వైతరణి ఉగ్రరూపం : వరద బెడద | Amid Heavy Rain Flood Threat Looms Over Odisha As Major Rivers Breach Danger Mark | Sakshi
Sakshi News home page

Odisha వైతరణి ఉగ్రరూపం : వరద బెడద

Jul 27 2025 1:04 PM | Updated on Jul 27 2025 1:19 PM

Amid Heavy Rain Flood Threat Looms Over Odisha As Major Rivers Breach Danger Mark

ఉప్పొంగుతున్న నదులు : రాష్ట్రానికి వరద బెడద 

విస్తారంగా కురుస్తున్న వర్షాలు

అంతకంతకూ పెరుగుతున్న నీటిమట్టం 

అప్రమత్తమైన ప్రభుత్వ  యంత్రాంగం

 ఒడిశా, భువనేశ్వర్‌: రాష్ట్రంలో వరదలతో నదులు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల ప్రమాద సంకేతం దాటి తీర ప్రాంతాల్లో కట్టలను బలహీనపరుస్తున్నాయి. నదీతీర ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నారు. ప్రాణహాని జరగకుండా సమగ్ర యంత్రాంగం చురుకుగా పని చేస్తోందని రాష్ట్ర జల వనరుల శాఖ పేర్కొంది. ప్రధానంగా సువర్ణ రేఖ, వైతరణి, జలకా నదుల్లో వరద ఉద్ధృతి విపరీతంగా కొనసాగుతోంది. ఈ నదుల్లో నీటిమట్టం పలు తీర ప్రాంతాల్లో గరిష్ట పరిమితికి మించి ఉంది. వైతరణి నది ఆనందపూర్, అఖుపొదా, జలకా నది మథాని తీరం, సువర్ణ రేఖ నది జంసోలా ఘాట్, రాజ్‌ఘాట్‌ తీర ప్రాంతాల్లో గరిష్ట పరిమితిని మించి ప్రవహిస్తున్నాయి. ఈ నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల అంచనా. 

ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధం 
రాష్ట్రంలో వరద ముంపు పరిస్థితి తలెత్తే ప్రమాదం పొంచి ఉంది. ఈ పరిస్థితి నివారణ కోసం ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధమైంది. నదుల్లో వరద పరిస్థితిని నియంత్రించడానికి ప్రభుత్వం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి కార్యాచరణ ఖరారు చేసింది. అల్ప పీడనం కారణంగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావంతో వివిధ నదుల నీటి మట్టం గణనీయంగా పెరుగుతోంది. నదుల్లో నీటిమట్టం పెరుగుతున్నందున వరద ముంపు పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని జలవనరుల శాఖ చీఫ్‌ ఇంజినీర్‌ చంద్రశేఖర్‌ పాఢి శనివారం విలేకరులకు తెలియజేశారు. అవసరమైతే లోతట్టు వరద తాకిడి ప్రాంతాల్లో ప్రజలను ఖాళీ చేసి సురక్షిత ప్రదేశాలకు తరలిస్తామన్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా బాలాసోర్‌ జిల్లాలో 4 మండలాలు మళ్లీ ప్రభావితం అవుతాయని భావిస్తున్నారు. వాటిలో బలియాపాల్, భొగొరాయ్, బొస్తా, జలేశ్వర్‌ ఉన్నాయి. 

నిరంతర నిఘా 
ఉప్పొంగుతున్న నదీతీర ప్రాంతాల్లో పరిస్థితులపై అనుబంధ యంత్రాంగం నిరంతర నిఘా పెడుతోంది. రాష్ట్ర వరద విభాగం రాత్రింబవళ్లు చురుకుగా పని చేస్తుందని చంద్రశేఖర్‌ పాఢి తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్లకు అప్రమత్తం చేశారు. జాజ్‌పూర్, భద్రక్‌ – బాలసోర్‌ జిల్లా కలెక్టర్లు నదీతీర ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు, క్షేత్రస్థాయిలో అనుబంధ సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. సువర్ణరేఖ, బుఢా»ొలంగ్, మహానది, బ్రాహ్మణి, వైతరణి వ్యవస్థ నుంచి చీఫ్‌ ఇంజినీర్లు, బేసిన్‌ మేనేజర్లు జిల్లా యంత్రాంగంతో సమన్వయ కార్యాచరణను పర్యవేక్షిస్తున్నారు. భువనేశ్వర్‌ నుంచి ఇద్దరు ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లను ప్రభావిత ప్రాంతాలకు తరలించారు. ఈ ఉన్నతాధికారులు సువర్ణరేఖ బేసిన్, వైతరణి బేసిన్‌ పరిధిలో వారు క్షేత్రస్థాయిలో వరద నిర్వహణను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. ఈ రెండు నదుల్లో నీటి మట్టాలు ప్రమాద స్థాయిని దాటిన తర్వాత ఈ అధికారులను తరలించారు. 

 

వైతరణి ఉగ్రరూపం 
భద్రక్‌ జిల్లా అఖుపొడా తీరంలో వైతరణి ఉగ్రరూపం దాల్చుతోంది. ఈ మేరకు కలెక్టర్‌ వరద హెచ్చరికను జారీ చేశారు. చాంద్‌బాలి, ధామ్‌నగర్‌లు తీవ్రంగా, భొండారి, పొఖొరి ప్రాంతాలు పాక్షికంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. నదీతీర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మయూర్‌భంజ్‌ జిల్లాలో రాసగోవింద్‌పూర్, మోర్దా, షులియాపడా, చిత్రాడ్‌ మొదలైన ప్రాంతాల్లో ఎగువ పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా జలకా నది నీటిమట్టం పెరుగుతోంది. ఇటీవల ఈ ప్రాంతం వరదలకు గురై వందలాది హెక్టార్లలోని వరి పొలాలు నాశనమయ్యాయి. ఈ పరిస్థితి దిగజారకుంటే బొస్తా మండలంలో 8 పంచాయతీలు, సదర్‌ మండలంలో 2 పంచాయతీలు ప్రభావితం అవుతాయని భయపడుతున్నారు. వివిధ ప్రదేశాల్లో కరకట్టలు బలహీనంగా ఉండడంతో నదితీర ప్రాంత ప్రజలు బిక్కు బిక్కుమంటున్నారు. 

ఇదీ చదవండి: చదివింది పదో తరగతే... కట్‌ చేస్తే కోట్లలో సంపాదన

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement