కష్టాలను జయించి..

These Women Success Story In Panguluru, Prakasam - Sakshi

కరోనా గుణపాఠాలతో కుటుంబానికి చేయూతగా నిలిచిన మహిళలు

జే.పంగులూరు మండలానికి చెందిన ఒంటరి మహిళలు 

ఆ మహిళలు యాభై ఏళ్లు నిండినవారు.. ఇన్నాళ్లూ కుటుంబ సభ్యుల ఆలనాపాలనా చూసుకోవడంతోనే కాలం గడిపారు. బయట ప్రపంచం గురించి ఆలోచించలేదు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. కరోనా మహమ్మారి రూపంలో కష్టం కమ్ముకొచ్చింది. అడుగడుగునా ఆర్థిక ఇబ్బందులు తలుపుతట్టాయి. కుటుంబానికి తన తోడు కావాలని ఆలోచించి ఒక అడుగు ముందుకేసి ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకుని ఆర్థికంగా ముందడుగు వేశారు. వంటింటికే పరిమితమైన వాళ్లు చిరువ్యాపారాలు  ప్రారంభించి కుటుంబ పోషణలో తమ వారికి అండగా నిలుస్తున్నారు. 

సాక్షి, జే.పంగులూరు: కరోనా వైరస్‌ ఎందర్నో రోడ్డుమీదకీడ్చింది. రోజు కూలీలు పూట కూటికి నానా తంటాలు పడ్డారు. కానీ ఆ మహిళలు ఆకలి కేకలను జయించి జీవితంలో ఓ మంచి పాఠం నేర్చుకున్నారు. వయస్సు మీద పడినా కుటుంబానికి ఆసరాగా ఎలా ఉండాలో నేర్పించారు. వారే షేక్‌ అబినాబీ, తిరుమల మేరిమ్మ. యాభై ఏళ్లు పైబడిన ఈ మహిళలు తమ కుటుంబ సభ్యుల కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకుని ఓ కొత్త జీవితాన్ని ప్రారంభించారు.  

పంగులూరుకు చెందిన షేక్‌ అబినాబీ, నార్నేవారిపల్లికి చెందిన తిరుమల మేరిమ్మ ఒంటరి మహిళలు. వారి భర్తలు అకాల మరణం చెందారు. అబినాబికి ఇద్దరు కూతుళ్లు, మేరిమ్మకు ఒక కుమారుడు. కరోనా కాలంలో తమకు ఎదురైన చేదు అనుభావం నుంచి ఓ గొప్ప పాఠం నేర్చుకుని వంటింటిని వదిలి వీధుల్లో వ్యాపారాలు చేస్తున్నారు. తమ కుటుంబానికి చేదోడుగా తమ చేయిని అందించారు. ముఖ్యమంత్రి అందించిన వైఎస్సార్‌ చేయూత, మరికొంత బ్యాంక్‌ పెట్టుబడితో ఇప్పుడు తమ కళ్ల మీద తామే నిలబడ్డామని.. తమ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నామని గర్వంగా చెబుతున్నారు. 

కోవిడ్‌ లాక్‌డౌన్‌లో తీవ్ర ఇబ్బంద్దులు ఎదుర్కొన్నాను 
నాకు భర్త లేడు.. నేను ఒంటరి మహిళను. నాకు ఇద్దరు కూతుళ్లు. కూలి పనులు చేసుకుంటు జీవనం సాగిస్తుంటాను. కరోనా సమయంలో పనులు లేక కుటుంబంలో అందరం తీవ్ర ఇబ్బందులకు గురయ్యాము. వైఎస్సార్‌ చేయూతలో భాగంగా నాకు రూ.18,750 డబ్బుల వచ్చాయి. వచ్చిన ఆ కొద్ది పాటి డబ్బులతో హోటల్‌ నడుపుతున్నాను. దేవుని దయవలన హోటల్‌ బాగానే ఉంది. ప్రస్తుతం జగనన్న చేదోడు కింద మరో రూ.10 వేలు కూడా అందడంతో హోటల్‌ను ఇంకొంత అభివృద్ధి చేసేందుకు అవకాశం దొరికింది.  
– షేక్‌ అబినాబీ, పంగులూరు

తిండికి కూడా ఇబ్బంది పడేవాళ్లం 
నా భర్త 10 సంవత్సరాల కిందట చనిపోయాడు. నాకు ఒక కుమారుడు, కూలి పనులు చేసుకుంటు జీవనం సాగిస్తున్నాను. కానీ ఈ మధ్య కాలంలో నా ఆరోగ్యం పొలం పనులు చేసుకునేందుకు సహకరించటం లేదు. లాక్‌డౌన్‌ సమయంలో చాలా ఇబ్బందులు పడ్డాను. కష్టాలను చూసి ఆ దేవుడే నాకు జగనన్న రూపంలో రూ.18,750 నా బ్యాంక్‌ ఖాతాలో జమచేయించాడు. ఆ కొద్దిపాటి డబ్బులతో చిన్న నెట్టుడు బండిపై తినుబండరాలు అమ్ముకుంటున్నాను. ప్రస్తుతం తిండికి ఇబ్బంది లేదు.  బ్యాంక్‌ వారు వైఎస్సార్‌ చేయూతలో భాగంగా రుణం మంజూరు చేస్తున్నారు. ఆ డబ్బులతో బంకు కొని నిత్యవసర సరుకులు కూడా తీసుకొచ్చి అమ్ముతాను. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను.  
 – తిరుమల మేరిమ్మ, నార్నేవారిపాలెం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top