Oval ground
-
IND Vs ENG: జో జీతా వహి సిరాజ్
సిరీస్‌లో ఐదు టెస్టులూ చివరి వరకు ఆడిన ఏకైక పేస్ బౌలర్. ఏకంగా 1113 బంతులు... సిరీస్ తొలిరోజు నుంచి చివరిరోజు వరకు బౌలింగ్‌లో అదే వేగం, అంతే తీవ్రత... ప్రతీ బంతి వేసే సమయంలో 100 శాతం ఇవ్వాలనే తపన... చేసే పని భారంగా అనిపించలేదు... సుదీర్ఘ సిరీస్‌లో విశ్రాంతి తీసుకోలేదు. గాయంతో తప్పుకోలేదు, మ్యాచ్ మధ్యలో ఫిట్నెస్ సమస్యలతో ఒక్కసారి కూడా బౌలింగ్‌కు దూరం కాలేదు... చివరకు అద్భుత రీతిలో మ్యాచ్‌ను గెలిపించే వరకు ఆగిపోలేదు... ఇలాంటి పోరాటతత్వం, పట్టుదల హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్కే సాధ్యమైంది. 185.3 ఓవర్ల బౌలింగ్ తర్వాత కూడా అతను అలసిపోకుండా ఇప్పుడు మళ్లీ బౌలింగ్ చేసేందుకు సిద్ధంగా ఉండి ‘సై’ అంటున్నాడు. ఈ సిరీస్‌లో అతని ప్రదర్శనను ప్రశంసించనివారు లేరు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు అథర్టన్, మైకేల్ వాన్, నాసిర్ హుస్సేన్ మాటల్లో చెప్పాలంటే సిరాజ్ సింహంలా పోరాడిన ఒక ‘లయన్ హార్ట్’ బౌలర్. అసలు అతను సిరీస్ ఆసాంతం ఒకే తరహాలో అంతే దూకుడుతో ఎలా బౌలింగ్ చేస్తున్నాడో వారికి కూడా ఆశ్చర్యపర్చింది. ‘దేశం తరఫున ఆడటం అనేదే ఒక ఆటగాడికి లభించే ఎంతో గొప్ప అవకాశం. అలాంటప్పుడు నేను ఎన్ని ఓవర్లు వేశాను, ఎంత ఎక్కువగా కష్టపడుతున్నాను అన్నది అస్సలు పట్టించుకోవాల్సిన విషయమే కాదు. నాలో సత్తా ఉన్నంత వరకు బౌలింగ్ చేస్తూనే ఉంటాను. అదృష్టవశాత్తూ ఇప్పుడు కూడా నేను ఫిట్‌గా ఉన్నాను’... చివరి టెస్టు ముగిసిన తర్వాత భారత పేసర్ మొహమ్మద్ సిరాజ్ వ్యాఖ్య ఇది. ముందుండి నడిపిస్తూ... టాప్ పేసర్ బుమ్రా మూడు టెస్టులే ఆడతాడని ఖాయమయ్యాక సహజంగానే సీనియర్ అయిన సిరాజ్‌పై ఎక్కువ బాధ్యత నిలిచింది. దానిని అతను సమర్థంగా నిర్వర్తించాడు. జట్టుకు అవసరమైన ప్రతీ సందర్భంలోనూ సిరాజ్ నేనున్నానంటూ ముందుకు వచ్చాడు. కొత్త బంతి ఇస్తే దానిని సమర్థంగా ఉపయోగించాడు. కాస్త పాతబడిన బంతిని అప్పగిస్తే డ్యూక్ బంతులను వాడుకుంటూ స్వింగ్‌లో చెలరేగడం అతనికే చెల్లింది. కెప్టెన్ గిల్ అయితే ఇక చాలు బౌలింగ్ చేయలేడు అనిపించిన సమయాల్లో కూడా మళ్లీ సిరాజ్కే బంతిని అప్పగించాడు. కాస్త ఘాటుగా చెప్పాలంటే చెరకు మిషన్‌లో చెరకు గడను చివరి వరకు వాడుతూ పిప్పి చేసినట్లుగా సిరాజ్‌ను గిల్ ఉపయోగించుకున్నాడు. అయినా సరే ఎక్కడా తగ్గకుండా కీలక సమయాల్లో కీలక వికెట్లతో భారత్ మ్యాచ్‌లో పైచేయి సాధించేలా చేశాడు. బుమ్రా ఆడని రెండు టెస్టుల్లో భారత్ గెలిచింది. ఎడ్జ్‌బాస్టన్‌లో 7 వికెట్లు తీసిన సిరాజ్, ఓవల్‌లో 9 వికెట్లు పడగొట్టాడు. సిరీస్‌లో అతను రెండుసార్లు ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. రెండో టెస్టులో వరుస బంతుల్లో రూట్, స్టోక్స్‌లను అవుట్ చేయడం, క్రాలీని డకౌట్ చేయడం కీలక మలుపులు కాగా... ఓవల్ తొలి ఇన్నింగ్స్‌లో అతను తీసిన పోప్, రూట్, బ్రూక్ వికెట్లతోనే తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌కు భారీ ఆధిక్యం దక్కలేదు. మూడో రోజు క్రాలీని బౌల్డ్ చేసిన బంతిని ఎవరూ మర్చిపోలేరు. చివరి రోజు బౌలింగ్ గురించైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిలకడగా సత్తా చాటుతూ... మాంచెస్టర్ టెస్టులో 30 ఓవర్లలో 140 పరుగులు ఇచ్చి ఒకటే వికెట్ తీసినప్పుడు సిరాజ్ బౌలింగ్‌లో పదును తగ్గినట్లు అనిపించింది. అయితే తర్వాతి మ్యాచ్‌తోనే అతను తనపై వచ్చిన సందేహాలను పటాపంచలు చేశాడు. చాలా సందర్భాల్లో బుమ్రా నీడలో ఉన్నట్లుగా కనిపించిన సిరాజ్ అవకాశం దక్కిన ప్రతీసారి తానేంటో చూపిస్తున్నాడు. బుమ్రాతో కలిసి ఆడిన టెస్టుల్లోకంటే అతను లేని టెస్టుల్లో చెలరేగిపోతున్నాడు. ఏడాదిన్నర క్రితం కేప్‌టౌన్ టెస్టులో దక్షిణాఫ్రికాపై 15 పరుగులే ఇచ్చి 6 వికెట్లు తీసినప్పుడే టెస్టు బౌలర్‌గా సిరాజ్ స్థాయి ఎంతో పెరిగింది. ఆ్రస్టేలియాతో సిరీస్‌లోనూ 20 వికెట్లు పడగొట్టినా... బుమ్రా అసాధారణ 32 వికెట్ల బౌలింగ్‌తో పాటు భారత్ సిరీస్ ఓడటంతో అతని ప్రదర్శనకు గుర్తింపు రాలేదు. కానీ ఇప్పుడు ఓడిపోతుందనుకున్న సిరీస్‌ను సమం చేయడంలో సిరాజ్ పోషించిన పాత్ర అతడిని మరో మెట్టు పైకి ఎక్కించింది. చివరగా... నాలుగో రోజు హ్యారీ బ్రూక్ క్యాచ్ వదిలేయడంతో సిరాజ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అతని అద్భుత బౌలింగ్‌నూ పట్టించుకోకుండా కొందరు వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యాచ్ ఓడి ఉంటే అది అతడిని ఎప్పటికీ వెంటాడేది. కానీ ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్న ఈ బౌలర్ అలాంటి అవకాశం ఇవ్వకుండా ఒంటిచేత్తో మ్యాచ్‌ను ముగించాడు. భారత్‌ను గెలిపించాడు. తానూ గెలిచాడు. ప్రశంసల వెల్లువటెస్టు క్రికెట్‌కు వన్నెతెచి్చన సిరీస్ ఇది. ఆఖరి మ్యాచ్ అయితే అద్భుతం. నిజంగా రోమాలు నిక్క»ొడుచుకునేలా చేసింది. సిరీస్ ఫలితం 2–2 అయి వుండొచ్చు. కానీ... ప్రదర్శనతో 10కి 10 మార్కులు తెచ్చుకున్నారు. టీమిండియన్స్ అంతా సూపర్‌గా ఆడారు. –భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్భారత జట్టు అద్భుత విజయం సాధించింది. సిరాజ్, ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో కనబరిచిన నిబద్ధత, అంకితభావానికి హ్యాట్సాఫ్. సిరాజ్‌కు నా ప్రత్యేక అభినందనలు. జట్టు కోసం ఏదైనా చేసేందుకు ముందువరుసలో సిద్ధంగా ఉంటాడు. –విరాట్ కోహ్లిసంప్రదాయ క్రికెట్‌కు ఉన్న మ్యాజిక్‌ను ఆవిష్కరించిన మ్యాచ్ ఇది. ఓవల్ క్రికెట్ చరిత్రలోనే నిలిచిపోయే మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చింది. అసాధారణ ఆటతీరుతో టెస్టు ఇమేజ్ పెంచిన భారత్, ఇంగ్లండ్ జట్ల సభ్యులకు నా ప్రత్యేక ప్రశంసలు. –ఐసీసీ చైర్మన్ జై షాసాక్షి క్రీడా విభాగం -
IND Vs ENG: సమంగా... సగర్వంగా...
35 పరుగులా... 4 వికెట్లా... ఓవల్ మైదానంలో అన్ని వైపులా తీవ్ర ఉత్కంఠ... ప్రసిధ్ కృష్ణ వేసిన తొలి రెండు బంతుల్లో ఒవర్టన్ 2 ఫోర్లు కొట్టడంతో చేయాల్సిన దాంట్లో 20 శాతం పరుగులు ఇంగ్లండ్‌కు వచ్చేశాయి... కానీ ఆ తర్వాత సిరాజ్ బౌలింగ్ మొదలు పెట్టడంతో ఆట మళ్లీ మలుపు తిరిగింది. లక్ష్యం ఛేదించగల సత్తా ఉన్న జేమీ స్మిత్‌తోపాటు ఒవర్టన్‌ను వరుస ఓవర్లలో సిరాజ్ వెనక్కి పంపాడు. ఒకవైపు వాన పెద్దదిగా మారుతోంది... మళ్లీ ఆట ఆగిపోతుందా అనే సందేహాల నడుమ జోష్ టంగ్‌ను ప్రసిధ్ అవుట్ చేశాడు. తప్పనిసరి పరిస్థితుల్లో జట్టును కాపాడేందుకు వోక్స్ చేతికి కట్టుతోనే క్రీజ్‌లోకి వచ్చాడు. ఒంటిచేత్తో సహచరుడికి అండగా నిలిచేందుకు అతను సిద్ధమయ్యాడు. సిరాజ్ ఓవర్లో అట్కిన్సన్ కొట్టిన బంతిని బౌండరీ వద్ద ఆకాశ్‌దీప్ సరిగా అంచనా వేయక పోవడంతో అది సిక్స్‌గా మారింది. తర్వాతి ఓవర్లో మరో 3 పరుగులు రావడంతో లక్ష్యం ఇంకా తగ్గిపోయింది. కానీ మరుసటి ఓవర్ వేసిన సిరాజ్ తొలి బంతికే అద్భుతం చేశాడు. లో ఫుల్‌టాస్ బంతి అట్కిన్సన్ స్టంప్‌ను పడగొట్టడంతో భారత బృందం సంబరాల్లో మునిగిపోయింది. లార్డ్స్ టెస్టులో 23 పరుగులు చేయాల్సిన సమయంలో అనూహ్య రీతిలో చివరి వికెట్‌గా అవుటై గుండె పగిలిన సిరాజ్ ఇప్పుడు విజయానికి బాగా చేరువైన ప్రత్యరి్థని చివరి వికెట్‌గా అవుట్ చేసి జట్టును గెలిపించడం సినిమా స్క్రిప్‌్టకు ఏమాత్రం తగ్గని క్లైమాక్స్... సిరీస్ ఆద్యంతం 25 రోజుల పాటు (ఐదు టెస్టులు) రసవత్తరంగా సాగిన పోరును భారత్ సగర్వంగా ముగించింది. ఎన్నో మలుపులతో ఆధిపత్యం చేతులూ మారుతూ వచి్చన 73 సెషన్లలో చివరి క్షణాల్లో ఒత్తిడిని అధిగమించిన టీమిండియా ఈ సిరీస్‌ను సమం చేయడం విశేషం. లండన్: ఇంగ్లండ్ పర్యటనను భారత్ ఘనంగా ముగించింది. ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్‌ను 2–2తో సమం చేసింది. సోమవారం ఓవల్ మైదానంలో ముగిసిన చివరిదైన ఐదో టెస్టులో భారత్ 6 పరుగుల అతి స్వల్ప తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. విజయం కోసం రెండో ఇన్నింగ్స్‌లో 374 పరుగులు చేయాల్సిన ఇంగ్లండ్... ఓవర్‌నైట్ స్కోరు 339/6తో చివరి రోజు ఆటలో బరిలోకి దిగింది. అయితే ఆ జట్టు మరో 8.5 ఓవర్ల ఆటలో మరో 28 పరుగులు చేసి మిగిలిన వికెట్లు కోల్పోయింది. చివరకు 85.1 ఓవర్లలో 367 పరుగులకు ఆలౌటైంది. చివరి నాలుగు వికెట్లలో మూడు వికెట్లు తీసి భారత్ విజయంలో హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ కీలక పాత్ర పోషించాడు. ఈ టెస్టులో 9 వికెట్లు పడగొట్టిన సిరాజ్కే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. భారత్ తరఫున శుబ్‌మన్ గిల్ (754 పరుగులు), ఇంగ్లండ్ తరఫున హ్యరీ బ్రూక్ (481 పరుగులు) ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారాలు అందుకున్నారు. ఈ సిరీస్‌లో లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో, లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ గెలవగా... బరి్మంగ్‌హామ్‌లో జరిగిన రెండో టెస్టును భారత్ గెలుచుకుంది. మాంచెస్టర్‌లో జరిగిన నాలుగో టెస్టు ‘డ్రా’గా ముగిసింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 224; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 247; భారత్ రెండో ఇన్నింగ్స్: 396; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: క్రాలీ (బి) సిరాజ్ 14; డకెట్ (సి) రాహుల్ (బి) ప్రసిధ్ 54; పోప్ (ఎల్బీ) (బి) సిరాజ్ 27; రూట్ (సి) జురేల్ (బి) ప్రసిధ్ 105; బ్రూక్ (సి) సిరాజ్ (బి) ఆకాశ్‌దీప్ 111; బెతెల్ (బి) ప్రసిధ్ 5; స్మిత్ (సి) జురేల్ (బి) సిరాజ్ 2; ఒవర్టన్ (ఎల్బీ) (బి) సిరాజ్ 9; అట్కిన్సన్ (బి) సిరాజ్ 17; టంగ్ (బి) ప్రసిధ్ 0; వోక్స్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 23; మొత్తం (85.1 ఓవర్లలో ఆలౌట్) 367. వికెట్ల పతనం: 1–50, 2–82, 3–106, 4–301, 5–332, 6–337, 7–347, 8–354, 9–357, 10–367. బౌలింగ్: ఆకాశ్‌దీప్ 20–4–85–1, ప్రసిధ్ కృష్ణ 27–3–126–4, సిరాజ్ 30.1–6–104–5, వాషింగ్టన్ సుందర్ 4–0–19–0, రవీంద్ర జడేజా 4–0–22–0.రెండు జట్లూ తమ అత్యుత్తమ ఆటతీరును కనబరుస్తూ అద్భుతంగా ఆడాయి. సిరాజ్, ప్రసిద్లాంటి బౌలర్లు జట్టులో ఉంటే కెప్టెన్సీ సులువవుతుంది. వీరిద్దరు ఈ రోజు చాలా బాగా బౌలింగ్ చేశారు. ఇంగ్లండ్ ఒత్తిడిలో ఉందని మాకు నాలుగో రోజే తెలుసు. దానినే కొనసాగించాలని భావించాం. సిరీస్‌లో ఆట జరిగిన తీరును బట్టి చూస్తే 2–2 సరైన ఫలితం. బ్యాటర్‌గా నేను అత్యధిక పరుగులు చేయాలని సిరీస్‌కు ముందు లక్ష్యంగా పెట్టుకున్నాను. దానిని సాధించడం కూడా సంతృప్తిగా ఉంది. ఎన్నడూ ఓటమిని అంగీకరించకూడదని ఈ సిరీస్ జరిగిన ఆరు వారాల్లో నేర్చుకున్నాను. – శుబ్‌మన్ గిల్, భారత జట్టు కెప్టెన్ -
WTC Final: టీమిండియాకు కష్టమే.. 250 పరుగులే చాలా ఎక్కువ..!
ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్లో టీమిండియా విజయావకాశాలు క్రమంగా సన్నగిల్లుతున్నాయి. నాలుగో రోజు తొలి సెషన్ సమయానికి ఆసీస్ 333 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుండటంతో టీమిండియా డ్రా కోసమే ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే డ్రా లేక ఓటమే తప్ప.. రోహిత్ సేనకు గెలిచే అవకాశం దాదాపుగా లేనట్టే. ఈ పరిస్థితుల్లో మరో విషయం టీమిండియాను తెగ కలవరపెడుతుంది. ఓవల్‌లో ఇప్పటివరకు ఏ జట్టు 300కు పైగా టార్గెట్‌ను ఛేదించింది లేదు. ఇక్కడ విజయవంతంగా ఛేదించిన టార్గెట్ 263. 1902లో ఆస్ట్రేలియా నిర్ధేశించిన 263 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ అతికష్టం మీద 9 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆతర్వాత 1963లో 255, 1972లో 242, 1988లో 226 పరుగుల లక్ష్యాలను వివిధ జట్లు ఛేదించాయి. ఎటు చూసినా ఓవల్‌లో 250 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం మాత్రం చాలా కష్టం. ఈ విషయమే ప్రస్తుతం టీమిండియాను కలవరపెడుతుంది. ఇదిలా ఉంటే, 123/4 స్కోర్ వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్.. ఆదిలోనే లబూషేన్ వికెట్ కోల్పోయింది. మూడో ఓవర్లోనే లబూషేన్‌ను ఉమేశ్ యాదవ్ పెవిలియన్‌కు పంపించాడు. వికెట్ కోల్పోయినా ఆసీస్ ఏమాత్రం తడబడకుండా నిలకడగా ఆడుతుంది. ఆ జట్టు స్కోర్ 160/5గా ఉంది. గ్రీన్ (21), క్యారీ (19) క్రీజ్‌లో ఉన్నారు. స్కోర్ వివరాలు.. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 469 ఆలౌట్ (హెడ్ 163, స్మిత్ 121, సిరాజ్ 4/108) భారత్ తొలి ఇన్నింగ్స్: 296 ఆలౌట్ (రహానే 89, ఠాకూర్ 51, కమిన్స్ 3/83) ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 160/5 (లబూషేన్ 41, జడేజా 2/32) ఆసీస్ 311 పరుగుల ఆధిక్యంలో ఉంది చదవండి: WTC Final: అరుదైన క్లబ్లో మిచెల్ స్టార్క్.. నాలుగో బౌలర్‌గా..! -
WTC Final: అతను సెంచరీ కొట్టాడా టీమిండియా గెలిచినట్లే..!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి కొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల కెప్టెన్లతో జరిగే ప్రత్యేక కార్యక్రమం కూడా అయిపోయింది. కెప్టెన్లు ఇద్దరూ డబ్ల్యూటీసీ గదతో ఫోటో షూట్లో కూడా పాల్గొన్నారు. ఫైనల్‌కు చేరే క్రమంలో ఇరు జట్ల కెప్టెన్లు తమ అనుభవాలను పంచుకున్నారు. ఫైనల్ మ్యాచ్‌లో తమ ప్రణాళికలు, జట్టు కూర్పు తదితర విషయాలను షేర్ చేసుకున్నారు. అంతిమంగా ఇరు జట్ల కెప్టెన్లు గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రేపు (జూన్ 7) మధ్యాహ్నం 3 గంటల నుండి ప్రారంభంకానుంది. The Captains 👍 The Championship Mace 👌 The Big Battle 💪 All In Readiness for the #WTC23#TeamIndia pic.twitter.com/Ep10vb2aj5 — BCCI (@BCCI) June 6, 2023 ఇదిలా ఉంటే.. ప్రతిష్టాత్మకమైన ఈ మ్యాచ్‌కు ముందు ఓ ఆసక్తికర విషయం నెట్టింట వైరలవుతుంది. ఈ విషయం ముఖ్యంగా టీమిండియా అభిమానులను తెగ సంతోషానికి గురి చేస్తుంది. అదేంటంటే.. టీమిండియా బ్యాటర్ అజింక్య రహానే టెస్ట్‌ల్లో సెంచరీ చేసిన ప్రతిసారి టీమిండియా ఓడిపోలేదు. రహానే తన టెస్ట్ కెరీర్లో 12 సెంచరీలు చేయగా.. వాటిలో టీమిండియా 9 మ్యాచ్‌ల్లో గెలుపొంది, 3 మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. India never lost a Test match whenever Ajinkya Rahane scored a century. Can the birthday boy repeat it in the World Test Championship final? pic.twitter.com/MJCka7Rnnp — CricTracker (@Cricketracker) June 6, 2023 రహానే సెంచరీ చేసిన గత ఐదు సందర్భాల్లో టీమిండియా ప్రతి మ్యాచ్ గెలుపొందింది. ఈ సెంటిమెంటే ప్రస్తుతం టీమిండియా అభిమానుల సంతోషానికి కారణం. ఐపీఎల్ 2023లో సత్తా చాటి, దాదాపు ఏడాదిన్నర తర్వాత తిరిగి భారత జట్టులోకి వచ్చిన రహానే తన ఐపీఎల్ ఫామ్‌ను డబ్ల్యూటీసీ ఫైనల్లో కొనసాగించి సెంచరీ చేస్తాడని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఇదే జరిగితే టీమిండియా గెలుపు గ్యారెంటీ అని ధీమాగా ఉన్నారు. రహానే సెంచరీల సెంటిమెంట్‌ను సోషల్‌మీడియాలో షేర్ చేస్తూ, గెలుపు తమదేనని కామెంట్లు చేస్తున్నారు. చదవండి: WTC Final: అంతా సిద్ధం.. ట్రోఫీతో ఇరు జట్ల కెప్టెన్ల ఫోటోషూట్ -
ఆస్ట్రేలియా టీమ్ కి నిద్రలేని రాత్రులు ఎందుకంటే..!
-
WTC Final: టీమిండియా బహుపరాక్.. ఓవల్‌లో స్టీవ్ స్మిత్‌ను ఆపడం చాలా కష్టం..!
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్‌కు ముందు టీమిండియాను ఓ విషయం బయపెడుతుంది. అదేంటంటే.. ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్‌కు మ్యాచ్ వేదిక అయిన ఓవల్‌లో అద్భుతమైన రికార్డు ఉండటం. ఈ ఆసీస్ స్టార్ ఓవల్ మైదానంలో ఆడిన 5 ఇన్నింగ్స్‌ల్లో 97.75 సగటున 391 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు (138*, 143), ఓ హాఫ్ సెంచరీ (80) ఉన్నాయి. ఓవల్‌లో స్మిత్‌కు ఉన్న ఈ రికార్డే ప్రస్తుతం టీమిండియాను కలవరపెడుతుంది. స్మిత్‌కు కళ్లెం వేసే వ్యూహరచనలో భారత బౌలర్లు నిమగ్నమయ్యారు. అతన్ని ఎలాగైనా తొందరగా ఔట్ చేయాలని వారు భావిస్తున్నారు. స్మిత్ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. స్మిత్‌ను తొందరగా పెవిలియన్‌కు పంపితే మంచిదని, అతను క్రీజ్‌లో కుదురుకుంటే చాలా ప్రమాదమని వారు వార్నింగ్ ఇస్తున్నారు. స్మిత్‌కు ఇంగ్లండ్‌లో వాతావరణ పరిస్థితులపై కూడా పూర్తి అవగాహణ ఉందని, అక్కడి పిచ్‌లపై అతను ఏకంగా 6 శతాకలు బాదాడని గుర్తు చేస్తున్నారు. మరోవైపు స్మిత్‌కు టీమిండియాపై కూడా ఘనమైన రికార్డు ఉన్న విషయాన్ని గుర్తించాలని అంటున్నారు. స్మిత్ భారత్‌పై 35 ఇన్నింగ్స్‌లు ఆడి 65.07 సగటున 8 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు సాయంతో 1887 పరుగులు చేశాడన్న విషయాన్ని మరవకూడదని హెచ్చరిస్తున్నారు. మొత్తంగా స్మిత్‌తో జాగ్రత్తగా ఉండాలని, లేదంటి అతను మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తాడని వార్నింగ్ ఇస్తున్నారు. కాగా, భారత్-ఆస్ట్రేలియా మధ్య లండన్‌లోని కెన్నింగ్స్టన్ ఓవల్ మైదానం వేదికగా జూన్ 7 నుంచి 11 వరకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్ జరుగనున్న విషయం తెలిసిందే. -
WTC- 2023 Final: డబ్ల్యూటీసీ ఫైనల్ వేదిక మారింది! ఈసారి లార్డ్స్‌లో కాదు!
World Test Championship 2023, 2025 Final Venues: ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్-2023 వేదిక మారింది. క్రికెట్ మక్కాగా పిలుచుకునే ఇంగ్లండ్‌లోని ప్రఖ్యాత లార్డ్స్ మైదానం ఈ మెగా మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తుందని అంతర్జాతీయ క్రికెట్ మండలి తొలుత ప్రకటించింది. అయితే, ఇప్పుడు వేదికను లార్డ్స్ నుంచి ది ఓవల్‌కు మార్చినట్లు తాజాగా ప్రకటన విడుదల చేసింది. ఇక డబ్ల్యూటీసీ-2025 ఫైనల్ మాత్రం లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లోనే జరుగుతుందని స్పష్టం చేసింది. ఈ విషయం గురించి ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జియోఫ్ అలార్డిస్ మాట్లాడుతూ.. ‘‘వచ్చే ఏడాది జరుగనున్న ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో చారిత్రాత్మక ది ఓవల్‌లో నిర్వహించనున్నామని ప్రకటించడం సంతోషంగా ఉంది’’ అంటూ హర్షం వ్యక్తం చేశారు. కాగా డబ్ల్యూటీసీ తొలి ఫైనల్ ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్ వేదికగా జరిగిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్- టీమిండియా మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో విలియమ్సన్ సేన విజయం సాధించింది. డబ్ల్యూటీసీ తొలి ట్రోఫీ గెలిచిన జట్టుగా కివీస్ చరిత్ర సృష్టించింది. ఇక డబ్ల్యూటీసీ 2021-23 సీజన్ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఆస్ట్రేలియా 84 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో దక్షిణాఫ్రికా, శ్రీలంక, ఇండియా, పాకిస్తాన్ కొనసాగుతున్నాయి. చదవండి: World Test Championship Final: శ్రీలంక కష్టమే! ఆసీస్ ముందంజలో! అదే జరిగితే ఫైనల్లో భారత్- పాకిస్తాన్! -
Ind Vs Eng 4th Test: చలో ఓవల్... అశ్విన్ ఆడతాడా?!
అడిలైడ్‌లో 36 పరుగులకు ఆలౌట్ అయిన తర్వాత కూడా భారత జట్టు ఆస్ట్రేలియాపై సిరీస్ గెలవగలిగింది. ఆపై స్వదేశంలో ఇంగ్లండ్ చేతిలో తొలి టెస్టులో పరాజయం పాలైన తర్వాత కూడా మళ్లీ కోలుకొని ప్రత్యర్థిని చిత్తు చేసింది. కింద పడిన ప్రతీసారి మరింత బలంగా పైకి లేవడం భారత్‌కు కొత్త కాదు. గతంలో ఎన్నోసార్లు దీనిని చేసి చూపించిన టీమిండియా ఇంగ్లండ్ గడ్డపై దానిని పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. లార్డ్స్‌లో గెలుపు తర్వాత లీడ్స్‌లో ఓటమిని ఆహ్వానించిన కోహ్లి సేన... గత మ్యాచ్‌లో ఘనవిజయం సాధించి అమితోత్సాహంతో ఉన్న ఇంగ్లండ్ జట్టును ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తికరం. లండన్: భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ కీలక దశకు చేరుకుంది. మూడు మ్యాచ్‌ల తర్వాత ఇరు జట్లు 1–1తో సమంగా ఉండగా... మరో టెస్టు గెలిస్తే ఏ జట్టుకైనా సిరీస్ ఓడిపోయే ప్రమాదం తప్పుతుంది. ఈ నేపథ్యంలో ఓవల్ మైదానంలో నేటి నుంచి జరిగే నాలుగో టెస్టు కోసం ఇరు జట్లు సన్నద్ధమయ్యాయి. లీడ్స్ టెస్టులో గెలుపుతో ఇంగ్లండ్‌లో ఆత్మవిశ్వాసం పెరగ్గా... గత మ్యాచ్ ఫలితాన్ని మరచి కొత్త ఆరంభంపై భారత్ దృష్టి పెట్టింది. అశ్విన్ ఆడతాడా! భారత్ తుది జట్టుకు సంబంధించి ఒకే ఒక అంశంపై చర్చ సాగుతోంది. గత మూడు టెస్టుల్లో అవకాశం దక్కని సీనియర్ స్పిన్నర్ అశ్విన్‌ను ఓవల్‌లో ఆడిస్తారా చూడాలి. కోహ్లి మాటల ప్రకారం చూస్తే నలుగురు పేసర్లలో ఎవరికైనా విశ్రాంతి ఖాయం. ఫామ్‌ను చూసుకుంటే ఇషాంత్ శర్మనే పక్కన పెట్టే అవకాశం ఉంది. అతని స్థానంలోనే అశ్విన్ రావాలి. ఓవల్ పిచ్ స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉండటం, ఇదే మైదానంలో కొద్ది రోజుల క్రితం కౌంటీ మ్యాచ్ ఆడిన అశ్విన్ 7 వికెట్ల తో చెలరేగడం అతని అవకాశాలను పెంచుతోంది. అయితే టీమ్ మేనేజ్మెంట్ నలుగురు పేసర్లను ఆడించడంపై ఆసక్తి చూపిస్తే మాత్రం బ్యాటింగ్ కూడా చేయగల శార్దుల్‌కు చోటు ఖాయం. బౌలర్‌గా పెద్దగా ప్రభావం చూపకపోయినా, జడేజా బ్యాటింగ్ నైపుణ్యం కారణంగా అతడిని తప్పించి అశ్విన్‌ను తీసుకునే అవకాశాలు తక్కువ. ఆంధ్ర ఆటగాడు విహారికి స్థానంపై కూడా ఆసక్తి నెలకొంది. ఆరో బ్యాట్స్‌మన్ తనకు అవసరం లేదని కోహ్లి పదే పదే చెబుతుండటంతో విహారి అవకాశాలకు దెబ్బ పడుతోంది. సిడ్నీ టెస్టు గాయం నుంచి కోలుకున్న తర్వాత స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్ మొదలు ఇప్పటి వరకు విహారి మరో మ్యాచ్ ఆడలేకపోయాడు. పుజారా మళ్లీ ఫామ్‌లోకి రాగా, కోహ్లి కూడా లయ అందుకున్నాడు. లార్డ్స్‌లో అర్ధ సెంచరీ మినహా మిగతా సిరీస్‌లో విఫలమైనా... వైస్ కెప్టెన్ రహానేను తప్పించే సాహసం చేయకపోవచ్చు. 2018 పర్యటనలో ఓవల్ టెస్టుతోనే తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న పంత్ ఇప్పుడైనా రాణించాల్సి ఉంది. ఓపెనర్లు రోహిత్, రాహుల్ శుభారంభం ఇస్తుండటం భారత్‌కు సానుకూలాంశం. వోక్స్‌కు అవకాశం... సొంతగడ్డపై సిరీస్ గెలుచుకునే అవకాశాన్ని చేజార్చుకోరాదని ఇంగ్లండ్ పట్టుదలగా ఉంది. కెప్టెన్ రూట్ సెంచరీల మీద సెంచరీలు కొడుతూ భీకర ఫామ్‌లో ఉండి జట్టును నడిపిస్తున్నాడు. రూట్‌ను నిలువరించడంపైనే భారత్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. గత టెస్టులో చాలా కాలం తర్వాత ఇంగ్లండ్‌కు బర్న్స్, హమీద్ రూపంలో ఓపెనింగ్ కలిసి రావడంతో పాటు పునరాగమనంలో మలాన్ కూడా మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. దాంతో ఇంగ్లండ్ బ్యాటింగ్ పటిష్టంగా మారింది. వ్యక్తిగత కారణాలతో బట్లర్ ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో అతని స్థానంలో బెయిర్‌స్టో కీపింగ్ చేయనుండగా... ఒలీ పోప్ బ్యాట్స్‌మన్ స్థానాన్ని భర్తీ చేస్తాడు. స్పిన్ ఆల్‌రౌండర్‌గా మొయిన్ అలీ కీలకం కానున్నాడు. ముగ్గురు పేసర్లు జోరులో ఉండగా ఒక కీలక మార్పు ఖాయమైంది. వరుసగా విఫలమవుతున్న ఆల్‌రౌండర్ స్యామ్ కరన్ స్థానంలో మరో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ బరిలోకి దిగుతాడు. కరన్‌తో పోలిస్తే వోక్స్ బౌలింగ్‌లో పదును ఎక్కువగా ఉండటంతో ఇంగ్లండ్ పేస్ దళం మరింత పటిష్టంగా మారింది. తుది జట్లు అంచనా భారత్: కోహ్లి (కెప్టెన్), రాహుల్, రోహిత్, పుజారా, రహానే, పంత్, జడేజా, శార్దుల్/అశ్విన్, బుమ్రా, సిరాజ్, షమీ/ఉమేశ్. ఇంగ్లండ్: రూట్ (కెప్టెన్), బర్న్స్, హమీద్, మలాన్, పోప్, బెయిర్‌స్టో, అలీ, వోక్స్, ఒవర్టన్, రాబిన్సన్, అండర్సన్. పిచ్, వాతావరణం భారత్ తరహాలో బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్. ఆపై స్పిన్‌కు సహకరిస్తుంది. వాతావరణం పొడిగా, వేడిగా ఉండనుంది. వర్షసూచన లేదు. 1971లో ఇంగ్లండ్‌పై తొలి టెస్టు విజయం తర్వాత భారత్ ఇప్పటి వరకు ఓవల్‌లో మళ్లీ గెలవలేదు. 3 మ్యాచ్‌లు ఓడిన జట్టు మరో 5 ‘డ్రా’ చేసుకుంది. -
మాల్యాకు ఊహించని పరిణామం..ఎవరితో వచ్చాడు?
లండన్ : ప్రభుత్వ బ్యాంకులకు వేలకోట్లు ఎగవేసి విదేశాలకు చెక్కేసిన ఫ్యుజిటివ్ నేరగాడు విజయ్ మాల్యాకు ఊహించని పరిణామం ఎదురైంది. ఐసీసీ వరల్డ్ కప్ 2019లో భాగంగా ఆదివారం ఓవల్ మైదానంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య క్రికెట్ మ్యాచ్‌ను చూడ్డానికి వచ్చిన మాల్యాకు ఒక్కసారిగా షాక్తగిలింది. అక్కడున్నజనం చోర్..చోర్ (దొంగ..దొంగ) అని అరవడం మొదలుపెట్టారు. దేశానికి క్షమాపణ చెప్పు అంటూ నినాదాలు కూడా వినిపించాయి. వారికి ఏదో సమాధానం ఇచ్చినప్పటి కంగుతినడం మాత్రం మాల్యా వంతైంది. క్రికెట్ మ్యాచ్‌లను తరచుగా వీక్షించే మాల్యాకు అంతకుముందెప్పుడూ ఇలాంటి చేదు అనుభవం ఎదురు కాలేదు. ఈ పరిణామంపై విలేకరులు ప్రశ్నించినపుడు తాను మ్యాచ్ చూడ్డానికి వచ్చానని, జూలైలో జరగనున్న తదుపరి విచారణకు సంబంధించిన ప్రయత్నాల్లో ఉన్నానని చెప్పారు. అలాగే తన తల్లి (దేశం) బాధపడకుండా చూడాలనేది తన ప్రయత్నం అని చెప్పి వెళ్లిపోయాడు. మరోవైపు ఇంగ్లండ్‌లో జరుగుతున్న ప్రపంచకప్ మ్యాచ్‌లను చూస్తూ ఎంజాయ్ చేస్తున్న మాల్యా భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్‌కు కుమారుడు సిద్ధార్థ్ మాల్యాతో కలిసి వచ్చాడు. ఆస్ట్రేలియాపై ఇండియా విజయం సాధించిన మ్యాచ్‌ను తన కొడుకుతో కలిసి చూడటం సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత టీమ్‌కు అభినందనలు తెలిపాడు. Great to watch cricket with my son and even sweeter to see India’s emphatic victory over Australia. Congratulations to @imVkohli and his team pic.twitter.com/R01aB1WbSA — Vijay Mallya (@TheVijayMallya) June 9, 2019 కాగా రూ. 9వేల కోట్లకు పైగా బకాయిపడి లండన్‌కు పారిపోయిన లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యాని తిరిగి భారత్‌కు రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అటు మాల్యాను అప్పగించేందుకు యూకే హోమ్ ఆఫీస్, వెస్ట్‌మినిస్టర్ కోర్ట్ ఒప్పుకున్నాయి. అయితే తాను అప్పులు తీర్చేందుకు సిద్ధంగా ఉన్నానని, ప్రభుత్వమే ఒప్పుకోవట్లేదని విజయ్ మాల్యా వాదిస్తున్నాడు. జులై 2వ తేదీన దీనికి సంబంధించిన తీర్పు వెలువడనుంది. #WATCH London, England: Vijay Mallya says, "I am making sure my mother doesn't get hurt", as crowd shouts "Chor hai" while he leaves from the Oval after the match between India and Australia. pic.twitter.com/ft1nTm5m0i — ANI (@ANI) June 9, 2019 -
చోర్..చోర్ కామెంట్లపై మాల్యా స్పందన
ప్రజల సొమ్ముని ఎగ్గొట్టి దర్జాగా యూకేలో బతుకుతున్న విజయ్ మాల్యాకు ఇటీవల ఓవెల్ క్రికెట్ మైదానంలో ఎదురైన తీవ్ర పరాభవం తెలిసిందే. క్రికెట్ స్టేడియంలోకి అడుగుపెట్టిన మాల్యాను చూసి అక్కడున్న వారందరూ చోర్.. చోర్(దొంగ.. దొంగ) అంటూ ఆయనను చుట్టుముట్టి గేళి చేశారు. ఊహించని పరిణామంలో షాక్ తిన్న మాల్యా, ఈ పరిణామంపై నేడు లండన్ కోర్టుకు హాజరయ్యే ముందు స్పందించారు. ఓవెల్ మైదానంలో తనను ఎవరూ దొంగా అని అనలేదని చెప్పుకొచ్చారు. తప్పతాగి ఉన్న ఇద్దరు వ్యక్తులు మాత్రమే తనపై అరిచారని, మిగతావారందరూ తన వద్దకు వచ్చి మంచి జరగాలని కోరుకున్నట్టు పేర్కొన్నారు. క్రికెట్ అభిమానులు స్టేడియం వద్ద తనను అవమానించారనే మీడియా వార్తలను మాల్యా కొట్టిపారేశారు. అయితే విజయ్ మాల్యా ఈ విషయం చెప్పగానే, ఆయనపై అరిచిన ఆ ఇద్దర్ని ట్విట్టరియన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఆ ఇద్దరికి సెల్యూట్ చేయాలని ట్వీట్లు చేశారు. బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టిన మాల్యా యూకేలో దర్జాగా బతుకుతున్నారు. నేడు లండన్ లోని వెస్ట్ మినిస్టర్ కోర్టులో మాల్యాను భారత్ కు అప్పగించే కేసు విచారణ జరిగింది. ఈ విచారణ ప్రారంభమైన కొద్దిసేపటికే జూలై 6కు వాయిదా పడింది. మాల్యాకు మంజూరు చేసిన బెయిల్ ను కూడా కోర్టు మరో ఆరునెలలు(డిసెంబర్ దాకా) వరకు పొడిగించింది. కోర్టుకు హాజరయ్యే ముందు మాల్యా తను నిర్దోషినని, ఎలాంటి మోసాలకు పాల్పడలేదని చెప్పారు. I was not called a thief that day by crowd at Oval ground.Two drunk ppl were shouting but several others came&wished me well:Vijay Mallya pic.twitter.com/m5DHSF2HHK — ANI (@ANI_news) June 13, 2017


