
గంభీర్- గిల్ (PC: BCCI/X)
ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో టీమిండియా ఆట తీరుపై భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) విమర్శలు గుప్పించాడు. నాయకత్వ బృందం వ్యూహాలు సరిగ్గాలేవని.. ప్రతి మ్యాచ్‌లోనూ ఆఖరి వరకు పోరాడినా ఓడిపోవడం హర్షించదగ్గ విషయం కాదన్నాడు. ఓవల్ టెస్టు (IND vs ENG Oval Test)లోనూ పాత తప్పిదాలే పునరావృతం చేశారంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఆఖరి వరకు పోరాడినా..
కాగా ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy)లో భాగంగా భారత్ ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడుతోంది. లీడ్స్ టెస్టులో టీమిండియా ఐదు సెంచరీలు సాధించినా.. ఆఖరికి ఆతిథ్య జట్టు చేతిలో ఓటమిపాలైంది. అయితే, ఎడ్జ్‌బాస్టన్‌లో స్టోక్స్ బృందాన్ని ఏకంగా 336 పరుగులతో చిత్తు చేసి చారిత్రాత్మక విజయం సాధించింది.
అయితే, లార్డ్స్ టెస్టులో మాత్రం ఆఖరి వరకు పోరాడినా 22 పరుగుల తేడాతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. ఇక మాంచెస్టర్‌లో డ్రాతో గట్టెక్కింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉండగా.. ఓవల్‌లో ఆఖరి టెస్టులో టీమిండియా తప్పక గెలవాలి.
ఐదో రోజే ఫలితం
అయితే, రికార్డు స్థాయిలో ఈ వేదికపై ప్రత్యర్థికి 374 పరుగుల లక్ష్యాన్ని విధించిన గిల్ సేన.. దానిని కాపాడుకునే ప్రయత్నంలో తడబడుతోంది. ఆదివారం నాటి నాలుగో రోజు ఆట ముగిసేసరికి ఇంగ్లండ్ విజయానికి 35 పరుగుల దూరంలో నిలవగా.. భారత్ గెలుపొందాలంటే నాలుగు వికెట్లు కావాలి.
తప్పుల మీద తప్పులు!
ఇంగ్లండ్ ఈ మేర పటిష్ట స్థితికి చేరుకోవడానికి జో రూట్ (105), హ్యారీ బ్రూక్ (111) అద్భుత శతకాలే కారణం. ఈ నేపథ్యంలో అశ్విన్ మాట్లాడుతూ.. ‘‘వాటే ఫినిష్! ప్రతి మ్యాచ్‌లోనూ ఇరుజట్లు అనుభవలేమి కారణంగా ప్రాథమిక తప్పిదాలతో మూల్యం చవిచూస్తున్నాయి.
అయితే, ఈరోజు ఇంగ్లండ్ పటిష్ట స్థితిలో నిలిచేందుకు ఎలాంటి అర్హత కలిగి లేదు. కానీ మనవాళ్ల వల్లే ఇది సాధ్యమైంది. ఓవల్‌లో టీమిండియా విఫలమైంది. అసలు ఈ సిరీస్‌లో భారత బృందం ఆది నుంచే వ్యూహాత్మక తప్పిదాలు చేసింది.
అందుకే ఇంగ్లండ్ మనకంటే ముందుంది. శుబ్‌మన్ గిల్ రోజురోజుకీ మరింత మెరుగైన కెప్టెన్‌గా తయారవుతాడని నాకు నమ్మకం ఉంది. కానీ కొన్నిసార్లు ఆటకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.
అతడిని ముందుగానే తీసుకురావాల్సింది
పేసర్ల బౌలింగ్‌లో ప్రత్యర్థి బ్యాటర్లు షాట్లు బాదుతూ ఉంటే.. స్పిన్నర్లను బరిలోకి దించాలి. వారు వికెట్లు తీయకపోయినా పరుగుల ప్రవాహాన్ని మాత్రం కట్టడి చేస్తారు కదా!
హ్యారీ బ్రూక్ అటాక్ మొదలుపెట్టి.. 20 పరుగులు చేసిన తర్వాత.. కచ్చితంగా స్పిన్నర్‌ను తీసుకురావాల్సింది. స్పిన్ బౌలర్ ఉంటే పరుగులు రాకుండా కట్టడి చేసేవాడు. మరో ఎండ్ నుంచి పేసర్ బౌల్ చేసేవాడు. నిజంగా ఆదివారం వాషింగ్టన్ సుందర్ చేతికి ముందుగానే బంతిని ఇచ్చి ఉంటే జట్టుకు ప్రయోజనకరంగా ఉండేది.
డ్రెసింగ్ రూమ్ నుంచి వీరికి ఎలాంటి సలహాలు, సూచనలు వస్తున్నాయో నాకైతే తెలియడం లేదు. కానీ రోజు చిన్న చిన్న తప్పిదాల వల్ల భారీ మూల్యం చెల్లించే పరిస్థితికి చేరుకున్నాం’’ అంటూ ఫైర్ అయ్యాడు. హెడ్‌కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ గిల్ ప్రణాళికలు సరిగ్గా లేవంటూ అశ్విన్ విమర్శించాడు.
బౌలర్ల ప్రదర్శన ఇలా..
కాగా ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో పేసర్లలో ఆకాశ్ దీప్ 20 ఓవర్లలో 85 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీయగా.. ప్రసిద్ కృష్ణ 22.2 ఓవర్లలో 109 రన్స్ ఇచ్చి మూడు వికెట్లు కూల్చాడు. సీనియర్ పేసర్ మహ్మద్ సిరాజ్ 26 ఓవర్లలో 95 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకోగా.. స్పిన్ ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుందర్ 4 ఓవర్లలో 19, రవీంద్ర జడేజా 4 ఓవర్లలో 22 పరుగులు ఇచ్చారు.
చదవండి: IND vs ENG: కామన్‌సెన్స్ లేదు.. నిజంగా సిగ్గుచేటు.. అరగంటలో ముగించేవారు!
Just in awe 👏#SonySportsNetwork #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings | @root66 pic.twitter.com/HkJjOiiOBT
— Sony Sports Network (@SonySportsNetwk) August 3, 2025