ఇరాన్, అమెరికా యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రియమైన భూమిపై జరిగే దాడిని ఎదుర్కొవడానికి ఇరాన్ బలగాలు అప్రమత్తంగా ఉన్నాయన్నారు. అందుకోసం భద్రతబలగాలు ట్రిగ్గర్‌పై వేలు ఉంచాయన్నారు.
ప్రస్తుతం ఇరాన్- అమెరికాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ వైపు తమ భద్రతా బలగాలు కదిలాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇదివరకే ప్రకటించారు. దీంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏ సమయంలోనైనా అమెరికా దాడి చేసే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అమెరికాను హెచ్చరిస్తూ వ్యాఖ్యలు చేశారు.
ఆయన మాట్లాడుతూ" మా శక్తివంతమైన సైనికులు సిద్ధంగా ఉన్నారు. వారి వేలు ట్రిగ్గర్స్ పై ఉన్నాయి. మా గాలిపై, భూమిపై, సముద్రంపై, ఎటువంటి దాడి జరిగినా ఎదుర్కొవడానికి వారు రెడీ అని తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అదే సమయంలో ఇరు దేశాలకు ప్రయోజనకరమైన న్యాయమైన అణు ఒప్పందాన్ని ఇరాన్ స్వాగతిస్తుందని తెలిపారు.
అయితే ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులకు దిగారు. అణ్వయుధ ఒప్పందంపై ఇరాన్ పాలకులు చర్చలకు అంగీకరించకపోతే తమ తదుపరి దాడి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. దీనికోసం అమెరికా విమాన వాహన నౌక యుఎస్ఎస్ అబ్రహం లింకన్ అమెరికా నేవీ గల్ఫ్ ప్రాంతంలోకి ప్రవేశించిందని తెలిపారు.


