ఉప్పల్ వేదికగా నేటి నుంచి రంజీ మ్యాచ్
బరిలో సిరాజ్, శార్దుల్
సాక్షి, హైదరాబాద్: దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో భాగంగా హైదరాబాద్, ముంబై జట్ల మధ్య మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. రెండో అంచె పోటీలు గురువారం నుంచి ప్రారంభం కానుండగా... 42 సార్లు చాంపియన్ ముంబై జట్టుతో ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్ తలపడనుంది.
గ్రూప్ ‘డి’లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఒక విజయం, ఒక ఓటమి, మూడు ‘డ్రా’లతో 13 పాయింట్లు సాధించిన హైదరాబాద్ నాలుగో స్థానంలో... పరాజయం ఎరగని ముంబై 24 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాయి. లీగ్ దశలో మరో రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉండగా... ఈ రెండింట్లో మెరుగైన ప్రదర్శన చేయాలని హైదరాబాద్ భావిస్తోంది.
స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ అందుబాటులో లేకపోగా... టీమిండియా పేసర్ మొహమ్మద్ సిరాజ్ హైదరాబాద్ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. అజింక్యా రహానే అందుబాటులో లేకపోయినా... శార్దుల్ ఠాకూర్ సారథ్యంలోని ముంబై జట్టు సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్, షమ్స్ ములానీ, సిద్ధేశ్ లాడ్‌లతో పటిష్టంగా ఉంది. ప్రతి గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.


