
హిందూ పురాణాలు, భారతీయుల నమ్మకం ప్రకారం... జ్ఞాన దేవత అయిన సరస్వతీ దేవిని ( Goddess Saraswati) పుస్తక రూపంగా భావిస్తారు. పుస్తకం జీవన దీపికగా, నిత్యం మనకు సత్యా– అసత్యాల వాస్తవ మార్గాన్ని చూపిస్తూ, అజ్ఞానం నుండి జ్ఞానం వైపు తీసుకెళ్లే దారిగా నిలుస్తుంది. సంస్కృతంలో ప్రసిద్ధమైన మాట ‘పుస్తకం హస్త భూషణం’. అంటే పుస్తకం చేతికి అలంకారమని అర్థం. పుస్తకం ఉత్తమ మిత్రుడు, గురువు, తత్వవేత్త కూడా. ‘అపరిమితంగా చదివినవాడే గొప్ప వాగ్ధాటి గల వక్త కాగలడు’ అన్న మాట పుస్తక పఠనానికి ఉన్న ప్రాముఖ్యాన్ని సూచిస్తుంది. నిస్సందేహంగా, ఈ రోజు మనం జీవిస్తున్న ప్రపంచాన్ని తీర్చిదిద్దడంలో పుస్తకాల పాత్ర అమోఘం. రాతియుగం నుండి నేటి జనరేటివ్ ఏఐ యుగం వరకు మనల్ని నడిపించింది పుస్తకం. ఇది మన నాగరికత, శాస్త్రీయ పురోగతికి పునాది వేసినది.
అయితే నేడు పుస్తకాలు అత్యంత నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. పుస్తకాలను నగరాల్లోని ప్రధాన రహదారుల ఫుట్‌పాత్‌లపై అమ్మడం తెలిసిందే. కానీ పాదరక్షలను ఎయిర్ కండిషన్డ్ షోరూమ్‌లలో ఉంచి అమ్ముతున్నారు. ఇది చేదు వాస్తవం అయినప్పటికీ, ఎవ్వరూ ఖండించలేని పచ్చి నిజం. విద్యాసంస్థలు దేవాలయాలు అయితే, గ్రంథాలయాలు సాక్షాత్తూ గర్భగుడులే. గర్భగుడిలో ఎవరు ఉంటారో మనందరికీ తెలుసు. అందువల్ల పుస్తకాలను గౌరవంగా ప్రార్థన గదిలో కాకపోయినా, పవిత్ర స్థలంలో ఉంచడం ద్వారా గౌరవించాలి.
చదవండి: చదివింది పదో తరగతే... కట్ చేస్తే కోట్లలో సంపాదన
ఈ మార్పు ఎలా జరిగింది అనే దానిపై మనం లోతుగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇది నాగరికతా? సంస్కృతా?ఆధునికీకరణ పేరుతో, మనం స్నానపు గదిలో వంట చేయలేము; వంట గదిలో స్నానం చేయలేము అనే కఠినమైన వాస్తవికతను అర్థం చేసుకోవాలి. ఈ కార్యకలా పాలన్నీ ఇంట్లో వాటికి కేటాయించిన ప్రదేశాలలో జరగాలి. విలాసాలు, వినోదాల కోసం వేల రూపాయలు ఖర్చు చేయడానికి వెనుకాడటం లేదు కానీ వంద రూపాయలు ఖర్చుచేసి ఒక పుస్తకం కొనడానికి సంకోచిస్తున్నాడు మనిషి. పుస్తకాలకు (జ్ఞానానికి) మళ్ళీ తగిన స్థానం కల్పించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలి. లేదంటే భవిష్యత్తు తరాలు మనల్ని ‘విద్యావంతులైన మూర్ఖులు’గా చరిత్ర పుటల్లో గుర్తుంచుకుంటాయి.
– రెడ్డి శేఖర్ రెడ్డి గుడిశ
ఇంగ్లిష్ అసోసియేట్ ప్రొఫెసర్, క్రైస్ట్ యూనివర్సిటీ, బెంగళూరు