
పట్నా/గయా: బీహార్‌లో శాంతి భద్రతల పరిస్థితిపై ఎన్డీయే భాగస్వామ్య పక్షం ఎల్‌జేపీ(రాం విలాస్) చీఫ్, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యథేచ్ఛగా కొనసాగుతున్న నేరాలను ఆపలేని నితీశ్ ప్రభుత్వానికి మద్దతిస్తున్నందుకు ఆయన విచారం వ్యక్తం చేశారు. నేరాలను అడ్డుకోవడంలో విఫలమైన సర్కారు వాటిని దాచేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి.
శనివారం గయాలో జరిగిన పార్టీ ర్యాలీలో ప్రసంగం సందర్భంగా జిల్లాలో చోటుచేసుకున్న గ్యాంగ్ రేప్ ఘటనను ప్రస్తావిస్తూ పైవ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనకు కారకులైన వారిని అరెస్ట్ చేసినప్పటికీ, ఇటువంటి ఘోరాలను నివారించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమయిందన్నారు. హత్యలు, దోపిడీలు, కిడ్నాప్‌లు, అత్యాచారాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయన్నారు. పోలీసు యంత్రాంగం నేరగాళ్లకు దాసోహమంటోందని విమర్శించారు. అదేవిధంగా, తనను బాంబులతో చంపేందుకు కుట్ర జరుగుతోందంటూ మరోమారు చిరాగ్ ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో పరిస్థితి ప్రమాదకరంగా తయారైందని, ప్రభుత్వం మేలుకోవాల్సిన సమయం వచ్చందని తెలిపారు.
రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తా..
ఎన్నికలయ్యాక ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వం ‘బీహార్ ఫస్ట్–బీహారీ ఫస్ట్’ లక్ష్యంతో పనిచేస్తుందని, నేరగాళ్లను కటకటాల్లోకి నెడుతుందని హామీ ఇచ్చారు. అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో సమానంగా బిహార్ ఉండాలన్నదే తన లక్ష్యమన్నారు. ఇప్పటికే మూడు పర్యాయాలు ఎంపీగా పనిచేసినందుకు ఢిల్లీలో ఉంటే తన లక్ష్యం నెరవేరదని తెలుసుకున్నానని చెప్పారు. అందుకే, కేంద్ర రాజకీయాలను వదిలి రాష్ట్రానికి రావాలనుకుంటున్నానని, ఈ విషయంలో తుది నిర్ణయం పార్టీయే తీసుకుంటుందని చిరాగ్ తెలిపారు.

ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ నూటికి నూరు శాతం ఫలితాలను సాధించిందని, అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే ఒరవడిని కొనసాగించాలని భావిస్తున్నామన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో స్వయంగా పోటీ చేస్తానంటూ ప్రకటించిన చిరాగ్.. తనకు సీఎం కుర్చీపై ఎటువంటి మోజు లేదని ఇప్పటికే చెప్పారు. ప్రతిపక్ష ఆర్జేడీపైనా ఆయన విరుచుకుపడ్డారు. ఆ పార్టీ నేరగాళ్లను పోషిస్తూ విభజన రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. ముస్లింల ఓట్లు తమవేనంటూ ఆర్జేడీ గొప్పగా చెప్పుకుంటోందని, తమ పారీ్టకి కూడా సొంత ఓటు బ్యాంకు ఉందని చిరాగ్ అన్నారు. బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార ఎన్డీయేలో విభేదాలు ముదురుతున్నాయనేందుకు చిరాగ్ వ్యాఖ్యలను ఉదాహరణగా చెబుతున్నారు.