
డ్రైవర్లు లేదా వాహనాలు నడిపేవాళ్లు ఈ పండు తిన్నారో అంతే సంగతులు. చుక్క మందు తాగకపోయినా..అన్యాయంగా ఇరుక్కుపోతారు. తమాషా కాదు..నమ్మశక్యం కానీ పచ్చి నిజం. ఏంటిదంతా అనుకోకండి. పాపం ఇలానే కేరళ డ్రైవర్లు రొటీన్ బ్రీత్ అనలైజర్ టెస్ట్‌లో పట్టుబడి చిక్కుల్లోపడ్డారు. చివరికి అధికారులే అసలు విషయం తెలుసుకుని కంగుతిన్నారు.
అసలేం జరిగిందంటే..కేరళలోని పతనంతిట్ట జిల్లాలోని పండలం మండలంలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది అక్కడ డ్రైవర్లకు రొటీన్ బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. దీంతో ఒక్కసారిగా అవాక్యయ్యారు ఆ ఉద్యోగులు. ఒక్క చుక్క మందు తాగకుండానే ఇదేంటని విస్తుపోయారు. పాపం వాళ్లంతా తాము మద్యం సేవించలేదని మమ్మల్ని నమ్మండి మహాప్రభో అంటూ మొరపెట్టుకోవడంతో..అధికారులు వారికి ఒక్క అవకాశం ఇచ్చారు.
తాము కొల్లం జిల్లాలో వస్తువులు రవాణా చేసేటప్పుడు పనసపండు కొన్నామని అది తప్ప ఇంకొకటి తాము తినలేదని చెప్పారు. అయితే మీరు చెప్పింది నిజమే అయితే మరొక సిబ్బంది ఈ పనస పండు ఇచ్చి వాస్తవం నిర్థారిస్తామని ఆ డ్రైవర్లోతో అధికారులు అన్నారు. అన్నట్లుగానే తదుపరి పరీక్ష నిర్వహించారు. ఒక సిబ్బందికి ఇలాంటి పనసండు పెట్టి బ్రిత్ అనలైజర్‌తో పరీక్షించగా మద్యం సేవించినట్లుగా పాజిటివ్ చూపించింది.
అది చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. పనసపండు ఇంతలా బ్రీత్ అనలైజర్‌ను కన్ఫ్యూజ్ చేసేలా తప్పుదారిపట్టిస్తుందా అని ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత సదరు డ్రైవర్లు మద్యం సేవించలేదని నిర్థారించి వారిని వదిలేశారు అధికారులు.
పనపండు తింటే మద్యం సేవించినట్లేనా అంటే..
కేరళకు చెందిన ఈ సుగంధభరిత పనసపండు. అసాధారణమైన తేనెలాంటి తీపి రుచిని కలిగి ఉంటుంది. పైగా ఎక్కువకాలం నిల్వ ఉంటుంది. అయితే అతిగా పండిన ఈ పనసపండులోని సహజ కిణ్వప్రక్రియ కారణంగా ఆల్కహాల్‌ని కలిగి ఉంటుందట. ఎప్పుడైతే దీన్ని తింటామో అది శరీరంలోకి వెళ్లగానే ఇథనాల్‌ని ఉత్పత్తి చేస్తుందట.
దాంతో ఈ పనసపండు తిన్న వెంటన్ బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తే ఆల్కహాల్ సేవించినట్లుగా చూపిస్తుందట. ముఖ్యంగా బాగా ముగ్గిన పనస పండు తీసుకుంటే ఇది మరింత స్పష్టంగా ఆల్కాహాల్ సేవించినట్లు చూపిస్తుందట బ్రిత్ అనలైజర్ రీడింగ్‌లో. ఇందుకు ప్రధాన కారణం బాగా పండిన పండ్లు ఇథనాల్‌ను తక్కువ మొత్తంలో ఉత్పత్తి చేయడమేనని చెబుతున్నారు నిపుణులు.
ఇలా తప్పుదారి పట్టించేవి ఇవే..
అతిగా పండిన అరటిపండు, మామిడిపండు
కిమ్చి, సౌర్‌క్రాట్, ఇడ్లీ
ఆల్కాహాల్ లేని బీర్ లేదా మౌత్‌వాష్
వెనిగర్ అధికంగా ఉండే వంటకాలు లేదా ఆల్కహాల్‌తో వండిన ఆహారాలు
చక్కెర ఆల్కహాల్‌లు లేదా కిణ్వ ప్రక్రియ ఉపఉత్పత్తులను కలిగి ఉన్న ప్రోటీన్ బార్‌లు లేదా ఎనర్జీ డ్రింక్స్
(చదవండి: ఆ మూవీలో మాదిరిగా 20 ఏళ్లకే అల్జీమర్స్ వస్తుందా..? నిపుణులు ఏమంటున్నారంటే..)