
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట రంగనాయక సాగర్ రిజర్వాయర్ కట్టపై సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆఫ్ మారథాన్‌ను ఆదివారం నిర్వహించారు. సపోర్టింగ్ స్పాన్సర్‌గా సాక్షి మీడియా గ్రూప్ వ్యవహరించింది. రన్నర్స్, యువత ప్రజలు ఉత్సాహంగా రన్‌లో పాల్గొన్నారు. 5k,10 k, 21 కిలోమీటర్ల పరుగుపందెం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు హాజరయ్యారు. గెలుపొందిన విజేతలకు నగదు పురస్కారాలను అందజేశారు. రన్ చేసిన వారికి మెడల్స్‌ను అందజేశారు.
200 మందికి పైగా..
2023 మార్చి 8న సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ ఏర్పాటైంది. ప్రస్తుతం 200 మందికి పైగా సభ్యులు ఉన్నారు. పరుగెత్తుతూ.. ఆరోగ్యంగా జీవిద్దాం అనే లక్ష్యంతో ఆవిర్భవించిన ఈ సంఘంలో ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, వివిధ వృత్తులు, వయసుల వారున్నారు. వివిధ ప్రాంతాల్లో జరిగే పోటీల్లో అసోసియేషన్ సభ్యులు పాల్గొని పతకాలు సాధిస్తున్నారు. 100 మంది మారథాన్ స్థాయికి ఎదిగారు.
3100 మంది నమోదు..
సిద్దిపేట వేదికగా హాఫ్ మారథాన్ నిర్వహణకు రెండు నెలలుగా కసరత్తు చేశారు. 40 మందితో కార్వనిర్వాహక కమిటీ ఏర్పాటైంది. సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేశారు. పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. రెండు నెలల కిందట ఆన్‌లైన్‌లో నమోదు ప్రారంభించారు. 5K, 10K, 21K విభాగాల్లో పోటీలు జరుగుతాయి. హాఫ్ మారథాన్‌లో 300 మంది, 10 కి.మీ. విభాగంలో 250 మంది, 5 కి.మీ. విభాగంలో 2550 మంది నమోదు చేసుకున్నారు.
ఓసారి తెలుసుకుందాం..
మారథాన్ అంటే 42.195 కి.మీ. మేర, హాఫ్ మారథాన్ అంటే 21.975 కి.మీ. మేర పరుగెత్తాలి. నడకతో మొదలెట్టి పరుగు వరకు.. ఏ దశలోనైనా చేరవచ్చు. విజయానికి సమయం నిర్దేశిస్తారు. పరుగెత్తే వారిని మారథాన్ రన్నర్స్‌గా పిలుస్తారు. ప్రపంచ జనాభాలో 0.01 శాతం మాత్రమే మారథాన్ రన్నర్స్ ఉన్నారు.