
మాంచెస్టర్ టెస్ట్‌లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. చివరి రోజు భారత్ తొలి సెషన్‌లోనే ఓవర్‌నైట్ బ్యాటర్లు కేఎల్ రాహుల్ (90), శుభ్‌మన్ గిల్ (103) వికెట్లు కోల్పోయింది.
ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే కేఎల్ రాహుల్ ఔటయ్యాడు. బెన్ స్టోక్స్ అద్భుతమైన బంతితో రాహుల్‌ను ఎల్బీడబ్ల్యూ చేశాడు. రికార్డు సెంచరీ పూర్తి చేసిన వెంటనే శుభ్‌మన్ గిల్ కూడా పెవిలియన్‌కు చేరాడు.

జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ జేమీ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి గిల్ నాలుగో వికెట్‌గా (222 పరుగుల వద్ద) వెనుదిరిగాడు.
లంచ్ విరామం సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 88 పరుగులు వెనుకపడి ఉంది. సుందర్ (21), రవీంద్ర జడేజా క్రీజ్‌లో ఉన్నారు.

ఈ మ్యాచ్‌లో భారత్ గట్టెక్కడం దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. ఇంకా రెండు సెషన్ల ఆట మిగిలి ఉండగా.. భారత్ 6 వికెట్లను నిలుపుకోవాలి. సుందర్, జడేజా తర్వాత పంత్ బ్యాటింగ్‌కు వస్తాడని తెలుస్తుంది. ఈ ముగ్గురు ఔటైతే భారత్ ఖేల్ ఖతం అయినట్లే.
ఈ మ్యాచ్‌లో ఓడితే భారత్ సిరీస్‌ను కూడా కోల్పోతుంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌ను భారత్ డ్రా చేసుకునే అవకాశం లేదు.
స్కోర్ వివరాలు..
భారత్ తొలి ఇన్నింగ్స్- 358 ఆలౌట్ (సాయి సుదర్శన్ 61, జైస్వాల్ 58, పంత్ 54, స్టోక్స్ 5/72)
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్- 669 ఆలౌట్ (రూట్ 150, స్టోక్స్ 141, రవీంద్ర జడేజా 4/143)
భారత్ రెండో ఇన్నింగ్స్- 223/4 (ఐదో రోజు లంచ్ విరామం సమయానికి)