగులు జోడించి మిగతా 5 వికెట్లు కోల్పోయింది. తొలి రోజే సెంచరీ పూర్తి చేసిన గిల్.. ఇవాళ డబుల్ సెంచరీ సాధించాడు.
భారత ఇన్నింగ్స్‌లో గిల్‌తో పాటు యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) రాణించారు. గిల్.. జడేజాతో ఆరో వికెట్‌కు 203 పరుగులు , వాషింగ్టన్ సుందర్‌తో (42) ఏడో వికెట్‌కు 144 పరుగులు జోడించాడు.
మిగతా భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ 2, కరుణ్ నాయర్ 31, రిషబ్ పంత్ 25, నితీశ్ కుమార్ రెడ్డి 1, ఆకాశ్‌దీప్ 6, సిరాజ్ 8, ప్రసిద్ద్ కృష్ణ 5 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3, క్రిస్ వోక్స్, జోష్ టంగ్ తలో 2, బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్ చెరో వికెట్ పడగొట్టారు.
కాగా, ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భారత్ ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. లీడ్స్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. చివరి రోజు వరకు ఉత్కంఠగా సాగిన ఆ మ్యాచ్‌లో భారత్ 371 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయింది.
ఆ మ్యాచ్‌లో భారత తరఫున ఐదు శతకాలు నమోదైనా ప్రయోజనం లేకుండా పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో జైస్వాల్ (101), గిల్ (147), పంత్ (134).. రెండో ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ (137), పంత్ (118) శతకాలు చేశారు.