Photo Credit: Twitter
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ముగించుకున్న టీమిండియా రేపటి నుంచి టీ20 సిరీస్‌కు సమాయత్తమవుతోంది. విండీస్‌తో సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా నేరుగా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. సుదీర్ఘ పర్యటనలో భారత జట్టు న్యూజిలాండ్‌తో ఐదు టీ20లు, ఐదు వన్డేలతో పాటు రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది.
ఇదే సమయంలో భారత-ఎ జట్టు కూడా అక్టోబర్ 24 నుంచి నవంబర్ 10 వరకు న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో మూడు అనధికారిక టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు జట్టులో ముఖ్య సభ్యులుగా ఉన్న జస్‌ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌లు కీలక నిర్ణయం తీసుకున్నారు.
టెస్టు సిరీస్‌కు ముందు ఈ ముగ్గురు భారత-ఎ జట్టు తరఫున ఒక అనధికారిక టెస్టులో ఆడాలని నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది నవంబర్‌లో సౌతాఫ్రికాతో చివరిసారి టెస్టు ఆడిన బుమ్రా మళ్లీ ఎర్రరంగు ఫార్మాట్‌లో కనిపించలేదు. దీంతో ఏడాది తర్వాత న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ఆడనున్న నేపథ్యంలో ప్రాక్టీస్ కోసం భారత-ఎ జట్టు తరఫున బుమ్రా ఒక అనధికారిక టెస్టులో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.
ఇక టెస్టుల్లో మాత్రమే కొనసాగుతున్న పంత్ రెగ్యులర్ కీపర్‌గా ఉన్నాడు. ఇరానీ కప్ విజేతగా నిలిచిన రెస్టాఫ్ ఇండియాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. వీరితో పాటు పడిక్కల్, సాయి సుదర్శన్‌లు కూడా అనధికారిక టెస్టు సిరీస్‌లో ఆడే అవకాశాలున్నాయి. ఇటీవలే పాండిచ్చేరి వేదికగా ఆస్ట్రేలియా-ఎతో జరిగిన అనధికారిక టెస్టు సిరీస్‌లోనూ పడిక్కల్, సాయి సుదర్శన్ ఆడారు.
ఇక పరిమిత ఓవర్ల ఆటలో మాత్రమే కొనసాగుతున్న ఇషాన్ కిషన్‌ను న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో జూలై 2023లో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ ఆడిన ఇషాన్ మళ్లీ టెస్టు మ్యాచ్‌లు ఆడలేదు. అయితే ఇదే సమయంలో పంత్‌కు బ్యాకప్‌గా ధ్రువ్ జురేల్ కూడా స్థిరమైన ప్రదర్శన కనబరిచి రెండో వికెట్ కీపర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.
ఇటీవలే లంకతో టెస్టు సిరీస్‌లోనూ ధ్రువ్ జురెల్ మంచి ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. ప్రసిధ్ క్రిష్ణ ఫిట్‌నెస్‌పై స్పష్టత లేకపోవడంతో న్యూజిలాండ్ టూర్‌కు భారత జట్టు ప్రకటన ఆలస్యమైంది. వచ్చే వారంలోపు టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌లతో పాటు ఎ జట్టును కూడా బీసీసీఐ ఒకేసారి ప్రకటించనుంది.
ఇదీ చదవండి: ఢిల్లీ జట్టు ప్రకటన.. సెహ్వాగ్ కుమారుడికి పగ్గాలు


