PC: BCCI/X
న్యూజిలాండ్ 'ఎ' జట్టుతో జరగబోయే మూడు అనధికారిక టెస్టుల సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన ఇండియా 'ఎ' జట్టును బీసీసీఐ (BCCI) ప్రకటించింది. ఈ జట్టుకు వికెట్ కీపర్-బ్యాటర్ ధ్రువ్ జురెల్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ వంటి కీలక ఆటగాళ్లు జట్టులో ఉన్నప్పటికీ, అన్ని ఫార్మాట్లలోనూ భవిష్యత్ నాయకులను తీర్చిదిద్దాలనే ఆలోచనతో సెలెక్టర్లు జురెల్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించారు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ధ్రువ్ జురెల్‌కు కెప్టెన్సీలో మంచి అనుభవం ఉంది. గతంలో భారత అండర్-19 జట్టుతో పాటు ఇండియా 'ఎ' జట్టును ఆయన విజయవంతంగా నడిపించాడు. అంతేకాకుండా 2025-26 దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు కూడా సారథ్యం వహించాడు.
సీనియర్లకు చోటు ఎందుకంటే?
సాధారణంగా 'ఎ' టూర్లలో యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇస్తుంటారు. కానీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగే రాబోయే టెస్టు సిరీస్‌ను దృష్టిలో ఉంచుకుని సీనియర్లను ఈ జట్టులోకి తీసుకున్నారు. న్యూజిలాండ్‌లోని సీమింగ్, బౌన్సీ పిచ్‌ల పరిస్థితులకు అలవాటు పడటానికి ఈ సిరీస్ భారత బ్యాటర్లకు మంచి అవకాశంగా ఉపయోగపడుతుందని టీమ్ మేనెజ్‌మెంట్ భావిస్తోంది.
ఈ అనధికారిక సిరీస్‌లో యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, రిషభ్ పంత్ వంటి రెగ్యులర్ టెస్టు ఆటగాళ్లతో పాటు రవిచంద్రన్ స్మరణ్, యశ్ రాథోడ్ వంటి అన్‌క్యాప్డ్ ప్లేయర్లకు కూడా చోటు దక్కింది. ఈ పర్యటన అక్టోబర్ 24 నుంచి ప్రారంభం కానుంది. ఆ తర్వాత నవంబర్ 19 నుంచి భారత్-న్యూజిలాండ్ సీనియర్ జట్ల మధ్య రెండు టెస్టుల ప్రధాన సిరీస్ మొదలవుతుంది.
ఇండియా ‘ఎ’ జట్టు వివరాలు: ధ్రువ్ జురెల్ (కెప్టెన్ / వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, రవిచంద్రన్ స్మరణ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్ - ఫిట్‌నెస్‌కు లోబడి), వాషింగ్టన్ సుందర్, ఆకిబ్ నబీ, ఆకాశ్ దీప్, అన్షుల్ కంబోజ్, మానవ్ సుతార్, ముకేశ్ చౌదరి, సాయి సుదర్శన్, యశ్ రాథోడ్, ముకేశ్ కుమార్.
చదవండి: హర్మన్, మంధాన మధ్య విభేదాలు!


