
టీమిండియా పేస్‌దళ నాయకుడు జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)ను ఉద్దేశించి భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) కీలక వ్యాఖ్యలు చేశాడు. దేశం కోసం ప్రాణాలర్పించే సైనికుల్లా.. ఆటగాళ్లు జట్టు కోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలన్నాడు. విపత్కర పరిస్థితుల్లో జవాన్లు దగ్గు, జ్వరం అని పక్కకు వెళ్లిపోరని.. ప్రాణాలుపణంగా పెట్టి పోరాడేందుకే సిద్ధపడతారని పేర్కొన్నాడు.
అలాగే క్రికెటర్లు కూడా ‘పనిభారం’ అనే సాకును పక్కనపెట్టి అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని గావస్కర్ విజ్ఞప్తి చేశాడు. కాగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఇంగ్లండ్ (IND vs ENG Tests)లో పర్యటించిన విషయం తెలిసిందే. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ పేరిట నిర్వహించిన ఈ సిరీస్‌ను టీమిండియా 2-2తో సమం చేసింది.
మూడే టెస్టులు ఆడిన బుమ్రా
ఇక ఈ సిరీస్ ఆరంభానికి ముందే పనిభారం తగ్గించే క్రమంలో బుమ్రాను కేవలం మూడు టెస్టుల్లోనే ఆడిస్తామని టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ కూడా స్పష్టం చేశాడు. అందుకు తగ్గట్లుగా లీడ్స్, లార్డ్స్, మాంచెస్టర్ టెస్టులు ఆడిన తర్వాత బుమ్రాను జట్టు నుంచి బోర్డు రిలీజ్ చేసింది. అయితే, బుమ్రా మోకాలి గాయంతో బాధపడుతున్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.
వారెవ్వా అనిపించిన సిరాజ్ మియా
మరోవైపు బుమ్రా గైర్హాజరీలో ఆకాశమే హద్దుగా చెలరేగిన హైదరాబాదీ స్టార్ మహ్మద్ సిరాజ్.. అలుపున్నదే లేక వెయ్యి బంతులకు పైగా బౌలింగ్ వేశాడు. విశ్రాంతి ఎరుగని పోరాట యోధుడిలా 185 ఓవర్లకు పైగా బౌలింగ్ చేసి.. ఏకంగా 23 వికెట్లు పడగొట్టి టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.
పంత్ సైతం
ముఖ్యంగా ఆఖరిదైన ఐదో టెస్టులో నరాలు తెగే ఉత్కంఠ రేపిన పోరులో సిరాజ్ మియా.. ఏకంగా తొమ్మిది వికెట్లు కూల్చి భారత్‌కు విజయం అందించాడు. ఇదిలా ఉంటే.. రిషభ్ పంత్ సైతం బొటనవేలు ఫ్రాక్చర్ అయినా మాంచెస్టర్ టెస్టులో బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ సాధించాడు.
జవాన్లు కూడా ఇలాగే చేస్తే మన పరిస్థితి ఏంటి?
ఈ నేపథ్యంలో సిరాజ్, పంత్‌ల పేర్లు ప్రస్తావిస్తూ సునిల్ గావస్కర్.. పనిభారం పేరిట తప్పుకొనే ఆటగాళ్ల తీరును విమర్శించాడు. ‘‘సరిహద్దులో దేశం కోసం రక్షణగా నిలబడే సైనికుల్లాగే.. దేశానికి ప్రాతినిథ్యం వహించే ఆటగాళ్లు కూడా ఎల్లప్పుడూ తమ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలి.
జవాన్లు కూడా మాకు జలుబు చేసింది.. దగ్గు, జ్వరం అని చెప్పి తప్పుకొంటే మన పరిస్థితి ఏంటి? వాళ్లు దేశం కోసం ప్రాణాలే అర్పిస్తారు. ఆటగాళ్లు తమ ప్రాణం పణంగా పెట్టక్కర్లేదు గానీ.. అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలి. ఆ నొప్పి, ఈ బాధా అంటూ పక్కకు తప్పుకోకూడదు.
వారిద్దరిని చూసి నేర్చుకోండి
రిషభ్ పంత్ ఏం చేశాడో చూశారు కదా?!.. ఫ్రాక్చర్ అయినా జట్టు కోసం బ్యాట్‌తో బరిలోకి దిగాడు. మిగతా ఆటగాళ్ల నుంచి కూడా ఇలాంటి అంకితభావమే కావాలి. చిన్న చిన్న గాయాలను లెక్కచేయవద్దు.
దేశం కోసం ఆడుతుంటే కోట్ల మంది ప్రజలు మిమ్మల్ని గొప్పగా చూస్తారు. ఇండియాకు ప్రాతినిథ్యం వహించడం ఆటగాళ్లుగా మనకు దక్కిన గొప్ప అదృష్టం. దీనిని తేలిక చేయకూడదు.
ఐదు టెస్టుల్లోనూ మహ్మద్ సిరాజ్ అలుపున్నదే లేక తన అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. దేశం కోసం ఆడటంలో ఉన్న సంతోషాన్ని మనకు చూపించాడు’’ అని గావస్కర్ ప్రశంసలు కురిపించాడు. వర్క్‌లోడ్ పేరిట ఆటగాళ్లకు విశ్రాంతిస్తూ పోతే.. బెస్ట్ ప్లేయర్‌ను బరిలోకి దించలేమంటూ టీమిండియా మేనేజ్‌మెంట్‌ను విమర్శించాడు.
చదవండి: నేనే గనుక ఆ క్యాచ్ పట్టి ఉంటేనా: సిరాజ్ ఎమోషనల్.. గిల్ రియాక్షన్ వైరల్