
ఒడిశా, రాయగడ: భిన్న సంస్కృతులతో భాషిళ్లుతున్న మన రాష్ట్రం కళలకు పుట్టినిళ్లని మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ గిరిధర్ గొమాంగో అన్నారు. స్థానిక బిజు పటా్నయక్ ఆడిటోరియంలో ఆదివారం మా మజ్జిగౌరి ఎంటర్‌టైన్మంట్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన రాయగడ టాలెంట్ అవార్డు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కళాకారులనుద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రానికి చెందిన ఎంతో మంది కళాకారులు దేశ, విదేశాల్లో తమ ప్రతిభను చాటుకుని ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారన్నారు. ప్రముఖ గాయకుడు రఘునాథ్ పాణిగ్రహి అనేక తెలుగు చలన చిత్రాల్ల్రో తన మధురమైన స్వరంతో పాటలు పాడి అందరినీ మైమరపించారని గుర్తు చేశారు.
ఎంతో మంది కళామతల్లిని నమ్ముకుని ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కళాకారులను, కళలను ప్రోత్సాహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కళారంగంలో వారు రాణించగలిగితే రాష్ట్రం కళారంగంలో మరొ మైలురాయి చేరుకునే అవకాశం ఉంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కళారంగాన్ని నమ్ముకుని ఉన్న ఎంతో మంది సీనియర్ కళాకారులు నేడు అత్యంత దయనీయమైన స్థితిలో ఉన్నారన్నారు. అటువంటి వారిని గుర్తించి ప్రభుత్వం వారిని ఆదుకోవడంతోపాటు నెల వారి పింఛన్‌ను అందివ్వాలన్నారు. డు యువ కళాకారులు వారి ప్రతిభను చాటి అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారన్నారు.
ఇటువంటి తరహా ప్రోత్సాహం అవసరం..
కళాకారులను గుర్తించి వారికి ఆయా రంగంలో ప్రోత్సాహించడంతోపాటు వారికి కళలపై మరింత మక్కువ కలిగేలా మా మజ్జిగౌరి ఎంటర్‌టైన్మంట్ ట్రస్టును రాయగడలో ఏర్పాటు చేయడం ఆ ట్రస్టు ద్వారా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక అన్నారు. ప్రతీ కళాకారునికి చేయూతనందించే ఇటువంటి తరహా సంస్థలు మరిన్ని ముందుకు రావాలని ఆకాంక్షించారు. ట్రస్టు అధ్యక్షుడు బొచ్చా సంతోష్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బిజేపీ జిల్లా అధ్యక్షుడు గోపి ఆనంద్, యాల్ల కొండబాబు, భువనేశ్వర్‌కు చెందిన ఒడిశా కళాక్షేత్రం కార్యదర్శి బాసుదేవ్, అఖిల ఒడిశా స్వచ్ఛ సేవా మహాసంఘం కార్యదర్శి సుజాత తదితరులు ప్రసంగించారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన కళాకారులకు ఈ సందర్భంగా సన్మానించారు.