
వారియర్స్ చేతిలో ఓటమి
యూపీ యోధాస్‌పై గుజరాత్ జెయింట్స్ గెలుపు
చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్‌లో అప్రతిహత విజయాలతో దూసుకెళ్తున్న దబంగ్ ఢిల్లీకి రెండో పరాజయం ఎదురైంది. లీగ్‌లో భాగంగా గురువారం జరిగిన పోరులో దబంగ్ ఢిల్లీ 36–37 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్ చేతిలో ఓడింది. దబంగ్ ఢిల్లీ తరఫున నీరజ్ నర్వాల్ 6, అజింక్యా పవార్ 5 పాయింట్లు సాధించారు. బెంగాల్ వారియర్స్ కెప్టెన్ దేవాంక్ దలాల్ 12 పాయింట్లతో విజృంభించాడు.
ప్రత్యర్థితో సంబంధం లేకుండా దూసుకెళ్తున్న దబంగ్ ఢిల్లీ జోరుకు బెంగాల్ వారియర్స్ బ్రేక్ వేసింది. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో ఢిల్లీ 23 రెయిడ్ పాయింట్లు సాధించగా... బెంగాల్ వారియర్స్ 20 రెయిడ్ పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ట్యాక్లింగ్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన వారియర్స్ 13 పాయింట్లు సాధిస్తే... ఢిల్లీ 9 పాయింట్లకే పరిమితమైంది.
తాజా సీజన్‌లో 13 మ్యాచ్‌లాడిన ఢిల్లీ 11 విజయాలు, 2 పరాజయాలతో 22 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక ‘టాప్’లో కొనసాగుతోంది. బెంగాల్ వారియర్స్ 11 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 7 పరాజయాలతో 8 పాయింట్లు సాధించి పదో స్థానంలో కొనసాగుతోంది. ఉత్కంఠభరితంగా సాగిన మరో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 41–39 పాయింట్ల తేడాతో యూపీ యోధాస్‌పై నెగ్గింది.