
టీమిండియా యువ బ్యాటర్, హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ దులీప్ ట్రోఫీ-2025 కోసం సౌత్ జోన్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అతనికి డిప్యూటీగా (వైస్ కెప్టెన్) కేరళకు చెందిన మహ్మద్ అజహారుద్దీన్ నియమితుడయ్యాడు.
దులీప్ ట్రోఫీ కోసం 16 మంది రెగ్యులర్ సభ్యులు, ఆరుగురు స్టాండ్ బై ప్లేయర్లతో కూడిన జట్టును నిన్న ఎంపిక చేశారు. ఈ జట్టులో తిలక్‌తో పాటు దేవ్‌దత్ పడిక్కల్, రవి శ్రీనివాసన్ సాయి కిషోర్ లాంటి ఐపీఎల్ స్టార్లు చోటు దక్కించుకున్నారు.
ఈ సీజన్ దులీప్ ట్రోఫీ గతంలో జరిగిన జోనల్ విధానంలోనే (ఆరు జట్లు) జరుగనుంది. గత సీజన్‌లో ఈ టోర్నీని నాలుగు జట్లతో (ఇండియా ఏ, బి, సి, డి) నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సీజన్ దులీప్ ట్రోఫీ ఆగస్ట్ 28 నుంచి సెప్టెంబర్ 11 వరకు జరుగనుంది.
భీకర ఫామ్‌లో తిలక్
సౌత్ జోన్ కెప్టెన్‌గా ఎంపికైన తిలక్ వర్మ ప్రస్తుతం ఇంగ్లండ్‌లో జరుగుతున్న కౌంటీ మ్యాచ్‌ల్లో భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్‌తోనే హ్యాంప్‌షైర్ తరఫున కౌంటీ అరంగేట్రం చేసిన తిలక్.. తన తొలి మ్యాచ్‌లోనే అద్బుతమైన సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. అనంతరం వరుసగా 56, 47 పరుగులు చేసి, ఆతర్వాత మరో సెంచరీతో మెరిశాడు.
అంతర్జాతీయ కమిట్‌మెంట్స్ కారణంగా గత రంజీ సీజన్‌లో హైదరాబాద్ జట్టుకు అందుబాటులో లేని తిలక్ ఈ దేశవాలీ సీజన్ ప్రారంభంలోనే సౌత్‌జోన్‌కు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
సౌత్ జోన్ దులీప్ ట్రోఫీ 2025 జట్టు: తిలక్ వర్మ (కెప్టెన్) (హైదరాబాద్), మహ్మద్ అజహారుద్దీన్ (వైస్ కెప్టెన్) (కేరళ), తన్మయ్ అగర్వాల్ (హైదరాబాద్), దేవదత్ పడిక్కల్ (కర్ణాటక), మోహిత్ కాలే (పాండిచ్చేరి), సల్మాన్ నిజర్ (కేరళ), నారాయణ్ జగదీసన్ (తమిళనాడు), త్రిపురణ విజయ్ (ఆంధ్ర), ఆర్ సాయి కిషోర్ (తమిళనాడు), తనయ్ త్యాగరాజన్ (హైదరాబాద్), విజయ్‌కుమార్ వైషాక్ (కర్ణాటక), నిధీష్ ఎండి (కేరళ), రికీ భుయ్ (ఆంధ్ర), బాసిల్ ఎన్‌పి (కేరళ), గుర్జప్‌నీత్ సింగ్ (తమిళనాడు), స్నేహల్ కౌతాంకర్ (గోవా)
స్టాండ్ బై ప్లేయర్లు: మోహిత్ రెడ్కర్ (గోవా), ఆర్ స్మరణ్ (కర్ణాటక), అంకిత్ శర్మ (పాండిచ్చేరి), ఈడెన్ యాపిల్ టామ్ (కేరళ), ఆండ్రీ సిద్దార్థ్ (తమిళనాడు), షేక్ రషీద్ (ఆంధ్ర).