చరిత్ర సృష్టించిన శుభ్‌మన్‌ గిల్‌.. ఆల్‌టైమ్‌ రికార్డు బద్దలు | ENG VS IND 5th Test Day 1: Shubman Gill Has The Most Runs By An Indian Captain In A Test Series, Breaks Sunil Gavaskar Record | Sakshi
Sakshi News home page

ENG VS IND 5th Test: చరిత్ర సృష్టించిన శుభ్‌మన్‌ గిల్‌.. ఆల్‌టైమ్‌ రికార్డు బద్దలు

Jul 31 2025 5:41 PM | Updated on Jul 31 2025 6:33 PM

ENG VS IND 5th Test Day 1: Shubman Gill Has The Most Runs By An Indian Captain In A Test Series, Breaks Sunil Gavaskar Record

ఇంగ్లండ్‌ గడ్డపై ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ వరుస పెట్టి రికార్డులు బద్దలు కొడుతున్నాడు. ఈ సిరీస్‌ ఆరంభం నుంచి భీకర ఫామ్‌లో ఉన్న గిల్‌.. తాజాగా మరో ఆల్‌టైమ్‌ రికార్డును బ్రేక్‌ చేసి చరిత్ర సృష్టించాడు.

లండన్‌లోని కెన్నింగ్టన్‌ ఓవల్‌ మైదానంలో ఇవాళ (జులై 31) ఐదో టెస్ట్‌ ప్రారంభం కాగా.. భారత్‌ టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. కష్టమైన పిచ్‌పై తడబడుతూనే బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. స్కోర్‌ 50 పరుగులు కూడా దాటకుండానే ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (2), కేఎల్‌ రాహుల్‌ (14) పెవిలియన్‌కు చేరారు.

ఈ దశలో బరిలోకి దిగిన గిల్‌.. ఎంతో సంయమనంగా బ్యాటింగ్‌ చేస్తూ లంచ్‌ విరామంలోపు మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. ఈ క్రమంలో గిల్‌ సునీల్‌ గవాస్కర్‌ పేరిట ఉండిన ఓ ఆల్‌టైమ్‌ రికార్డును చెరిపేసి చరిత్రపుటల్లో తన పేరును లిఖించుకున్నాడు. 11 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద గిల్‌ ఓ టెస్ట్‌ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా సునీల్‌ గవాస్కర్‌ రికార్డును బద్దలు కొట్టాడు.

1978/79 వెస్టిండీస్‌ సిరీస్‌లో గవాస్కర్‌ 732 పరుగులు చేయగా.. ప్రస్తుత ఇంగ్లండ్‌ సిరీస్‌లో గిల్‌ ఈ రికార్డును తన ఖాతాలో వేసేసుకున్నాడు. ఈ సిరీస్‌లో గిల్‌ ఇప్పటివరకు 737* పరుగులు చేశాడు. తొలి రోజు లంచ్‌ విరామం సమయానికి భారత్‌ స్కోర్‌ 72/2గా ఉంది. గిల్‌ (15), సాయి సుదర్శన్‌ (25) క్రీజ్‌లో ఉన్నారు.

ఓ టెస్ట్‌ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్‌లు
737* - శుభ్‌మన్ గిల్ vs ENG, 2025
732 - సునీల్ గవాస్కర్ vs WI, 1978/79
655 - విరాట్ కోహ్లీ vs ENG, 2016/17
610 - విరాట్ కోహ్లీ vs SL, 2017/18
593 - విరాట్ కోహ్లీ vs ENG, 2018

కాగా, ఈ మ్యాచ్‌ కోసం భారత్‌, ఇంగ్లండ్‌ జట్లు చెరో నాలుగు మార్పులు చేశారు. భారత్‌ తరఫున రిషబ్‌ పంత్‌, శార్దూల్‌ ఠాకూర్‌, బుమ్రా, అన్షుల్‌ కంబోజ్‌ స్థానాల్లో ధ్రువ్‌ జురెల్‌, కరుణ్‌ నాయర్‌, ప్రసిద్ద్‌ కృష్ణ, ఆకాశ్‌దీప్‌ తుది జట్టులోకి రాగా.. ఇంగ్లండ్‌ తరఫున బెన్‌ స్టోక్స్, ‌జోఫ్రా ఆర్చర్‌, బ్రైడన్‌ కార్స్‌, లియామ్‌ డాసన్‌ స్థానాల్లో జేకబ్‌ బేతెల్‌, గస్‌ అట్కిన్సన్‌, జోష్‌ టంగ్‌, జేమీ ఓవర్టన్‌ ప్లేయింగ్‌ ఎలెవెన్‌లోకి వచ్చారు.

ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌ 1-2తో వెనుకపడి ఉన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే భారత్‌ సిరీస్‌ను సమం చేసుకోగలుగుతుంది. ఓడినా, డ్రా అయినా ఇంగ్లండే సిరీస్‌ ఎగరేసుకుపోతుంది.  

తుది జట్లు..
భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్‌), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్‌కీపర్‌), వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్

ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్(కెప్టెన్‌), జో రూట్, హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్, జామీ స్మిత్(వికెట్‌కీపర్‌), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, జేమీ ఓవర్టన్, జోష్ టంగ్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement