సౌతాఫ్రికా- ‘ఎ’ జట్టుతో ఉత్కంఠ పోరులో భారత్- ‘ఎ’ జట్టు విజయం సాధించింది. టెయిలెండర్లు అన్షుల్ కాంబోజ్ (37 నాటౌట్), మానవ్ సుతార్ (Manav Suthar- 20 నాటౌట్) యాభైకి పరుగుల భాగస్వామ్యంతో రాణించి జట్టును గట్టెక్కించారు. వీరిద్దరి అద్భుత ప్రదర్శన కారణంగా.. అనధికారిక తొలి టెస్టులో భారత్.. సౌతాఫ్రికాను మూడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది.
ఇంగ్లండ్ పర్యటనలో గాయపడ్డ టీమిండియా స్టార్ రిషభ్ పంత్.. సౌతాఫ్రికాతో స్వదేశంలో టెస్టు సిరీస్‌కు ముందు భారత్-‘ఎ’ జట్టు కెప్టెన్‌గా తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. పంత్ సారథ్యంలో భారత్- సౌతాఫ్రికా- ‘ఎ’ జట్టుతో రెండు అనధికారిక టెస్టు సిరీస్‌లు ఆడుతోంది. ఇందులో భాగంగా బెంగళూరు వేదికగా గురువారం తొలి అనధికారిక టెస్టు మొదలైంది.
తనుశ్ కొటియాన్‌కు నాలుగు వికెట్లు
టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 309 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ జొర్డాన్ హెర్మాన్ (71), జుబేర్ హంజా (66), రుబిన్ హెర్మాన్ (66), టియాన్ వాన్ వారెన్ (46) రాణించారు.
234 పరుగులకే ఆలౌట్
భారత బౌలర్లలో తనుశ్ కొటియాన్ నాలుగు వికెట్లు దక్కించుకోగా.. గుర్‌నూర్ బ్రార్, మానవ్ సుతార్ రెండేసి వికెట్లు కూల్చారు. ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన భారత్.. 234 పరుగులకే ఆలౌట్ అయింది.
ఓపెనర్లు ఆయుశ్ మాత్రే (65), సాయి సుదర్శన్ (32)లతో పాటు ఆయుశ్ బదోని (38) రాణించగా.. కెప్టెన్ పంత్ (17) సహా దేవదత్ పడిక్కల్ (6), రజత్ పాటిదార్ (19) విఫలమయ్యారు. తనుశ్ కొటియాన్ 13 పరుగులు చేయగా.. టెయిలెండర్లు అన్షుల్ 5, మావన్ 4, ఖలీల్ 4 పరుగులే చేశారు.
ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌతాఫ్రికా భారత బౌలర్ల ధాటికి 199 పరుగులకే కుప్పకూలింది. తనుశ్ మరోసారి నాలుగు వికెట్లతో చెలరేగగా.. అన్షుల్ 3, బ్రార్ రెండు, మానవ్ ఒక వికెట్ దక్కించుకున్నారు.
ఈ నేపథ్యంలో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 75 పరుగులు కలుపుకొని సౌతాఫ్రికా.. భారత్‌కు 275 పరుగుల లక్ష్యాన్ని విధించింది. అయితే, ఓపెనర్లు సాయి సుదర్శన్ (12), ఆయుశ్ మాత్రే (6), వన్‌డౌన్ బ్యాటర్ పడిక్కల్ (5) త్వరగా అవుట్ కావడంతో భారత్ చిక్కుల్లో పడింది.
పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్
ఈ దశలో రజత్ పాటిదార్ (28) సహకారం అందించగా.. పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఐదో స్థానంలో వచ్చి 113 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 90 పరుగులు సాధించాడు. అయితే, పంత్ అవుటైన తర్వాత.. ఆ వెంటనే ఆయుశ్ బదోని (34) కూడా అవుట్ కావడంతో భారత్ కష్టాల్లో కూరుకుపోయింది.
గెలిపించిన అన్షుల్, మానవ్
ఇలాంటి తరుణంలో తనుశ్ కొటియాన్ 23 పరుగులు చేయగా.. ఆశలు వదిలేసుకున్న సమయంలో మానవ్ 20, అన్షుల్ 37 (4 ఫోర్లు, 2 సిక్స్‌లు) పరుగులతో అజేయంగా నిలిచి భారత్‌కు విజయం అందించారు. ఆల్‌రౌండ్ ప్రతిభతో రాణించిన తనుశ్ కొటియాన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
భారత్- ‘ఎ’ వర్సెస్ సౌతాఫ్రికా- ‘ఎ’తొలి అనధికారిక టెస్టు సంక్షిప్త స్కోర్లు
👉వేదిక: బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్ 1, బెంగళూరు
👉టాస్: భారత్.. తొలుత బౌలింగ్
👉సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 309
👉భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 234
👉సౌతాఫ్రికాకు 75 పరుగుల ఆధిక్యం
👉సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ స్కోరు: 199
👉భారత్ లక్ష్యం: 275 పరుగులు
👉భారత్ రెండో ఇన్నింగ్స్ స్కోరు: 277/7
👉ఫలితం: మూడు వికెట్ల తేడాతో సౌతాఫ్రికాపై భారత్ విజయం.
చదవండి: ICC: గెలిచిన జట్టుకు కళ్లు చెదిరే ప్రైజ్‌మనీ!.. బీసీసీఐ బంపరాఫర్


