
మాంచెస్టర్ టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వీరోచితంగా పోరాడుతున్నాడు. 311 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్.. ఖాతా తెరవకుండానే యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్ వికెట్లు కోల్పోగా.. గిల్.. కేఎల్ రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు రికార్డు స్థాయిలో 188 పరుగులు జోడించాక, రాహుల్ 90 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు.
రాహుల్ ఔటైనా ఏమాత్రం ఒత్తిడికి లోను కాని గిల్.. వాషింగ్టన్ సుందర్ (7) సాయంతో భారత్‌ను గట్టెక్కించే ప్రయత్నం చేస్తూ సెంచరీ పూర్తి చేశాడు. ఈ సిరీస్‌లో గిల్‌కు ఇది నాలుగో సెంచరీ. ఈ సెంచరీతో అతను దిగ్గజాల సరసన చేరాడు. ఓ టెస్ట్ సిరీస్‌లో అత్యధిక సెంచరీ చేసిన భారత ఆటగాడిగా, ఓ టెస్ట్ సిరీస్‌లో అత్యధిక సెంచరీలు చేసిన కెప్టెన్‌గా డాన్ బ్రాడ్‌మన్, సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లితో కలిసి రికార్డును షేర్ చేసుకున్నాడు.
ఓ టెస్ట్ సిరీస్‌లో భారత్ తరఫున అత్యధిక సెంచరీలు
4 - సునీల్ గవాస్కర్ vs వెస్టిండీస్, 1971 (విదేశాల్లో)
4 - సునీల్ గవాస్కర్ vs వెస్టిండీస్, 1978/79 (స్వదేశంలో)
4 - విరాట్ కోహ్లీ vs ఆస్ట్రేలియా, 2014/15 (విదేశాల్లో)
4 - శుభ్‌మన్ గిల్ vs ఇంగ్లండ్, 2025 (విదేశాల్లో)**
కెప్టెన్‌గా ఓ టెస్ట్ సిరీస్‌లో అత్యధిక సెంచరీలు
4 - సర్ డాన్ బ్రాడ్‌మన్ vs ఇండియా, 1947/48 (విదేశాల్లో)
4 - సునీల్ గవాస్కర్ vs వెస్టిండీస్, 1978/79 (స్వదేశంలో)
4 - శుభ్‌మన్ గిల్ vs ఇంగ్లాండ్, 2025 (విదేశాల్లో)**
అలాగే ఓ టెస్ట్ సిరీస్‌లో భారత్ తరఫున మూడో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా.. ఇంగ్లండ్‌లో, ఇంగ్లండ్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా, ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన ఆసియా బ్యాటర్‌గా పలు రికార్డులు సాధించాడు.
ఇంగ్లండ్ గడ్డపై ఓ టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆసియా బ్యాటర్లు
🏏శుభ్‌మన్ గిల్ (ఇండియా)- 720*- 2025లో- అత్యుత్తమ స్కోరు 269
🏏మొహమ్మద్ యూసఫ్ (పాకిస్తాన్)- 631- 2006లో- అత్యుత్తమ స్కోరు 202
🏏రాహుల్ ద్రవిడ్ (ఇండియా)- 602- 2002లో- అత్యుత్తమ స్కోరు 217
🏏విరాట్ కోహ్లి (ఇండియా)- 593- 2018లో- అత్యుత్తమ స్కోరు 149
🏏సునిల్ గావస్కర్ (ఇండియా)- 542- 1979లో- అత్యుత్తమ స్కోరు 221.
ఓ టెస్ట్ సిరీస్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు
774 - సునీల్ గవాస్కర్ vs వెస్టిండీస్, 1971 (బయట)
732 - సునీల్ గవాస్కర్ vs వెస్టిండీస్, 1978/79 (హోం)
720* - శుభ్‌మన్ గిల్ vs ఇంగ్లండ్, 2025 (బయట)
712 - యశస్వి జైస్వాల్ vs ఇంగ్లండ్, 2024 (హోం)
ఈ సెంచరీతో గిల్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌తో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు. వీరిద్దరు డబ్ల్యూటీసీ చరిత్రలో తలో 9 సెంచరీలు చేశారు.
25 ఏళ్ల వయసులో గిల్‌కు ఇది 18వ సెంచరీ. టెస్ట్‌ల్లో 9, వన్డేల్లో 8, టీ20ల్లో ఓ సెంచరీ చేశాడు. ఈ వయసులో సచిన్ 40, విరాట్ 26 సెంచరీలు చేశారు.
మాంచెస్టర్‌లో 35 ఏళ్ల తర్వాత సెంచరీ చేసిన భారత ఆటగాడిగా గిల్ రికార్డు నెలకొల్పాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. గిల్ సెంచరీ పూర్తి చేసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు భారత్ ఇంకా 105 పరుగులు వెనుకపడి ఉంది. గిల్‌కు జతగా వాషింగ్టన్ సుందర్ (7) క్రీజ్‌లోకి వచ్చాడు.
స్కోర్ వివరాలు..
భారత్ తొలి ఇన్నింగ్స్- 358 ఆలౌట్ (సాయి సుదర్శన్ 61, జైస్వాల్ 58, పంత్ 54, స్టోక్స్ 5/72)
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్- 669 ఆలౌట్ (రూట్ 150, స్టోక్స్ 141, రవీంద్ర జడేజా 4/143)