ఆస్కార్ అవార్డు గెలిస్తే నింగిలోని చందమామను అందుకున్నంత సంతోషం! ఒక్కసారైనా ఆస్కార్ గెలవాలని కలలు కనే ఆర్టిస్టులు ఎంతోమంది. కనీసం అకాడమీ అవార్డుల వేడుకను దగ్గరినుంచైనా చూసి తరించాలనుకునేవారు బోలెడంతమంది! ప్రపంచ ప్రఖ్యాతికెక్కిన ఈ ఆస్కార్ వేడుకలు 1929లో మొదలయ్యాయి. అప్పుడు 12 విభాగాల్లో అవార్డులు అందించేవారు. ఇప్పుడు వాటి సంఖ్య 24 కేటగిరీలకు చేరింది.
ఆస్కార్ చరిత్రలో చెరగని చిరునామా
ఆస్కార్ చరిత్రలో అత్యధిక నామినేషన్లు అందుకున్న వ్యక్తిగా సంగీత దర్శకుడు జాన్ విలియమ్స్ పేరిట చెక్కుచెదరని రికార్డు ఉంది. ఇప్పటివరకు 54 నామినేషన్లు దక్కించుకోగా ఐదుసార్లు పురస్కారం గెలిచాడు. వాల్ట్ డిస్నీ ఏకంగా 26 ఆస్కార్‌లు అందుకుని చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. ఇకపోతే అకాడమీ పురస్కారాన్ని వేలం వేయకూడదు, బయట అమ్మకూడదు. అంతలా వద్దనుకుంటే అకాడమీకే తిరిగివ్వాలి.. అది కూడా కేవలం ఒక్క డాలర్‌కి మాత్రమే!
వారిపై బ్యాన్
ఈ అవార్డుల ఫంక్షన్ కోసం ఏకంగా రూ.500 కోట్ల మేర ఖర్చుపెడతారు. అంగరంగ వైభవంగా జరిగే ఈ కార్యక్రమానికి రమ్మని పిలుపు వస్తే సంబరంతో పరిగెత్తేవారెందరో!. అయితే కొందరిపై మాత్రం ఆస్కార్ ఈవెంట్‌కు హాజరవకుండా, అవార్డులకు నామినేట్ అవకుండా నిషేధం అమల్లో ఉంది. వాళ్లెవరంటే.. మీటూ ఉద్యమం సమయంలో సినీ నిర్మాత హార్వే వైయిన్ స్టీన్ లైంగిక వేధింపుల కేసులో దోషిగా తేలాడు. దీంతో అతడిని అకాడమీ కమిటీ బ్యాన్ చేసింది.
విల్ స్మిత్‌పై నిషేధం.. కాకపోతే!
2022లో కమెడియన్ క్రిస్ రాక్.. స్మిత్ భార్యపై జోక్ వేశాడు. దీంతో అతడు ఆవేశంగా స్టేజీపైకి వచ్చి క్రిస్ చెంప చెళ్లుమనిపించాడు. దీని కారణంగా విల్ స్మిత్‌పై పదేళ్ల నిషేధం పడింది. అయితే అతడి నామినేషన్స్‌పై మాత్రం వేటు వేయలేదు. మైనర్‌పై లైంగిక వేధింపుల కారణంగా దర్శకుడు రోమన్ పోలంస్కిని, లైంగిక వేధింపుల కేసులో దోషిగా తేలిన కమెడియన్ బిల్ కాస్బీని సైతం అకాడమీ నిషేధించింది.
నేర చరిత్ర
ఆస్కార్‌కు నామినేట్ అయిన సినిమాలను పైరసీ చేస్తున్నాడని గుర్తించి నటుడు కార్మైన్ కార్డీని సైతం బ్యాన్ చేసింది. లైంగిక నేరాల చరిత్ర కారణంగా నటుడు, సినిమాటోగ్రాఫర్ ఆడమ్ కిమ్మెల్‌పైనా నిషేధం విధించింది. ఇలా ఈ ఆరుగురు నటులను ఆస్కార్ వేదికపైకి రాకుండా దూరం పెట్టింది.
చదవండి: 98వ ఆస్కార్.. పూర్తి జాబితా


