breaking news
Indian civilization
-
ప్రపంచ జ్ఞానామృతం భగవద్గీత
బీజింగ్: భగవద్గీత జ్ఞానామృతమంటూ ప్రశంసలు చైనా పండితులు కురిపించారు. ఆధునిక కాలంలో ప్రజలు ఎదుర్కొనే ఆధ్యాత్మిక, భౌతిక సమస్యలకు సమాధానాలు ఇందులో ఉన్నాయన్నారు. భగవద్గీత భారతీయ నాగరికత సూక్ష్మ చరిత్ర వంటిదంటూ శ్లాఘించారు. ఈ ప్రాచీన భారతీయ గ్రంథరాజంపై చైనీయులు ఇలా బహిరంగంగా గౌరవాన్ని ప్రకటించడం అరుదైన విషయంగా చెబుతున్నారు. శనివారం చైనా రాజధాని బీజింగ్‌లో భారత దౌత్యకార్యాలయం ‘సంగమమ్– భారతీయ తాత్విక సంప్రదాయాలు’అంశంపై నిర్వహించిన చర్చాగోష్టిలో పలువురు పండితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు గీతను భారతీయ తత్వశాస్త్ర విజ్ఞాన సర్వస్వంగా అభివరి్ణంచారు. ఆధ్యాత్మిక, భౌతిక అన్వేషణల మధ్య సామరస్యాన్ని సాధించేందుకు భగవద్గీత ఎంతో సాయంగా ఉంటుందన్నారు. భగవద్గీతను చైనీస్ భాషలోకి తర్జుమా చేసిన ప్రొఫెసర్ ఝాంగ్ బావోషేంగ్(88) ఈ కార్యక్రమంలో కీలక ప్రసంగం చేశారు. భగవద్గీతను భారతదేశ ఆధ్యాత్మిక ఇతిహాసం, తాత్విక విజ్ఞాన సర్వస్వంగా ఆయన పేర్కొన్నారు. ఇది నేటికీ భారతీయ జీవనాన్ని తీర్చిదిద్దుతోందని చెప్పారు. ప్రొఫెసర్ ఝాంగ్ భారత్‌లో 1984–86 సంవత్సరాల మధ్య గడిపిన తన అనుభవాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. దక్షిణాగ్రాన కన్యాకుమారి నుంచి ఉత్తరాన ఉన్న గోరఖ్‌పూర్ వరకు ప్రతిచోటా శ్రీకృష్ణుని ఉనికిని, ఒక సజీవ నైతిక, ఆధ్యాత్మిక ఆదర్శాన్ని ప్రత్యక్షంగా గమనించానన్నారు. జెజియాంగ్ విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ ఓరియంటల్ ఫిలాసఫీ రీసెర్చ్ డైరెక్టర్ ప్రొఫెసర్ వాంగ్ ఝి–చెంగ్ మాట్లాడుతూ.. 5 వేల ఏళ్ల క్రితం ప్రాచీన భారతీయ యుద్ధరంగంలో జరిగిన సంభాషణ అయిన భగవద్గీత, నేడు ప్రజలు ఎదుర్కొంటున్న ఆందోళనలు, అనేక గందరగోళాలకు సైతం సరైన సమాధానాలను ఇస్తూ కాలాతీతంగా మారిందన్నారు. కార్యక్రమానికి వచ్చిన పండితులకు భారత రాయబారి ప్రదీప్ కుమార్ రావత్ ఘనస్వాగతం పలికారు. గతేడాది తమ దౌత్య కార్యాలయం రామాయణంపై ఏర్పాటు చేసిన సదస్సుకు కొనసాగింపుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. -
బదరీ నారాయణుడు
