
సౌతాఫ్రికాతో రెండో టీ20లో ఆస్ట్రేలియా (AUS vs SA 2nd T20I) ఓటమి పాలైంది. పర్యాటక జట్టు చేతిలో 53 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. సొంతగడ్డపై టీ20 ఫార్మాట్లో ఆసీస్‌కు పరుగుల పరంగా ఇది రెండో అతిపెద్ద పరాజయం కావడం గమనార్హం. సౌతాఫ్రికా యువ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ (Dewald Brevis) విధ్వంసకర సెంచరీ, బౌలర్ల సమిష్టి కృషి కారణంగా కంగారూలు స్వదేశంలో ఈ మేర ఘోర పరాభవం ఎదుర్కొన్నారు.
కాగా ఆస్ట్రేలియా సొంతగడ్డపై సౌతాఫ్రికాతో మూడు టీ20, మూడు వన్డేలు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇందులో భాగంగా తొలుత పొట్టి సిరీస్ మొదలుకాగా.. ఆసీస్ 17 పరుగుల తేడాతో మొదటి టీ20 గెలిచింది. ఈ క్రమంలో మంగళవారం ఆసీస్- ప్రొటిస్ మధ్య డార్విన్ వేదికగా రెండో టీ20 జరిగింది.
41 బంతుల్లోనే శతకం
మరారా క్రికెట్ గ్రౌండ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. టాపార్డర్‌లో కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ (18), రియాన్ రికెల్టన్ (14).. లువాన్-డ్రి ప్రిటోరియస్ (10) విఫలమైనా.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ డెవాల్డ్ బ్రెవిస్ సునామీ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు.
కేవలం 41 బంతుల్లోనే శతకం సాధించిన ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్.. మొత్తంగా 56 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 125 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిగిలిన వారిలో ట్రిస్టన్ స్టబ్స్ (22 బంతుల్లో 31) మాత్రమే రాణించాడు.
ట్రవిస్ హెడ్ ఫెయిల్..
ఆస్ట్రేలియా బౌలర్లలో గ్లెన్ మాక్స్‌వెల్, బెన్ డ్వార్షుయిస్ తలా రెండు వికెట్లు దక్కించుకోగా.. జోష్ హాజిల్‌వుడ్, ఆడం జంపా ఒక్కో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.
విధ్వంసకర వీరుడిగా పేరొందిన ఓపెనర్ ట్రవిస్ హెడ్ (5).. వన్‌డౌన్ బ్యాటర్ కామెరాన్ గ్రీన్ (9) ఇలా వచ్చి అలా వెళ్లగా.. మరో ఓపెనర్, కెప్టెన్ మిచెల్ మార్ష్ (13 బంతుల్లో 22) ఫర్వాలేదనిపించాడు.
టిమ్ డేవిడ్ మెరుపులు వృథా
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో టిమ్ డేవిడ్ మరోసారి తన బ్యాట్ పదును చూపించాడు. కేవలం 24 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది 50 పరుగులు సాధించాడు. అయితే, అర్ధ శతకం పూర్తి చేసుకున్న వెంటనే టిమ్ డేవిడ్ కగిసో రబాడ బౌలింగ్‌లో వాన్ డర్ డసన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
టిమ్ డేవిడ్ అవుటైన తర్వాత ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ వేగంగా పతనమైంది. గ్లెన్ మాక్స్‌వెల్ (16), మిచెల్ ఓవెన్ (8) పూర్తిగా విఫలమయ్యారు. వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీ (18 బంతుల్లో 26) కాసేపు పోరాడగా.. మిగతా వారి నుంచి అతడికి సహకారం లభించలేదు.
చెలరేగిన మఫాకా, బాష్
ఈ క్రమంలో సౌతాఫ్రికా బౌలర్ల విజృంభణ నేపథ్యంలో ఆసీస్ 17.4 ఓవర్లలో 165 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా 53 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.
ఇక.. ప్రొటిస్ బౌలర్లలో క్వెనా మఫాకా, కార్బిన్ బాష్ మూడేసి వికెట్లతో చెలరేగగా.. కగిసో రబాడ, మార్క్రమ్, లుంగి ఎంగిడి, పీటర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. కాగా రెండో టీ20లో విజయంతో సౌతాఫ్రికా సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇరుజట్ల మధ్య సిరీస్ విజేతను తేల్చే శనివారం (ఆగష్టు 16) నాటి మూడో మ్యాచ్‌కు కైర్న్స్ వేదిక.
చదవండి: AUS vs SA: చరిత్ర సృష్టించిన బ్రెవిస్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా రికార్డు