ఆధ్యాత్మిక, భౌతిక సమస్యలకు ఇందులో పరిష్కారాలు
చైనా పండితుల ప్రశంసలు
బీజింగ్: భగవద్గీత జ్ఞానామృతమంటూ ప్రశంసలు చైనా పండితులు కురిపించారు. ఆధునిక కాలంలో ప్రజలు ఎదుర్కొనే ఆధ్యాత్మిక, భౌతిక సమస్యలకు సమాధానాలు ఇందులో ఉన్నాయన్నారు. భగవద్గీత భారతీయ నాగరికత సూక్ష్మ చరిత్ర వంటిదంటూ శ్లాఘించారు. ఈ ప్రాచీన భారతీయ గ్రంథరాజంపై చైనీయులు ఇలా బహిరంగంగా గౌరవాన్ని ప్రకటించడం అరుదైన విషయంగా చెబుతున్నారు.
శనివారం చైనా రాజధాని బీజింగ్‌లో భారత దౌత్యకార్యాలయం ‘సంగమమ్– భారతీయ తాత్విక సంప్రదాయాలు’అంశంపై నిర్వహించిన చర్చాగోష్టిలో పలువురు పండితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు గీతను భారతీయ తత్వశాస్త్ర విజ్ఞాన సర్వస్వంగా అభివరి్ణంచారు. ఆధ్యాత్మిక, భౌతిక అన్వేషణల మధ్య సామరస్యాన్ని సాధించేందుకు భగవద్గీత ఎంతో సాయంగా ఉంటుందన్నారు.
భగవద్గీతను చైనీస్ భాషలోకి తర్జుమా చేసిన ప్రొఫెసర్ ఝాంగ్ బావోషేంగ్(88) ఈ కార్యక్రమంలో కీలక ప్రసంగం చేశారు. భగవద్గీతను భారతదేశ ఆధ్యాత్మిక ఇతిహాసం, తాత్విక విజ్ఞాన సర్వస్వంగా ఆయన పేర్కొన్నారు. ఇది నేటికీ భారతీయ జీవనాన్ని తీర్చిదిద్దుతోందని చెప్పారు. ప్రొఫెసర్ ఝాంగ్ భారత్‌లో 1984–86 సంవత్సరాల మధ్య గడిపిన తన అనుభవాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. దక్షిణాగ్రాన కన్యాకుమారి నుంచి ఉత్తరాన ఉన్న గోరఖ్‌పూర్ వరకు ప్రతిచోటా శ్రీకృష్ణుని ఉనికిని, ఒక సజీవ నైతిక, ఆధ్యాత్మిక ఆదర్శాన్ని ప్రత్యక్షంగా గమనించానన్నారు.
జెజియాంగ్ విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ ఓరియంటల్ ఫిలాసఫీ రీసెర్చ్ డైరెక్టర్ ప్రొఫెసర్ వాంగ్ ఝి–చెంగ్ మాట్లాడుతూ.. 5 వేల ఏళ్ల క్రితం ప్రాచీన భారతీయ యుద్ధరంగంలో జరిగిన సంభాషణ అయిన భగవద్గీత, నేడు ప్రజలు ఎదుర్కొంటున్న ఆందోళనలు, అనేక గందరగోళాలకు సైతం సరైన సమాధానాలను ఇస్తూ కాలాతీతంగా మారిందన్నారు. కార్యక్రమానికి వచ్చిన పండితులకు భారత రాయబారి ప్రదీప్ కుమార్ రావత్ ఘనస్వాగతం పలికారు. గతేడాది తమ దౌత్య కార్యాలయం రామాయణంపై ఏర్పాటు చేసిన సదస్సుకు కొనసాగింపుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.


