
ఒకప్పుడు పుస్తకం కొనుగోలు చేయడానికి డబ్బులు లేకపోతే లైబ్రరీల బాట పట్టేవారు. చదువుకోడానికి సరైన వసతి లేకపోయినా, పఠనాసక్తి కలిగిన వారు గ్రంథాలయాలనే ఆశ్రయించేవారు. ప్రస్తుతం సాంకేతిక విప్లవం విద్యార్థులను లైబ్రరీల నుంచి దూరం చేసింది. ఏ విషయం కావాలన్నా గూగుల్‌లో వెతకడం సులభమైపోయింది. కానీ గ్రంథాలయాలలోనే మనసుకు ప్రశాంతత, చదువుకు ఏకాగ్రత లభిస్తాయి. అందుకే నేటి తరాన్ని గ్రంథాలయానికి మళ్లించాల్సిన అవసరం ఉంది.
చరిత్రలో మొదటి గ్రంథాలయంగా అసుర్బానిపాల్ లైబ్రరీ (క్రీ.పూ. 7వ శతాబ్దం, నినెవె, ఇరాక్) ప్రసిద్ధి చెందింది. ఇందులో మట్టి పలకలపై క్యూనీఫార్మ్ లిపిలో రాసిన సుమారు 30,000 హస్త ప్రతులు ఉన్నాయి. భారత దేశంలో అతిపెద్ద లైబ్రరీ కలకత్తా పబ్లిక్ లైబ్రరీ. 1836 మార్చి 21న ద్వారకానాథ్ టాగూర్ ప్రారంభించిన ఈ లైబ్రరీ, స్వాతంత్య్రం తర్వాత నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాగా మారి ఇప్పుడు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అధీనంలో నడుస్తోంది. ఇక్కడ 25 లక్షల పుస్తకాలు ఉండగా, బెంగాల్ శాస్త్రవేత్త ఆశుతోష్ ముఖర్జీ ఒక్కడే 80,000 పుస్తకాలు దానం చేశారు. మరో విశిష్ట గ్రంథాలయం ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ ముంబయి. 1833లో జేమ్స్ మాకింతోష్ దీన్ని ప్రారంభించారు.
ఇదీ చదవండి: బాల అమితాబ్ గుర్తున్నాడా? ఇపుడు రూ. 200 కోట్ల కంపెనీకి అధిపతి
192 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ లైబ్రరీలో లక్షకు పైగా పుస్తకాలు ఉండగా, 15,000 అరుదైన గ్రంథాలు మాణిక్యాల్లా మెరుస్తున్నాయి. ఆధునికతకు అనుగుణంగా, ఇక్కడి అన్ని పుస్తకాలు, లిఖిత ప్రతులు, పత్రికలను డిజిటల్ రూపంలోకి మార్చి ‘గ్రంథ్ సంజీవనీ వెబ్‌సైట్’ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంచారు.
నేడు జాతీయ గ్రంథాలయ దినోత్సవం సందర్భంగా ‘సోషల్ మీడియా కోసం కాదు, సొంత మెరుగుదలకు చదువుదాం!’ అనే ప్రతిజ్ఞ తీసుకుందాం.
– అర్జునరావు రాజనాల, అరోరా పీజీ కళాశాల గ్రంథాలయ విభాగాధి పతి