
ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 టోర్నీలో పాకిస్తాన్ ఛాంపియన్స్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. ఈ టోర్నీలో భాగంగా శనివారం లీడ్స్ వేదికగా వెస్టిండీస్ ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 49 పరుగుల తేడాతో పాక్ గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఛాంపియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. పాక్ ఓపెనర్ కమ్రాన్ ఆక్మల్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. 43 ఏళ్ల ఆక్మల్ విండీస్ బౌలర్లను ఊతికారేశాడు.
లీడ్స్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. 62 బంతులు ఎదుర్కొన్న ఆక్మల్.. 13 ఫోర్లు, 5 సిక్స్‌లతో 113 పరుగులు చేశాడు. అతడితోపాటు హాఫీజ్(23) రాణించాడు. విండీస్ బౌలర్లలో మహ్మద్, పొలార్డ్, బ్రావో, నర్స్ తలా వికెట్ సాధించారు.
అనంతరం లక్ష్య చేధనలో వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 151 పరుగులకే పరిమితమైంది. విండీస్ టాపర్డర్ మొత్తం విఫలమైంది. క్రిస్ గేల్(5),స్మిత్(3), సిమ్మన్స్(0) తీవ్ర నిరాశపరిచారు. అయితే మిడిలార్డర్‌లో వాల్టన్(42), పెర్కిన్స్(30) పోరాడనప్పటికి విండీస్‌కు ఓటమి తప్పలేదు.
పాక్ బౌలర్లలో రీస్ మూడు వికెట్లు పడగొట్టగా.. తన్వీర్, యమీన్ తలా రెండు వికెట్లు సాధించారు. కాగా ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ విజయం సాధించిన పాక్.. పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో కొనసాగుతోంది.