IND Vs ENG: సమంగా... సగర్వంగా... | India Beat England By Six Runs To Win Fifth Test Series, Check Out Full Score Details And Match Highlights Inside | Sakshi
Sakshi News home page

IND Vs ENG 5th Test: సమంగా... సగర్వంగా...

Aug 5 2025 5:12 AM | Updated on Aug 5 2025 11:18 AM

India beat England by six runs to win fifth Test Series

చివరి టెస్టులో భారత్‌ అద్భుత విజయం 

6 పరుగులతో ఓడిన ఇంగ్లండ్‌

రెండో ఇన్నింగ్స్‌లో 367 ఆలౌట్‌  

గెలిపించిన సిరాజ్‌ ∙ 2–2తో ముగిసిన సిరీస్‌

35 పరుగులా... 4 వికెట్లా... ఓవల్‌ మైదానంలో అన్ని వైపులా తీవ్ర ఉత్కంఠ... ప్రసిధ్‌ కృష్ణ వేసిన తొలి రెండు బంతుల్లో ఒవర్టన్‌ 2 ఫోర్లు కొట్టడంతో చేయాల్సిన దాంట్లో 20 శాతం పరుగులు ఇంగ్లండ్‌కు వచ్చేశాయి... కానీ ఆ తర్వాత సిరాజ్‌ బౌలింగ్‌ మొదలు పెట్టడంతో ఆట మళ్లీ మలుపు తిరిగింది. లక్ష్యం ఛేదించగల సత్తా ఉన్న జేమీ స్మిత్‌తోపాటు ఒవర్టన్‌ను వరుస ఓవర్లలో సిరాజ్‌ వెనక్కి పంపాడు. ఒకవైపు వాన పెద్దదిగా మారుతోంది... మళ్లీ ఆట ఆగిపోతుందా అనే సందేహాల నడుమ జోష్‌ టంగ్‌ను ప్రసిధ్‌ అవుట్‌ చేశాడు. 

తప్పనిసరి పరిస్థితుల్లో జట్టును కాపాడేందుకు వోక్స్‌ చేతికి కట్టుతోనే క్రీజ్‌లోకి వచ్చాడు. ఒంటిచేత్తో సహచరుడికి అండగా నిలిచేందుకు అతను సిద్ధమయ్యాడు. సిరాజ్‌ ఓవర్లో అట్కిన్సన్‌ కొట్టిన బంతిని బౌండరీ వద్ద ఆకాశ్‌దీప్‌ సరిగా అంచనా వేయక పోవడంతో అది సిక్స్‌గా మారింది. తర్వాతి ఓవర్లో మరో 3 పరుగులు రావడంతో 
లక్ష్యం ఇంకా తగ్గిపోయింది. కానీ మరుసటి ఓవర్‌ వేసిన సిరాజ్‌ తొలి బంతికే అద్భుతం చేశాడు. లో ఫుల్‌టాస్‌ బంతి అట్కిన్సన్‌ స్టంప్‌ను పడగొట్టడంతో భారత బృందం 
సంబరాల్లో మునిగిపోయింది. 

లార్డ్స్‌ టెస్టులో 23 పరుగులు చేయాల్సిన సమయంలో అనూహ్య రీతిలో చివరి వికెట్‌గా అవుటై గుండె పగిలిన సిరాజ్‌ ఇప్పుడు విజయానికి బాగా చేరువైన ప్రత్యరి్థని చివరి వికెట్‌గా అవుట్‌ చేసి జట్టును గెలిపించడం సినిమా స్క్రిప్‌్టకు ఏమాత్రం తగ్గని క్లైమాక్స్‌... సిరీస్‌ ఆద్యంతం 25 రోజుల పాటు (ఐదు టెస్టులు) రసవత్తరంగా సాగిన పోరును భారత్‌ సగర్వంగా ముగించింది. ఎన్నో మలుపులతో ఆధిపత్యం చేతులూ మారుతూ వచి్చన 73 సెషన్లలో చివరి క్షణాల్లో ఒత్తిడిని అధిగమించిన టీమిండియా ఈ సిరీస్‌ను సమం చేయడం విశేషం.  

లండన్‌: ఇంగ్లండ్‌ పర్యటనను భారత్‌ ఘనంగా ముగించింది. ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్‌ను 2–2తో సమం చేసింది. సోమవారం ఓవల్‌ మైదానంలో ముగిసిన చివరిదైన ఐదో టెస్టులో భారత్‌ 6 పరుగుల అతి స్వల్ప తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. విజయం కోసం రెండో ఇన్నింగ్స్‌లో 374 పరుగులు చేయాల్సిన ఇంగ్లండ్‌... ఓవర్‌నైట్‌ స్కోరు 339/6తో చివరి రోజు ఆటలో బరిలోకి దిగింది. అయితే ఆ జట్టు మరో 8.5 ఓవర్ల ఆటలో మరో 28 పరుగులు చేసి మిగిలిన వికెట్లు కోల్పోయింది. చివరకు  85.1 ఓవర్లలో 367 పరుగులకు ఆలౌటైంది. 

చివరి నాలుగు వికెట్లలో మూడు వికెట్లు తీసి భారత్‌ విజయంలో హైదరాబాద్‌ పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ కీలక పాత్ర పోషించాడు. ఈ టెస్టులో 9 వికెట్లు పడగొట్టిన సిరాజ్‌కే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. భారత్‌ తరఫున శుబ్‌మన్‌ గిల్‌ (754 పరుగులు), ఇంగ్లండ్‌ తరఫున హ్యరీ బ్రూక్‌ (481 పరుగులు) ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ పురస్కారాలు అందుకున్నారు. ఈ సిరీస్‌లో లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో, లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్‌ గెలవగా... బరి్మంగ్‌హామ్‌లో జరిగిన రెండో టెస్టును భారత్‌ గెలుచుకుంది. మాంచెస్టర్‌లో జరిగిన నాలుగో టెస్టు ‘డ్రా’గా ముగిసింది.  

స్కోరు వివరాలు 
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 224; ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 247; భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 396; 
ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌: క్రాలీ (బి) సిరాజ్‌ 14; డకెట్‌ (సి) రాహుల్‌ (బి) ప్రసిధ్‌ 54; పోప్‌ (ఎల్బీ) (బి) సిరాజ్‌ 27; రూట్‌ (సి) జురేల్‌ (బి) ప్రసిధ్‌ 105; బ్రూక్‌ (సి) సిరాజ్‌ (బి) ఆకాశ్‌దీప్‌ 111; బెతెల్‌ (బి) ప్రసిధ్‌ 5; స్మిత్‌ (సి) జురేల్‌ (బి) సిరాజ్‌ 2; ఒవర్టన్‌ (ఎల్బీ) (బి) సిరాజ్‌ 9; అట్కిన్సన్‌ (బి) సిరాజ్‌ 17; టంగ్‌ (బి) ప్రసిధ్‌ 0; వోక్స్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 23; మొత్తం (85.1 ఓవర్లలో ఆలౌట్‌) 367. 
వికెట్ల పతనం: 1–50, 2–82, 3–106, 4–301, 5–332, 6–337, 7–347, 8–354, 9–357, 10–367. 
బౌలింగ్‌: ఆకాశ్‌దీప్‌ 20–4–85–1, ప్రసిధ్‌ కృష్ణ 27–3–126–4, సిరాజ్‌ 30.1–6–104–5, వాషింగ్టన్‌ సుందర్‌ 4–0–19–0, రవీంద్ర జడేజా 4–0–22–0.

రెండు జట్లూ తమ అత్యుత్తమ ఆటతీరును కనబరుస్తూ అద్భుతంగా ఆడాయి. సిరాజ్, ప్రసిద్‌లాంటి బౌలర్లు జట్టులో ఉంటే కెప్టెన్సీ సులువవుతుంది. వీరిద్దరు ఈ రోజు చాలా బాగా బౌలింగ్‌ చేశారు. ఇంగ్లండ్‌ ఒత్తిడిలో ఉందని మాకు నాలుగో రోజే తెలుసు. దానినే కొనసాగించాలని భావించాం. సిరీస్‌లో ఆట జరిగిన తీరును బట్టి చూస్తే 2–2 సరైన ఫలితం. బ్యాటర్‌గా నేను అత్యధిక పరుగులు చేయాలని సిరీస్‌కు ముందు లక్ష్యంగా పెట్టుకున్నాను. దానిని సాధించడం కూడా సంతృప్తిగా ఉంది. ఎన్నడూ ఓటమిని అంగీకరించకూడదని ఈ సిరీస్‌ జరిగిన ఆరు వారాల్లో నేర్చుకున్నాను. 
– శుబ్‌మన్‌ గిల్, భారత జట్టు కెప్టెన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement