ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య యాషెస్ సమరానికి సమయం అసన్నమైంది. ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు పెర్త్ వేదికగా శుక్రవారం(నవంబర్ 21) నుంచి మొదలు కానుంది. ఈ క్రమంలో తొలి టెస్టు కోసం క్రికెట్ ఆస్ట్రేలియా తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది.
తొలి టెస్టుకు గాయాల కారణంగా హాజిల్ వుడ్, కమ్మిన్స్ వంటి కీలక ప్లేయర్లు దూరం కావడంతో ఇద్దరు కొత్త ఆటగాళ్లకు ఆసీస్ తరపున అరంగేట్రం చేసే అవకాశం లభించింది. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసి అనుహ్యంగా యాషెస్ సిరీస్‌కు ఎంపికైన ఓపెనర్ జేక్ వెదరాల్డ్.. తొలిసారి 'బ్యాగీ గ్రీన్' క్యాప్(ఆసీస్ టెస్టు క్యాప్) అందుకునేందుకు సిద్దమయ్యాడు.
అతడితో పాటు పేసర్ బ్రెండన్ డాగెట్ కూడా ఆసీస్ తరపున డెబ్యూ చేయనున్నాడు. ఈ రైట్-ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్‌తో కలిసి బంతిని పంచుకోనున్నాడు. అదేవిధంగా గాయం నుంచి కోలుకున్న ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు. గ్రీన్ రాకతో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఆల్‌రౌండర్ బ్యూ వెబ్‌స్టర్‌కు నిరాశ ఎదురైంది.
షెఫీల్డ్ టోర్నీలో దుమ్ములేపిన సీనియర్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ మూడో స్ధానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. గత సిరీస్‌లో లబుషేన్.. ఉస్మాన్ ఖావాజాతో కలిసి ఆసీస్ ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. ఇప్పుడు వెదరాల్డ్ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. ఇక రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ గైర్హజరీలో సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఆసీస్ జట్టును నడిపించనున్నాడు.
తొలి టెస్టు కోసం ఆసీస్ తుది జట్టు: ఉస్మాన్ ఖవాజా, జేక్ వెదరాల్డ్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, బ్రెండన్ డాగెట్, స్కాట్ బోలాండ్
చదవండి: IND vs SA: టీమిండియా కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్?


