
కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లండ్‌తో ఇవాళ (జులై 31) మొదలైన ఐదో టెస్ట్‌లో టీమిండియా కష్టాల్లో ఉంది. వరుణుడి అంతరాయాల నడుమ సాగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్.. లంచ్ విరామం తర్వాత వర్షం ఆటంకం కలిగించే సమయానికి 3 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది.
INDIA HAS GIFTED A WICKET TO ENGLAND IN TOUGH CONDITIONS 💔 pic.twitter.com/K3TweTiVGs
— Johns. (@CricCrazyJohns) July 31, 2025
ఆట నిలిచిపోయే సమయానికి 10 నిమిషాల ముందు భారత్ ఇంగ్లండ్‌కు ఓ ఫ్రీ గిఫ్ట్ ఇచ్చింది. శుభ్‌మన్ గిల్ (21) లేని పరుగు కోసం ప్రయత్నించి అనవసరంగా వికెట్ పారేసుకున్నాడు. అప్పటికే కష్టాల్లో ఉన్న టీమిండియాను గిల్ రనౌట్ మరింత ఇరకాటంలో పడేసింది. ఈ ఇన్నింగ్స్‌లో గిల్ మంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించాడు. ఆడిన 35 బంతుల్లో 4 సొగసైన బౌండరీలు బాదాడు.
సిరీస్‌లో తొలి మ్యాచ్ నుంచి భీకర ఫామ్‌లో ఉన్న గిల్ చీప్‌గా రనౌట్ కావడాన్ని భారత అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అంతకుముందు భారత్ 38 పరుగులకే ఇద్దరు ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. యశస్వి జైస్వాల్ 2, కేఎల్ రాహుల్ 14 పరుగులు చేసి పలాయనం చిత్తగించారు. సాయి సుదర్శన్‌తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేస్తున్న గిల్ అనవసరంగా రనౌటై టీమిండియాను కష్టాల్లోకి నెట్టేశాడు.
ప్రస్తుతం సాయి సుదర్శన్‌తో (28) పాటు కరుణ్ నాయర్ (0) క్రీజ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ (రాహుల్), అట్కిన్సన్‌కు (జైస్వాల్) తలో వికెట్ దక్కింది.
ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. వరుణుడు టాస్‌కు ముందు, లంచ్ విరామంలో ఓసారి, తాజాగా మరోసారి ఆటకు అడ్డుతగిలాడు. వాతావరణ శాఖ నివేదికల ప్రకారం ఈ రోజు ఆట అంతా ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. మధ్యమధ్యలో వరుణుడు పలకరిస్తూ పోతుంటాడు.
కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకపడి ఉన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే భారత్ సిరీస్‌ను సమం చేసుకోగలుగుతుంది. ఓడినా, డ్రా అయినా ఇంగ్లండే సిరీస్ ఎగరేసుకుపోతుంది.