
స్వయంకృషి
ఆమె తన కుల వృత్తి అయిన చెప్పులు కుడుతూనే... పుస్తకాలు పట్టుకుని జీవితంలోని చిరుగులను కుట్టుకుంది. అమ్మకు ఆసరాగా బీడీలు చుడుతూనే... తెలంగాణ యూనివర్సిటీ లో ఇంటిగ్రేటెడ్ కోర్సులతో డిగ్రీ, పీజీ చదివింది. విదార్థి నాయకురాలిగానూ అనేక ఉద్యమాల్లో పాల్గొంది. బీఈడీ అయ్యాక బీడీ కార్మికుల బతుకులపై పీహెచ్‌డీ చేసి ఇటీవల తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా పట్టా అందుకుని ఎందరికో ఆదర్శంగా నిలిచింది. ఆమే కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన సిద్ధలక్ష్మి.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన మోచి వెంకటయ్య, నాగమణి దంపతులకు ఇద్దరు పిల్లలు. పిల్లలిద్దరు చిన్న వయసులో ఉన్నపుడే తండ్రి మరణించాడు. తల్లి నాగమణి ఓ వైపు బీడీలు చుడుతూ మరోవైపు చెప్పులు కుడుతూ పిల్లల్ని చదివించింది. కూతురు సిద్ధలక్ష్మి ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు, అక్కడే ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసింది. చదువుకునే సమయంలో సిద్దలక్ష్మి బీడీలు చుట్టడంతో పాటు కులవృత్తి కూడా చేసేది. పొద్దున, సాయంత్రం చెప్పుల దుకాణంలో తల్లితో పాటు కూర్చునేది. చెప్పులు కుట్టడం, అమ్మడంలో సాయపడేది. ఇంటర్ పూర్తయిన తరువాత తెలంగాణ యూనివర్సిటీలో ఐదేళ్ల డిగ్రీ, పీజీ (ఇంటిగ్రేటెడ్) కోర్సుకు సంబంధించిన ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణురాలై సీటు సాధించింది. దీంతో యూనివర్సిటీలో అడుగుపెట్టిన సిద్ధలక్ష్మి చదువుకుంటూనే విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొంది. పీడీఎస్‌యూ లో క్రియాశీలకంగా పనిచేసింది. తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలోనూ చురుకుగా పాల్గొంది.ఉద్యమాల్లోపాల్గొంటూనే సిద్ధలక్ష్మి డిగ్రీ, పీజీ పూర్తి చేసింది. బీఈడీ చదువు కోసం మహబూబ్‌నగర్ వెళ్లింది. తరువాత ఉద్యమ సహచరుడు కన్నయ్యను వివాహమాడింది. ఆమెకు ముగ్గురు కుమారులు.
బీడీ కార్మికుల బతుకులపై పరిశోధన...
తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో వ్యవసాయం తరువాత ఎక్కువ మంది ఆధారపడే బీడీ రంగంలో కార్మికుల ఆదాయం.. ఖర్చులు అన్న అంశంపై సిద్ధలక్ష్మి పరిశోధన పత్రం సమర్పించింది. ఇటీవల తెలంగాణ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్ పట్టా అందుకుంది. కాగా ఫెలోషిప్ ద్వారా తనకు నెలనెలా అందిన డబ్బులను పొదుపు చేసి ఎల్లారెడ్డిలో ఇల్లు నిర్మించుకుంది. బాన్సువాడలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో గెస్ట్ ఫ్యాకల్టీగా పని చేసింది. కష్టపడి పరిశోధన చేసి పీహెచ్‌డీ పట్టా అందుకుంది. అందరికీ ఆదర్శంగా నిలిచింది.
ఇదీ చదవండి: కుటుంబం తొలుత ఒప్పుకోకపోయినా..నిలిచి గెలిచిన ప్రేమికులు!
కష్టాలను దిగమింగాను
మాది పేద కుటుంబం. అమ్మ ఎంతో కష్టపడి చదివించింది. మా మేనత్త చదువుకోమని ప్రోత్సహించింది. అమ్మకు ఆసరాగా చెప్పులు కుట్టడం, బీడీలు చుట్టడం చేస్తూనే చదువుకు కూడా సమయం కేటాయించేదాన్ని. యూనివర్సిటీలో చాలామంది ప్రోత్సహించారు. చిన్నప్పుడు బీడీ కార్మికుల కష్టాలను స్వయంగా చూశాను కాబట్టి బీడీ కార్మికులనే సబ్జెక్టుగా తీసుకుని పీహెచ్‌డీ చేశాను. డాక్టర్ పాత నాగరాజు సార్ నా పీహెచ్‌డీకి గైడ్‌గా ఎంతో ప్రోత్సహించి నా పరిశోధనకు సహకరించారు. కష్టాలున్నాయని కుమిలిపోతే ఇక్కడిదాకా రాకపోయేదాన్ని. కష్టాలను ఎదుర్కొనడంలోనే సక్సెస్ ఉంటుందని స్వయంగా తెలుసు కున్నాను. – డాక్టర్ సిద్ధలక్ష్మి, ఎల్లారెడ్డి
ఇదీ చదవండి: చదివింది పదో తరగతే... కట్ చేస్తే కోట్లలో సంపాదన
– ఎస్.వేణుగోపాలాచారి, సాక్షి ప్రతినిధి, కామారెడ్డి