ఓడినా సంతృప్తిగానే ఉన్నాం.. గొడవలు సహజమే.. అయితే..: స్టోక్స్‌ | Ben Stokes Reacts To Loss Big Statement On Animated Moments Wont Cry | Sakshi
Sakshi News home page

ఓడినా సంతృప్తిగానే ఉన్నాం.. గొడవలు సహజమే.. అయితే..: స్టోక్స్‌

Aug 5 2025 12:25 PM | Updated on Aug 5 2025 1:05 PM

Ben Stokes Reacts To Loss Big Statement On Animated Moments  Wont Cry

ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన భారత్‌- ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌ (IND vs ENG Tests) అంతే రసవత్తరంగా ముగిసింది. చారిత్రక ఓవల్‌ మైదానంలో ఆఖరిదైన ఐదో టెస్టులో.. చివరి రోజు వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో భారత్‌ గెలుపొందింది. 

నువ్వా- నేనా అన్నట్లు హోరాహోరీగా సాగిన పోరులో ఆరు పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా.. ఆండర్సన్‌- టెండుల్కర్‌ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy)ని 2-2తో సమం చేసింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ (Ben Stokes) ఐదో టెస్టులో తమ ఓటమిపై స్పందించాడు.

ఓడినా.. ఆ విషయంలో సంతృప్తిగా ఉంది
‘‘ఇంతటి కీలకమైన మ్యాచ్‌కు గాయం వల్ల దూరం కావడం కాస్త కఠినంగానే తోచింది. విజయం కోసం ఇరు జట్లూ మరోసారి తీవ్రంగా పోరాడాల్సి వచ్చింది. ఇక్కడ గెలవలేకపోవడం నిరాశ కలిగించినా మా జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నా.

సిరీస్‌ మొత్తం చాలా గొప్పగా సాగింది. ప్రతీ ఒక్కరూ ఎన్నో సందర్భాల్లో తమ భావోద్వేగాలు ప్రదర్శించారు. ఆరంభంలోనే ఒక బౌలర్‌ తప్పుకొన్నా రెండో ఇన్నింగ్స్‌లో మిగతా వారు ఎంతో పోరాటపటిమ కనబర్చారు.

ఇలా జరిగి ఉంటే బాగుండేదనే క్షణాలు గత ఐదు రోజుల్లో ఎన్నో వచ్చాయి. ఇవన్నీ ఆటను గొప్పగా మార్చాయి. అయితే మీ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వమని మాత్రమే మా ఆటగాళ్లకు చెప్పాం. ఆ విషయంలో సంతృప్తిగా ఉంది.

నాలాగే గిల్‌ కూడా గర్వపడతాడు
కానీ సిరీస్‌ గెలవలేకపోయామనే నిరాశ కూడా ఉంది. క్రిస్‌ వోక్స్‌ ఆఖరి రోజు బ్యాటింగ్‌ చేయడానికి ముందే సిద్ధమయ్యాడు. ఒంటిచేత్తో ఎలా బ్యాటింగ్‌ చేయాలో సన్నద్ధమయ్యాడు.

విరిగిన వేళ్లు, ఫ్రాక్చర్‌ అయిన పాదాలతో ఆటగాళ్లు బరిలో దిగడం.. దేశానికి ప్రాతినిథ్యం వహించడం పట్ల వారికి ఉన్న నిబద్ధత, అంకితభావాన్ని తెలియజేస్తాయి. వోక్స్‌ విషయంలో నేను గర్వపడుతున్నాను. నాకు తెలిసి శుబ్‌మన్‌ గిల్‌ కూడా ఇలాగే గర్వపడుతూ ఉంటాడు’’ అని స్టోక్స్‌ పేర్కొన్నాడు.

ఆటలో ఇవి సహజం.. అయితే వాటినే తలచుకుని..
అదే విధంగా.. ఇరుజట్ల ఆటగాళ్ల మధ్య జరిగిన వాగ్యుద్ధాల గురించి మీడియా ప్రశ్నించగా.. ‘‘ఇండియా- ఇంగ్లండ్‌ సిరీస్‌ ఇరుజట్లకు ఎంతో కీలకమైనది. భావోద్వేగాలతో ముడిపడిన ఈ సిరీస్‌లో జరిగిన ఎలాంటి ఘటనలూ వ్యక్తిగతంగా ఆటగాళ్లపై ప్రభావం చూపవు.

మైదానంలో జరిగిన వాటి గురించి ఆలోచిస్తూ ఎవరూ నిద్ర పాడుచేసుకోరు. ఇరుజట్ల ఆటగాళ్లు ఇలాగే ఆలోచిస్తారు. ఆటలో ఇవన్నీ భాగం’’ అని బెన్‌ స్టోక్స్‌ బదులిచ్చాడు.

అపుడు పంత్‌.. ఇపుడు వోక్స్‌
ఇదిలా ఉంటే.. ఐదో టెస్టులో ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో ఇంగ్లండ్‌ పేసర్‌ క్రిస్‌ వోక్స్‌ భుజం విరిగింది. అయితే, ఐదో రోజు ఆటలో నిలవాలంటే అతడు బ్యాటింగ్‌కు దిగాల్సి రాగా.. ఒంటిచేత్తోనే ఆడేందుకు వోక్స్‌ మైదానంలో దిగాడు. 

అయితే, అతడు ఒక్క బంతి కూడా ఎదుర్కోవాల్సిన అవసరం రాలేదు. టీమిండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ​ గస్‌ అట్కిన్సన్‌ (17)ను బౌల్డ్‌ చేయడంతో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌కు తెరపడగా.. టీమిండియా విజయం ఖరారైంది.

మరోవైపు.. మాంచెస్టర్‌లో జరిగిన నాలుగో టెస్టులో కుడికాలి బొటనవేలు ఫ్రాక్చర్‌ అయినా టీమిండియా స్టార్‌ రిషభ్‌ పంత్‌ బ్యాటింగ్‌కు తిరిగి వచ్చి.. అర్ధ శతకంతో మెరిసిన విషయం తెలిసిందే. ఇక ఈ సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లు ఐదు రోజులపాటు సాగి టెస్టు క్రికెట్‌ ప్రేమికులకు అసలైన మజా అందించాయి.

చదవండి: కన్నీటిపర్యంతమైన గంభీర్‌.... గూస్‌బంప్స్‌ తెప్పించేశారు భయ్యా! వీడియో వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement