
వాషింగ్టన్: థాయ్‌ల్యాండ్-కంబోడియా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు. ఆగ్నేయాసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాలను తన మధ్యవర్తిత్వంతో విరమింపజేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. రెండు దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణలకు త్వరలోనే ముగింపు పడనుందని ట్రంప్ చెప్పారు. ఇరు దేశాలు తక్షణ కాల్పుల విరమణ చర్చలకు అంగీకరించాయని వెల్లడించారు.
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా.. కాల్పుల విరమణకు సంబంధి కంబోడియా ప్రధాని హున్ మానెట్, థాయ్ తాత్కాలిక ప్రధాని ఫుమ్తామ్ వెచాయాచాయ్‌లతో మాట్లాడానని.. ఇరువురు తక్షణ కాల్పుల విరమణకు, శాంతి నెలకొల్పేందుకు అంగీకరించారని చెప్పారు. వారు వెంటనే సమావేశమై చర్చించేందుకు సమ్మతించారన్నారు. అయితే ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం ఎవరు వహిస్తారు, శాంతి చర్చలు ఎక్కడ జరుగుతాయని వివరాలను ఆయన వెల్లడించలేదు. కాగా, కాల్పుల విమరణకు సూత్రప్రాయంగా సుముఖతను వ్యక్తం చేసినట్లు థాయ్‌లాండ్ తాత్కాలిక ప్రధాని ఫేస్‌బుక్ వేదికగా వెల్లడించారు. అయితే కంబోడియా నిజాయితీగా వ్యవరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఘర్షణలు ఇలాగే కొనసాగితే అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు ప్రమాదంలో పడతాయని ఇద్దరినీ హెచ్చరించానని వెల్లడించారు.
ఇక, ఇటీవలి కాలంలో పలు దేశాల మధ్య యుద్ధాల విషయంలో ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధాన్ని ఆపిన ట్రంప్.. తన మధ్యవర్తిత్వంతోనే పాక్, భారత్ మధ్య కాల్పులు నిలిచాయని పదేపదే చెప్పారు. అనంతరం, భారత ప్రధాని మోదీ ప్రకటనతో ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు.
Donald J. Trump Truth Social 07.26.25 12:23 PM EST pic.twitter.com/QB03NMNe9G
— Fan Donald J. Trump Posts From Truth Social (@TrumpDailyPosts) July 26, 2025
ఇదిలా ఉండగా.. థాయ్‌ల్యాండ్, కంబోడియా మధ్య ఘర్షణలు ఆదివారం నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఇప్పటి వరకూ 33 మంది మరణించారు. దాదాపు 1.68 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. సరిహద్దు వెంబడి ఉన్న అనేక గ్రామాల్లో దాడి ఘటనలు చోటుచేసుకున్నాయి. దాడుల్లో ఎఫ్-16 విమానాలు, డ్రోన్‌లను కూడా వినియోగించినట్టు అధికారులు తెలిపారు. గత గురువారం సరిహద్దులో ఒక మందుపాతర పేలి ఐదుగురు థాయ్‌ల్యాండ్ సైనికులు గాయాలపాలు కావడం ఈ సంఘర్షణకు దారితీసిన సంగతి తెలిసిందే. దీంతో ఇరుదేశాలూ పరస్పరం దౌత్య సిబ్బందిని ఉపసంహరించాయి. కంబోడియాలో తాజాగా 12 మరణాలు నమోదయ్యాయి. ఆ దేశంలో ఇప్పటిదాకా మరణించిన వారి సంఖ్య 13కు చేరింది. ఈ పోరాటాన్ని నిలుపుదల చేయాల్సిందిగా ఆగ్నేయాసియా దేశాల సంఘం(ఆసియన్)పై అంతర్జాతీయ ఒత్తిడి పెరుగుతోంది. తమ దేశ సరిహద్దు గ్రామాల్లో నివసిస్తున్న 37,635 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని కంబోడియా సమాచార మంత్రి నెత్ ఫియాక్ట్రా వెల్లడించారు.