ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2025 టోర్నమెంట్ తుది అంకానికి చేరుకుంది. నవీ ముంబై వేదికగా భారత్- సౌతాఫ్రికా (IND W vs SA W) మధ్య ఆదివారం నాటి ఫైనల్‌తో ఈ టోర్నీలో కొత్త చాంపియన్ అవతరించనుంది.
ఈ ఈవెంట్లో ఇప్పటికే రెండుసార్లు రన్నరప్‌గా నిలిచిన టీమిండియా.. తొలిసారి ఫైనలిస్టు అయిన సౌతాఫ్రికా... ప్రస్తుత బలాబలాల దృష్ట్యా టైటిల్ పోరు రసవత్తరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. కొత్త చాంపియన్ రాకతో పాటు.. ఈసారి వన్డే వరల్డ్‌కప్ టోర్నీకి మరో ప్రత్యేకత కూడా ఉంది.
కళ్లు చెదిరే ప్రైజ్‌మనీ
విజేతగా నిలిచిన జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) కళ్లు చెదిరే ప్రైజ్‌మనీ ప్రకటించింది. పురుషుల, మహిళల క్రికెట్‌లో రికార్డు స్థాయిలో చాంపియన్‌కు ఏకంగా 4.48 మిలియన్ యూఎస్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 39.78 కోట్లు) ఇవ్వనుంది.
123 కోట్ల రూపాయలు
అదే విధంగా.. రన్నరప్ జట్టుకు.. విజేతకు అందించిన నగదులో సగం అంటే 2.24 మిలియన్ యూఎస్ డాలర్లు (దాదాపు రూ. 19 కోట్లకు పైగా) ప్రైజ్‌మనీగా ప్రకటించింది. భారత్- శ్రీలంక సంయుక్త ఆతిథ్య దేశాలుగా ఉన్న ఈ టోర్నీ ప్రైజ్‌మనీల మొత్తానికి ఐసీసీ ఏకంగా 13.88 మిలియన్ యూఎస్ డాలర్లు అంటే... దాదాపు 123 కోట్ల రూపాయలు కేటాయించింది.
239 శాతం పెంచారు
వరల్డ్‌కప్ టోర్నీ చరిత్రలోనే ఇది అత్యధికం. వన్డే వరల్డ్‌కప్-2022 ఎడిషన్‌తో పోలిస్తే ఇది ఏకంగా 297 శాతం ఎక్కువ కావడం విశేషం. అంతేకాదు.. నాటి విజేత ఆస్ట్రేలియాకు ఇచ్చిన ప్రైజ్‌మనీ కంటే తాజా సీజన్ విన్నర్‌కు ఇచ్చే ప్రైజ్‌మనీని ఏకంగా 239 శాతం పెంచడం గమనార్హం.
రూ. 42 కోట్లకు
ఇక ఈ టోర్నీలో భారత్ ఇప్పటికే దాదాపు 3,50,000 యూఎస్ డాలర్ల ప్రైజ్‌మనీ (సుమారుగా 3.1 కోట్ల రూపాయలు) సొంతం చేసుకుంది. టోర్నీలో పాల్గొన్నందుకు, గ్రూప్ దశలో మూడు విజయాలకు గానూ ఈ మొత్తం టీమిండియాకు లభించింది. అన్నీ సజావుగా సాగి భారత్ చాంపియన్‌గా అవతరిస్తే మొత్తం ప్రైజ్‌మనీ రూ. 42 కోట్లకు చేరుకుంటుంది.
మరోవైపు.. సౌతాఫ్రికా ఇప్పటికే నాలుగు లక్షల యూఎస్ డాలర్లకుపైగా గెలుచుకుంది. గ్రూప్ దశలో ఐదు విజయాలు సాధించి ఈ మొత్తం సొంతం చేసుకుంది.
ఏదేమైనా క్రికెట్ ప్రపంచంలో పురుష జట్ల ఆధిపత్యం కొనసాగుతున్న వేళ.. మహిళా టోర్నీలో రికార్డు స్థాయి ప్రైజ్‌మనీ అందించడం హర్షించదగ్గ పరిణామం. మహిళా క్రికెట్‌కు ఆదరణ పెంచడంతో పాటు.. యువ ఆటగాళ్లను ఆకర్షించడానికి ఇలాంటి చర్యలు తోడ్పడతాయి.
బీసీసీఐ బంపరాఫర్!
ఇదిలా ఉంటే.. ఒకవేళ హర్మన్ సేన గనుక వన్డే వరల్డ్‌కప్ గెలిస్తే.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మహిళా క్రికెటర్లుకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోందని సమాచారం.
పురుష క్రికెటర్లతో పాటు మహిళా ప్లేయర్లకు కూడా సమవేతనం చెల్లించాలనే యోచనలో ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు పీటీఐతో పేర్కొన్నాయి.
మరోవైపు.. హర్మన్‌సేన ట్రోఫీ గెలిస్తే బీసీసీఐ రూ. 125 కోట్ల నజరానా ఇవ్వనుందనే ప్రచారం జరుగుతోంది. కాగా నవీ ముంబై వేదికగా ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు భారత్- సౌతాఫ్రికా మధ్య ఫైనల్‌కు తెరలేస్తుంది.


