
పవన్ కల్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు'కు బాయికాట్ దెబ్బ గట్టిగానే తగిలింది. సినిమా వేదికలపై రాజకీయాలు మాట్లాడి వివాదంలో చిక్కుకున్న ఏ చిత్రం బతికి బట్ట కట్టలేదని మరోసారి నిరూపితం అయింది. ఎంత పెద్ద హీరో ఉన్నా సరే ఆ సినిమాకు కష్టాలే ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే గేమ్ ఛేంజర్, లైలా, రిపబ్లిక్, మట్కా వంటి చిత్రాలు బాయికాట్ దెబ్బతో మొదటిరోజే కనిపించకుండా పోయాయి. ఇప్పుడు హరిహర మీరమల్లు కూడా మొదటిరోజే ప్యాకప్ చెప్పే పరిస్థితి వచ్చింది. సినిమాలు చేసుకోండి. కానీ, ఆ వేదికలపై రాజకీయ వ్యాఖ్యలు చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాల కలెక్షన్స్ ఒక ఉదాహరణగా చెప్పొచ్చు.
'హరి హర వీరమల్లు' మొదటిరోజు కలెక్షన్స్
హరిహర వీరమల్లును ఎలాగైనా నిలబెట్టాలని పవన్ కల్యాణ్ అనుకున్నారు. కానీ, సినిమా వేదికపై ఆయన రాజకీయాలు మాట్లాడటం.. ఆపై ఆజ్యం పోసేలా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పరుష వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో వైఎస్సార్‌సీపీ అభిమానులు భగ్గుమన్నారు. #BoycottHHVM హ్యాష్‌ట్యాగ్‌తో ట్రెండ్ చేశారు. ఈ దెబ్బ గట్టిగానే వీరమల్లుకు గుచ్చుకుంది. ఈ చిత్రం ప్రచారం కోసం పవన్ కల్యాణ్ ఏకంగా మూడు రోజులు ప్రచారంలోనే మునిగిపోయారు. వరుస మీడియా సమావేశాలు ఆపై సోషల్మీడియా ఇన్‌ఫ్లూయన్సర్లతో సెల్ఫీలు వంటివి గట్టిగానే చేశారు. కేవలం ఆయన చేసిన రాజకీయ వ్యాఖ్యల వల్ల ఆ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరులా అయిపోయింది.
పుష్ప2 సినిమా మొదటిరోజు కలెక్షన్స్ (294 కోట్లు) దాటేస్తామని చెప్పుకున్న పవన్ ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలింది. ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోలతో కలిపి మొదటిరోజు రూ. 70 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే 'వీరమల్లు' రాబట్టింది. నెట్ పరంగా అయితే రూ. 47 కోట్లు మాత్రమేనని ప్రముఖ వెబ్‌సైట్ సాక్నిల్క్ పేర్కొంది. సినిమా టికెట్ల ధరలు భారీగా పెంచి ఆపై 700 వందలకు పైగా ప్రీమియర్ షోలు వేస్తేనే కలెక్షన్స్ ఇలా ఉంటే... ఎలాంటి బెనిఫిట్స్ లేకుంటే 'వీరమల్లు' పరిస్థితి ఊహించుకోవడమే కష్టమని చెప్పవచ్చు.
వీరమల్లుకు బెనిఫిట్ షోల ద్వారా రూ. 12.75 కోట్ల నెట్ వస్తే.. మొదటిరోజు రూ. 34.5 కోట్ల నెట్ కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా వచ్చిందని సాక్నిల్క్ పేర్కొంది. హైదరాబాద్, విజయవాడలో మాత్రమే అత్యధికంగా టికెట్లు అమ్ముడుపోయాయని ఆ సంస్థ తెలిపింది. పుష్ప2 హిందీ వెర్షన్ మొదటి రోజున రూ. 72 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఆ రికార్డ్‌ను 'వీరమల్లు' మొత్తం కలెక్షన్స్తో కూడా టచ్ చేయలేకపోయాడు.
