
ఓవల్ టెస్ట్ విజయానంతరం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (2025-27) పాయింట్ల పట్టికలో భారత్ ఇంగ్లండ్‌ను వెనక్కు నెట్టి మూడో స్థానానికి ఎగబాకింది. ఇంగ్లండ్ నాలుగో స్థానానికి పడిపోయింది. ఈ మ్యాచ్‌కు ముందు భారత్ నాలుగో స్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ మూడో ప్లేస్‌లో ఉండింది.
ఈ మ్యాచ్ విజయానంతరం భారత్ విజయాల శాతం 46.67గా ఉండగా.. ఇంగ్లండ్ విన్నింగ్ పర్సంటేజ్ 43.33కు పడిపోయింది. ఆస్ట్రేలియా (100), శ్రీలంక (66.67) మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. 16.67 విజయాల శాతంతో బంగ్లాదేశ్ ఐదో ప్లేస్లో ఉంది. వెస్టిండీస్ ఈ సైకిల్లో ఆడిన మూడు మ్యాచ్ల్లో ఓడి ఆరో స్థానంలో ఉంది. న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా ఈ సైకిల్లో ఇంకా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
కాగా, ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్లో పర్యటించిన భారత జట్టు 2-2తో సిరీస్ను సమం చేసుకుంది. 1, 3 టెస్ట్ మ్యాచ్‌లు ఇంగ్లండ్ గెలువగా.. భారత్ 2, 5 మ్యాచ్ల్లో విజయాలు సాధించింది. నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది.
డబ్ల్యూటీసీలో భారత్ తదుపరి టెస్ట్ సిరీస్ వెస్టిండీస్‌తో ఆడనుంది. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్ భారత్ వేదికగా ఆక్టోబర్ 2 నుంచి ప్రారంభమవుతుంది. తొలి టెస్ట్ అహ్మదాబాద్‌లో, రెండో టెస్ట్ (అక్టోబర్ 10 నుంచి) ఢిల్లీలో జరుగనున్నాయి.
ఇదిలా ఉంటే, హోరాహోరీగా సాగిన ఓవల్ టెస్ట్‌లో భారత్ 6 పరుగుల స్వల్ప తేడాతో ఇంగ్లండ్పై విజయం సాధించింది. ఈ మ్యాచ్ చివరి రోజు భారత్ 35 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుని చిరస్మరణీయ విజయం సాధించింది. భారత బౌలర్లలో సిరాజ్ మ్యాజిక్ చేసి ఇంగ్లండ్ చేతిలో ఉండిన 4 వికెట్లలో 3 వికెట్లు తీశాడు. ప్రసిద్ద్ కృష్ణ ఓ వికెట్ పడగొట్టాడు.
374 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఓ దశలో పటిష్ట స్థితిలో (301/3) ఉన్నప్పటికీ.. భారత బౌలర్లు మ్యాచ్‌పై ఆశలు వదులుకోకుండా వీరోచితంగా పోరాడారు. ముఖ్యంగా సిరాజ్ ఓటమిని ఒప్పుకునే ప్రసక్తే లేదన్నట్లు ముందుకు సాగాడు. అతనికి ప్రసిద్ద్ సహకరించాడు. వీరిద్దరు కలిపి ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు తీశారు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు సహా మ్యాచ్ మొత్తంలో 9 వికెట్లు తీసిన సిరాజ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.