మహాభారత ఇతిహాసంలో.... భారతీయ నాగరికతలో హిందువుల పూజలలోను పాలు పంచుకుంటున్న వృక్ష జాతులలో బదరీ వృక్షం ఒకటి. భగవంతుడికి నివేదించే అతికొద్ది పండ్లలో రేగుపండు ఒకటి. రేగు పండును బదరీ ఫలం అంటారు. రామాయణంలో శబరి శ్రీరామునికి తినిపించింది ఈ ఫలాలనే. పిల్లలకు పోసే భోగిపండ్లు రేగి పండ్లే. సూర్యభగవానుడికి రేగు పండ్లంటే ఇష్టమట. రథసప్తమినాడు చిక్కుడు ఆకులతోపాటు రేగు ఆకులను కూడా తలమీద పెట్టుకుని స్నానం చేస్తారు. వినాయకుని పూజలోనూ రేగు ఆకులను సమర్పిస్తారు. బదరీనాథ్‌లో ఉన్న స్వామివారికి రేగుపండ్లంటే అమిత ఇష్టమట. అందుకే ఆయనకు బదరీనారాయణుడనే పేరు వచ్చింది. అలాగే వ్యాసుడికి బాదరాయణుడనే పేరు బదరీ ద్వీపంలో పుట్టినందువల్లే వచ్చింది. తంత్ర శాస్త్ర గ్రంథాలలో కూడా బదరీవృక్షం ప్రసక్తి ఉంది. ఈ చెట్టు పండులోనే గాదు, ఆకులలోను బెరడులోను, చివరకు గింజల్లోకూడ ఔషధ గుణాలున్నాయని పరిశోధకులు కనిపెట్టారు. నిజానికి దీనిని వైద్యంలో వినియోగించే పద్ధతి భారత దేశంలో ఈ నాటిది కాదు. పూర్వం నుండే వాడుకలో ఉంది. మందమతులుగా ఉన్న పిల్లలచేత రోజూ కాసిన్ని రేగుపండ్లు తినిపిస్తే వారి బుద్ధి వికసిస్తుందట. అలాగే, దీని ఆకు పసరును పుండ్లు, వ్రణాలు వంటి వాటికి పై పూతగా వాడితే త్వరగా తగ్గిపోతాయట. కొన్ని దేశాలలో వీటి లేత ఆకులను కూరగా వండుకొని తింటారు. రేగుపండ్లతో పండ్లరసాలు, వడియాలు వంటి కొన్ని వంటకాలు కూడా చేస్తారు. -
ప్రజాస్వామ్యానికి ప్రశ్నించడమే రక్ష: ప్రణబ్
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్య సమాజ పరిరక్షణకు అధికా రంలో ఉన్నవారిని ప్రశ్నించాల్సిందేనని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ప్రజాభిప్రాయానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, సొంత సమస్యలు తప్ప ఇతరులవి విస్మరించడం ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు. గురువారం ఆయన రామ్‌నాథ్ గోయెంకా స్మారక ఉపన్యాసమిచ్చారు. భారత్‌లో చర్చించే వారికే తప్ప అసహనపరులకు చోటుండరాదని అన్నారు. చర్చలు, అసమ్మతి వంటివి నిర్ణయాలు తీసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగమైన పౌరులు, వ్యాపారవేత్తలు, సంస్థలు అన్నీ కూడా, ప్రశ్నించడంతో ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయనే సంగతిని తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. భారత నాగరికతలో బహుళత్వం, సహనం భాగంగా ఉన్నాయని, ఎన్నో తారతమ్యాలున్నా ఏళ్లుగా అవే మనల్ని ఒకటిగా నిలిపాయని అన్నారు. ప్రశ్నించే పాత్రను సంప్రదాయంగా మీడియా పోషిస్తోందని ప్రణబ్ అన్నారు. అన్యాయం, లింగ వివక్ష, కుల, సామాజిక పక్షపాతానికి లోనవుతున్న మిలియన్ల కొద్ది ప్రజలకు మీడియా బాసటగా నిలవాలని సూచించారు. చెల్లింపు వార్తలపై ప్రణబ్ ఆందోళన వ్యక్తం చేస్తూ...తటస్థ వైఖరితో మీడియా సంస్థలు ప్రజల విశ్వాసం చూరగొనాలని తెలిపారు.


