
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో యువ పేసర్ అన్షుల్ కాంబోజ్ టీమిండియా తరపున అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఆకాశ్ దీప్, అర్షదీప్ సింగ్ గాయాల బారిన పడటంతో అనూహ్యంగా భారత టెస్టు జట్టులోకి వచ్చిన కాంబోజ్.. తన తొలి మ్యాచ్‌లో దారుణ ప్రదర్శన కనబరిచాడు.
18 ఓవర్లు వేసిన కాంబోజ్ 89 పరుగులు ఇచ్చి కేవలం ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు. తక్కువ స్పీడ్‌తో బంతులు వేయడం, సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేయకపోవడంతో ఇంగ్లండ్ బ్యాటర్లు అతడిని ఓ ఆట ఆడేసికున్నారు.
దీంతో అన్షుల్‌ను జట్టులోకి తీసుకున్న హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్‌పై సర్వాత్ర విమర్శల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో కాంబోజ్‌కు భారత మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ మద్దతుగా నిలిచారు. క్లిష్ట పరిస్థితుల్లో టెస్టు అరంగేట్రం చేసే ఆటగాడి నుంచి అభిమానులు ఎక్కువగా ఆశించకూడదని ఆయన అన్నారు.
"ఒక అరంగేట్ర ఆటగాడి నుంచి మీరు ఏమి ఆశిస్తున్నారు? అతడు 10 వికెట్లు తీస్తాడని మీరు అనుకున్నారా? అతడి కెపాసిటీని మీరు అంచనా వేయండి. అందులో ఎటువంటి తప్పులేదు. అతడిలో అద్బతమైన స్కిల్స్ ఉంటే కచ్చితంగా తిరిగి పుంజుకుంటాడు.
తొలి మ్యాచ్‌లో ఎలాంటి ప్లేయర్‌పై నైనా ఒత్తిడి సహజంగా ఉంటుంది. ఈ మ్యాచ్‌లో అతడు మెరుగైన ప్రదర్శన చేయకపోవచ్చు. తర్వాతి మ్యాచ్‌లో తిరిగి పుంజుకుంటాడని నమ్ముతున్నారు. ప్రతీ ఒక్కరిపై నమ్మకం అనేది ముఖ్యం. కేవలం ఒక్క మ్యాచ్‌తో ఎవరి టాలెంట్‌ను అంచనా వేయద్దు" అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్‌దేవ్ పేర్కొన్నాడు.
కాగా మాంచెస్టర్ టెస్టులో టీమిండియా ఓటమి నుంచి తప్పించుకునేందుకు పోరాడుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో సున్నా పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన కష్టాల్లో పడ్డ భారత్‌ను కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ జోడీ ఆదుకుంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 174 పరుగులు చేసింది. ఇంకా ఇంగ్లండ్ కంటే టీమిండియా 137 పరుగులు వెనుకబడి ఉంది.