నేడు భారత్, ఆసీస్ మూడో టి20
మ.గం. 1:45 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లలో ప్రసారం
హోబర్ట్: ఆతిథ్య ఆ్రస్టేలియా ఆధిక్యానికి ఆదిలోనే గండికొట్టాలని, ఈ మ్యాచ్‌తోనే సిరీస్‌ను సమం చేయాలనే పట్టుదలతో భారత జట్టు బరిలోకి దిగుతోంది. మరోవైపు వన్డే సిరీస్‌లాగే పొట్టి ఫార్మాట్‌లోనూ వరుస మ్యాచ్‌లు గెలవాలనే లక్ష్యంతో కంగారూ సేన ఉంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ఆదివారం జరిగే మూడో టి20 మ్యాచ్ హోరాహోరీగా జరగడం ఖాయం. ప్రధానంగా భారత టీమ్ మేనేజ్‌మెంట్ బ్యాటింగ్ లోపాలపైనే దృష్టిపెట్టింది.
ఈ పర్యటన ఆరంభం నుంచే టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తన లయను ఇప్పటికీ అందుకోలేకపోతున్నాడు. రద్దయిన తొలి టి20లో 30 పైచిలుకు పరుగులైతే చేశాడు కానీ... ఫలితం తేలిన నాలుగు మ్యాచ్‌ల్లో (మూడు వన్డేలు, రెండో టి20 కలిపి) గిల్ ఆట తీవ్రంగా నిరాశపరిచింది. గత పోరుతో పరుగుల జోరును అందుకున్న అభిషేక్‌తో పాటు గిల్, సంజూ సామ్సన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, తెలుగుతేజం ఠాకూర్ తిలక్‌వర్మ మూకుమ్మడిగా మెరుపులు మెరిపిస్తే ఆసీస్‌ను 20 ఓవర్ల మ్యాచ్‌లో ఓడించడం ఏమంత కష్టమేకాదు.
వన్డే సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా ఈ సిరీస్‌లో నిలవాలంటే ఈ మ్యాచ్ తప్పకుండా గెలవాల్సిందే. లేదంటే సూర్య సేన ఒత్తిడిలోకి కూరుకుపోతుంది. మరోవైపు ఆతిథ్య జట్టు వరుసగా ఈ మ్యాచ్ గెలవడం ద్వారా ఇక సిరీస్‌ను కోల్పోలేని పటిష్టస్థితిలో నిలవాలని చూస్తోంది. బ్యాటింగ్‌లో కెప్టెన్ మార్ష్, ట్రవిస్ హెడ్, ఇన్‌గ్లిస్ ఫామ్‌లో ఉన్నారు. బౌన్సీ పిచ్‌లపై నిప్పులు చెరిగే బార్ట్‌లెట్, ఎలిస్, స్టొయినిస్‌లు టీమిండియా ప్రధాన బ్యాటర్లను ఆదిలోనే పడేయాలని ఆశిస్తున్నారు.


