
ఇంగ్లండ్తో జరిగిన టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీ-2025 రికార్డులకు అడ్డాగా మారింది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్లో చాలా రికార్డులు తిరగరాయబడ్డాయి. వీటిలో సింహభాగం భారత్, భారత్ ఆటగాళ్ల ఖాతాలో పడ్డాయి. జట్టు పరంగా టీమిండియా ఓ సరికొత్త రికార్డు నెలకొల్పింది.
ఓ టెస్ట్ సిరీస్లో ఆస్ట్రేలియా తర్వాత రెండో అత్యధిక పరుగులు నమోదు చేసిన జట్టుగా రికార్డుల్లోకెక్కింది. ఈ సిరీస్లో భారత్ 42.32 సగటున 3809 పరుగులు చేసింది. 1989 యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా అత్యధికంగా 3877 పరుగులు చేసింది. తాజా సిరీస్లో భారత్ కేవలం 5 టెస్ట్ల్లోనే ఈ పరుగులు చేయగా.. ఆసీస్ నాటి యాషెస్ సిరీస్లో 6 టెస్ట్లు ఆడి భారత్ కంటే కేవలం 68 పరుగులే ఎక్కువ చేసింది.
ఈ రికార్డుతో పాటు టెండూల్కర్-ఆండర్సన్ సిరీస్ మరిన్ని రికార్డులకు వేదికైంది. ఆ రికార్డులపై ఓ లుక్కేద్దాం.
భారత్-ఇంగ్లండ్ మధ్య ద్వైపాక్షిక సిరీస్లో అత్యధిక పరుగులు- శుభ్‌మన్ గిల్ (5 మ్యాచ్ల్లో 754 పరుగులు). గతంలో ఈ రికార్డు గ్రహం గూచ్ (752) పేరిట ఉండేది.
ఓ టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్- శుభ్‌మన్ గిల్. గతంలో ఈ రికార్డు సునీల్ గవాస్కర్ (732) పేరిట ఉండేది.
SENA దేశాల్లో జరిగిన సిరీస్ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆసియా బ్యాటర్: శుభ్‌మన్ గిల్, గతంలో ఈ రికార్డు విరాట్ కోహ్లి (692) పేరిట ఉండేది.
టెస్ట్ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన భారత కెప్టెన్: శుభ్‌మన్ గిల్ (269 ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్లో). గతంలో ఈ రికార్డు విరాట్ కోహ్లి (254) పేరిట ఉండేది.
SENA దేశాల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సిన ఆసియా కెప్టెన్: శుభ్‌మన్ గిల్. గతంలో ఈ రికార్డు తిలకరత్నే దిల్షన్ (193) పేరిట ఉండేది.
ఓ టెస్ట్ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన పర్యాటక బ్యాటర్: శుభ్‌మన్ గిల్ (430, ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్లో 269+161). గతంలో ఈ రికార్డు ఆసీస్ మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ (426) పేరిట ఉండేది.
ఒకే టెస్ట్లో సెంచరీ, 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తొలి ఇంగ్లండ్ కెప్టెన్: బెన్ స్టోక్స్ (నాలుగో టెస్ట్)
ఒకే టెస్ట్లో రెండు సెంచరీలు చేసిన తొలి భారత వికెట్కీపర్: రిషబ్ పంత్ (హెడింగ్లే టెస్ట్)
టెస్ట్ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకిన జో రూట్: ఈ సిరీస్లో రూట్ ద్రవిడ్, కల్లిస్, రికీ పాంటింగ్లను అధిగమించి టెస్ట్ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ లిస్ట్లో సచిన్ టెండూల్కర్ టాప్‌లో ఉన్నాడు.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో 6000 పరుగులు చేసిన తొలి బ్యాటర్: జో రూట్
SENA దేశాల్లో 150 వికెట్లు తీసిన తొలి ఆసియా బౌలర్: బుమ్రా (61 ఇన్నింగ్స్ల్లో)
ఓ సిరీస్లో రెండో అత్యధిక పరుగులు (ఇరు జట్లు): ఈ సిరీస్లో భారత్, ఇంగ్లండ్ కలిపి 7000 పైచిలుకు పరుగులు నమోదు చేశాయి. 1993 యాషెస్ సిరీస్లో మాత్రమే ఈ ఘనత నమోదైంది.
భారత్ అత్యల్ప, అతి భారీ విజయాలు (పరుగుల పరంగా): భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యల్ప, అతి భారీ విజయాలు ఈ సిరీస్లోనే నమోదయ్యాయి. ఈ సిరీస్లోని ఓవల్ టెస్ట్లో భారత్ 6 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందగా.. ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్లో 336 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
