నేను ఆ క్యాచ్‌ పట్టి ఉంటేనా: సిరాజ్‌ ఎమోషనల్‌.. గిల్‌ రియాక్షన్‌ వైరల్‌ | If he had taken the catch: Gill intervenes as Siraj Emotional on Dropping Brook | Sakshi
Sakshi News home page

నేనే గనుక ఆ క్యాచ్‌ పట్టి ఉంటేనా: సిరాజ్‌ ఎమోషనల్‌.. గిల్‌ రియాక్షన్‌ వైరల్‌

Aug 5 2025 11:45 AM | Updated on Aug 5 2025 12:54 PM

If he had taken the catch: Gill intervenes as Siraj Emotional on Dropping Brook

ఇంగ్లండ్‌ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌ (Harry Brook) క్యాచ్‌ మిస్‌ చేయడంపై టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ (Mohammed Siraj) స్పందించాడు. తాను ఒకవేళ ఆ క్యాచ్‌ సరిగ్గా పట్టి ఉంటే.. ఆట ఐదో రోజుకు చేరి ఉండకపోయేదని అభిప్రాయపడ్డాడు. ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపుతిప్పే సత్తా కలిగిన బ్రూక్‌ విషయంలో తాను చేసిన పొరపాటు వల్ల భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చేదంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.

ఓటమి అంచుల వరకు వెళ్లి..
ఆండర్సన్‌- టెండుల్కర్‌ ట్రోఫీలో భాగంగా ఓవల్‌లో జరిగిన ఐదో టెస్టులో టీమిండియా అద్భుతం చేసింది. ఓటమి అంచుల వరకు వెళ్లి గెలుపులోని అసలైన మజాను రుచిచూసింది. తద్వారా సిరీస్‌ను 2-2తో సమం చేసింది. నిజానికి ఓవల్‌ టెస్టులో టీమిండియా విజయంలో సిరాజ్‌దే కీలక పాత్ర.

బౌండరీ లైన్‌ తొక్కేయడంతో
నరాలు తెగే ఉత్కంఠ నడుమ.. ఇంగ్లండ్‌ విజయానికి ఏడు పరుగులు.. భారత్‌ గెలుపునకు ఒక వికెట్‌ దూరంలో ఉన్న వేళ.. సిరాజ్‌ ఆఖరి.. ఆ ఒక్క వికెట్‌ తీసి.. జట్టుకు సంచలన విజయం అందించాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా సిరాజ్‌ తొమ్మిది వికెట్లతో సత్తా చాటి.. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

అయితే, నాలుగో రోజు ఆటలో భాగంగా ఇంగ్లండ్‌ ప్రమాదకర బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌.. 19 పరుగల వద్ద ఉండగా.. లడ్డూ లాంటి క్యాచ్‌ ఇచ్చాడు. ఫైన్‌ లెగ్‌లో ఉన్న సిరాజ్‌ దీనిని ఒడిసిపట్టినా.. బౌండరీ లైన్‌ తొక్కేయడంతో బ్రూక్‌కు లైఫ్‌ లభించింది.

నిన్ను నువ్వు నమ్ము
ఆ తర్వాత అతడు వెనుదిరిగి చూడలేదు. 98 బంతుల్లోనే 111 పరుగుల సాధించి మ్యాచ్‌ను ఇంగ్లండ్‌ వైపు తిప్పాడు. అయితే, ఆఖరికి.. ఆకాశ్‌ దీప్‌ బౌలింగ్‌లో మళ్లీ సిరాజే బ్రూక్‌ క్యాచ్‌ పట్టాడు.

టీమిండియా విజయానంతరం సిరాజ్‌ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంపై స్పందించాడు. ‘‘మొదటి రోజు నుంచి ఎంతో పోరాటపటిమ కనబర్చాం. ఇలాంటి ఫలితం రావడం చాలా సంతోషంగా ఉంది. సరైన చోట నిలకడగా బంతులు వేసి ఒత్తిడి పెంచాలనేదే నా వ్యూహం. ‘నిన్ను నువ్వు నమ్ము’ అని రాసి ఉన్న ఒక ఫోటోను గూగుల్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్నాను.

నిజానికి హ్యారీ బ్రూక్‌ అసాధారణ ఆటగాడు. కొంతమంది డిఫెన్సివ్‌గా ఉంటారు కానీ... అతడు మాత్రం ఎల్లప్పుడూ అటాకింగ్‌ మోడ్‌లో ఉంటాడు. నేను గనుక అప్పుడే ఆ క్యాచ్‌ పట్టి ఉంటే మ్యాచ్‌ వేరేలా ఉండేది.

అదొక గేమ్‌ ఛేంజింగ్‌ మూమెంట్‌ అయ్యేది. అయితే, సీనియర్‌ బౌలర్‌గా నాకున్న పరిణతితో.. ఈ భారాన్ని మోయడం వల్ల ఒరిగే ప్రయోజనం ఏదీ లేదని నాకు తెలుసు. ‘జరిగిందేదో జరిగిపోయింది. ఆటలో ఇలాంటివి సహజం’ అని నన్ను నేను సముదాయించుకున్నాను’’ అంటూ సిరాజ్‌ ఎమోషనల్‌ అయ్యాడు.

గిల్‌ రియాక్షన్‌ వైరల్‌
ఇంతలో పక్కనే ఉన్న కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ కలుగజేసుకుంటూ.. ‘‘ఒకవేళ మేము ఆ క్యాచ్‌ పట్టి ఉంటే.. ఇంకాస్త సులువుగా గెలిచేవాళ్లం. మేము చాలా గొప్పగా ఆడాము.. అవునా? కాదా?’’ అంటూ సిరాజ్‌కు అండగా నిలిచాడు. గిల్‌ అలా అనగానే అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు నవ్వులు చిందించారు.

చదవండి: కన్నీటిపర్యంతమైన గంభీర్‌.... గూస్‌బంప్స్‌ తెప్పించేశారు భయ్యా! వీడియో వైరల్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement