
ఇంగ్లండ్‌తో సిరీస్‌లో చిరస్మరణీయ ప్రదర్శన
టీమిండియా విజయాల్లో కీలకపాత్ర
బుమ్రా నీడను వీడిన హైదరాబాద్ పేసర్
సిరీస్‌లో ఐదు టెస్టులూ చివరి వరకు ఆడిన ఏకైక పేస్ బౌలర్. ఏకంగా 1113 బంతులు... సిరీస్ తొలిరోజు నుంచి చివరిరోజు వరకు బౌలింగ్‌లో అదే వేగం, అంతే తీవ్రత... ప్రతీ బంతి వేసే సమయంలో 100 శాతం ఇవ్వాలనే తపన... చేసే పని భారంగా అనిపించలేదు... సుదీర్ఘ సిరీస్‌లో విశ్రాంతి తీసుకోలేదు. గాయంతో తప్పుకోలేదు, మ్యాచ్ మధ్యలో ఫిట్‌నెస్ సమస్యలతో ఒక్కసారి కూడా బౌలింగ్‌కు దూరం కాలేదు... చివరకు అద్భుత రీతిలో మ్యాచ్‌ను గెలిపించే వరకు ఆగిపోలేదు... ఇలాంటి పోరాటతత్వం, పట్టుదల హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్‌కే సాధ్యమైంది.
185.3 ఓవర్ల బౌలింగ్ తర్వాత కూడా అతను అలసిపోకుండా ఇప్పుడు మళ్లీ బౌలింగ్ చేసేందుకు సిద్ధంగా ఉండి ‘సై’ అంటున్నాడు. ఈ సిరీస్‌లో అతని ప్రదర్శనను ప్రశంసించనివారు లేరు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు అథర్టన్, మైకేల్ వాన్, నాసిర్ హుస్సేన్ మాటల్లో చెప్పాలంటే సిరాజ్ సింహంలా పోరాడిన ఒక ‘లయన్ హార్ట్’ బౌలర్. అసలు అతను సిరీస్ ఆసాంతం ఒకే తరహాలో అంతే దూకుడుతో ఎలా బౌలింగ్ చేస్తున్నాడో వారికి కూడా ఆశ్చర్యపర్చింది. ‘దేశం తరఫున ఆడటం అనేదే ఒక ఆటగాడికి లభించే ఎంతో గొప్ప అవకాశం. అలాంటప్పుడు నేను ఎన్ని ఓవర్లు వేశాను, ఎంత ఎక్కువగా కష్టపడుతున్నాను అన్నది అస్సలు పట్టించుకోవాల్సిన విషయమే కాదు. నాలో సత్తా ఉన్నంత వరకు బౌలింగ్ చేస్తూనే ఉంటాను. అదృష్టవశాత్తూ ఇప్పుడు కూడా నేను ఫిట్‌గా ఉన్నాను’... చివరి టెస్టు ముగిసిన తర్వాత భారత పేసర్ మొహమ్మద్ సిరాజ్ వ్యాఖ్య ఇది.
ముందుండి నడిపిస్తూ...
టాప్ పేసర్ బుమ్రా మూడు టెస్టులే ఆడతాడని ఖాయమయ్యాక సహజంగానే సీనియర్ అయిన సిరాజ్‌పై ఎక్కువ బాధ్యత నిలిచింది. దానిని అతను సమర్థంగా నిర్వర్తించాడు. జట్టుకు అవసరమైన ప్రతీ సందర్భంలోనూ సిరాజ్ నేనున్నానంటూ ముందుకు వచ్చాడు. కొత్త బంతి ఇస్తే దానిని సమర్థంగా ఉపయోగించాడు. కాస్త పాతబడిన బంతిని అప్పగిస్తే డ్యూక్ బంతులను వాడుకుంటూ స్వింగ్‌లో చెలరేగడం అతనికే చెల్లింది. కెప్టెన్ గిల్ అయితే ఇక చాలు బౌలింగ్ చేయలేడు అనిపించిన సమయాల్లో కూడా మళ్లీ సిరాజ్‌కే బంతిని అప్పగించాడు. కాస్త ఘాటుగా చెప్పాలంటే చెరకు మిషన్‌లో చెరకు గడను చివరి వరకు వాడుతూ పిప్పి చేసినట్లుగా సిరాజ్‌ను గిల్ ఉపయోగించుకున్నాడు.
అయినా సరే ఎక్కడా తగ్గకుండా కీలక సమయాల్లో కీలక వికెట్లతో భారత్ మ్యాచ్‌లో పైచేయి సాధించేలా చేశాడు. బుమ్రా ఆడని రెండు టెస్టుల్లో భారత్ గెలిచింది. ఎడ్జ్‌బాస్టన్‌లో 7 వికెట్లు తీసిన సిరాజ్, ఓవల్‌లో 9 వికెట్లు పడగొట్టాడు. సిరీస్‌లో అతను రెండుసార్లు ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. రెండో టెస్టులో వరుస బంతుల్లో రూట్, స్టోక్స్‌లను అవుట్ చేయడం, క్రాలీని డకౌట్ చేయడం కీలక మలుపులు కాగా... ఓవల్ తొలి ఇన్నింగ్స్‌లో అతను తీసిన పోప్, రూట్, బ్రూక్ వికెట్లతోనే తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌కు భారీ ఆధిక్యం దక్కలేదు. మూడో రోజు క్రాలీని బౌల్డ్ చేసిన బంతిని ఎవరూ మర్చిపోలేరు. చివరి రోజు బౌలింగ్ గురించైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
నిలకడగా సత్తా చాటుతూ...
మాంచెస్టర్ టెస్టులో 30 ఓవర్లలో 140 పరుగులు ఇచ్చి ఒకటే వికెట్ తీసినప్పుడు సిరాజ్ బౌలింగ్‌లో పదును తగ్గినట్లు అనిపించింది. అయితే తర్వాతి మ్యాచ్‌తోనే అతను తనపై వచ్చిన సందేహాలను పటాపంచలు చేశాడు. చాలా సందర్భాల్లో బుమ్రా నీడలో ఉన్నట్లుగా కనిపించిన సిరాజ్ అవకాశం దక్కిన ప్రతీసారి తానేంటో చూపిస్తున్నాడు. బుమ్రాతో కలిసి ఆడిన టెస్టుల్లోకంటే అతను లేని టెస్టుల్లో చెలరేగిపోతున్నాడు. ఏడాదిన్నర క్రితం కేప్‌టౌన్ టెస్టులో దక్షిణాఫ్రికాపై 15 పరుగులే ఇచ్చి 6 వికెట్లు తీసినప్పుడే టెస్టు బౌలర్‌గా సిరాజ్ స్థాయి ఎంతో పెరిగింది.
ఆ్రస్టేలియాతో సిరీస్‌లోనూ 20 వికెట్లు పడగొట్టినా... బుమ్రా అసాధారణ 32 వికెట్ల బౌలింగ్‌తో పాటు భారత్ సిరీస్ ఓడటంతో అతని ప్రదర్శనకు గుర్తింపు రాలేదు. కానీ ఇప్పుడు ఓడిపోతుందనుకున్న సిరీస్‌ను సమం చేయడంలో సిరాజ్ పోషించిన పాత్ర అతడిని మరో మెట్టు పైకి ఎక్కించింది. చివరగా... నాలుగో రోజు హ్యారీ బ్రూక్ క్యాచ్ వదిలేయడంతో సిరాజ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అతని అద్భుత బౌలింగ్‌నూ పట్టించుకోకుండా కొందరు వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యాచ్ ఓడి ఉంటే అది అతడిని ఎప్పటికీ వెంటాడేది. కానీ ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్న ఈ బౌలర్ అలాంటి అవకాశం ఇవ్వకుండా ఒంటిచేత్తో మ్యాచ్‌ను ముగించాడు. భారత్‌ను గెలిపించాడు. తానూ గెలిచాడు.
ప్రశంసల వెల్లువ
టెస్టు క్రికెట్‌కు వన్నెతెచి్చన సిరీస్ ఇది. ఆఖరి మ్యాచ్ అయితే అద్భుతం. నిజంగా రోమాలు నిక్క»ొడుచుకునేలా చేసింది. సిరీస్ ఫలితం 2–2 అయి వుండొచ్చు. కానీ... ప్రదర్శనతో 10కి 10 మార్కులు తెచ్చుకున్నారు. టీమిండియన్స్ అంతా సూపర్‌గా ఆడారు.
–భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్
భారత జట్టు అద్భుత విజయం సాధించింది. సిరాజ్, ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో కనబరిచిన నిబద్ధత, అంకితభావానికి హ్యాట్సాఫ్. సిరాజ్‌కు నా ప్రత్యేక అభినందనలు. జట్టు కోసం ఏదైనా చేసేందుకు ముందువరుసలో సిద్ధంగా ఉంటాడు.
–విరాట్ కోహ్లి
సంప్రదాయ క్రికెట్‌కు ఉన్న మ్యాజిక్‌ను ఆవిష్కరించిన మ్యాచ్ ఇది. ఓవల్ క్రికెట్ చరిత్రలోనే నిలిచిపోయే మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చింది. అసాధారణ ఆటతీరుతో టెస్టు ఇమేజ్ పెంచిన భారత్, ఇంగ్లండ్ జట్ల సభ్యులకు నా ప్రత్యేక ప్రశంసలు.
–ఐసీసీ చైర్మన్ జై షా
అసాధారణ సిరీస్. అమోఘమైన ఫలితం. జడేజా, వాషింగ్టన్ సుందర్, రిషభ్ పంత్, సిరాజ్... అందరూ నిలకడగా ఆడారు. భారత జట్టు విజయాల ఆకలితో ఉన్నట్లు మనవాళ్లు తమ ఆటతీరుతో నిరూపించారు.
–మాజీ కెప్టెన్ గంగూలీ
సాక్షి క్రీడా విభాగం