
ఇంగ్లండ్ జట్టుపై టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) విమర్శల వర్షం కురిపించాడు. వికెట్లు తీసే బౌలర్లు జట్టులో లేనందునే.. ఓవల్‌లో ‘గ్రీన్ పిచ్’ తయారు చేయించుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బెన్ స్టోక్స్ (Ben Stokes), జోఫ్రా ఆర్చర్ ఐదో టెస్టుకు దూరంగా ఉన్నందున ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని విమర్శించాడు.
ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy)లో భాగంగా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా అక్కడకు వెళ్లింది. ఈ సిరీస్‌లో ఇప్పటికి నాలుగు టెస్టులు పూర్తికాగా.. ఆతిథ్య ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. లండన్‌లోని ఓవల్ మైదానంలో ఆఖరిదైన ఐదో టెస్టు గెలిస్తేనే భారత్ సిరీస్‌ను కనీసం సమం చేయగలుగుతుంది.
స్టోక్స్, ఆర్చర్ అవుట్
అయితే, ఈ కీలక మ్యాచ్‌కు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ గాయపడ్డాడు. భుజం నొప్పి కారణంగా అతడు దూరమయ్యాడు. అతడి స్థానంలో జేమీ ఓవర్టర్ జట్టులోకి రాగా.. జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్, లియామ్ డాసన్ స్థానాల్లో జేకబ్ బెతెల్, గస్ అట్కిన్సన్, జోష్ టంగ్‌లు చోటు దక్కించుకున్నారు.
వికెట్లు తీసే బౌలర్లు లేరు.. అందుకే
ఈ నేపథ్యంలో.. ఓవల్ పిచ్ పచ్చికతో నిండిపోయి ఉండటాన్ని ప్రస్తావిస్తూ సునిల్ గావస్కర్ ఇంగ్లండ్ జట్టుపై సెటైర్లు వేశాడు. ‘‘వారి జట్టులో సరైన బౌలర్లే లేరు. అందుకే ఇలాంటి పిచ్ తయారు చేయించారు.
స్టోక్స్, ఆర్చర్ గత మ్యాచ్‌లలో వికెట్లు తీసి సత్తా చాటారు. బ్రైడన్ కార్స్ కూడా తన వంతు సహకారం అందించాడు. కానీ ఇప్పుడు వాళ్లంతా లేరు. జట్టులో వికెట్లు తీసే బౌలర్లు లేనపుడు వాళ్లు ఇలాంటి పిచ్‌కాక మరో పిచ్ ఎలా తయారు చేయగలరు? జోష్ టంగ్.. అతడి సహచరులు ఇలాంటి వికెట్ మీద మాత్రమే రాణించగలరు’’ అంటూ గావస్కర్ విమర్శలు గుప్పించాడు.
ఇదిలా ఉంటే.. గురువారం మొదలైన ఓవల్ టెస్టులో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. భోజన విరామ సమయానికి 23 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (2), కేఎల్ రాహుల్ (14) విఫలం కాగా.. సాయి సుదర్శన్, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నంలో ఉన్నారు. వర్షం వల్ల ఆటకు పదే పదే అంతరాయం కలుగుతోంది.
టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ ఐదో టెస్టు తుదిజట్లు
టీమిండియా
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్
ఇంగ్లండ్
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్(కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జేకబ్ బెతెల్, జామీ స్మిత్(వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, జేమీ ఓవర్టన్, జోష్ టంగ్.
చదవండి: IND vs ENG: పద్నాలుగుసార్లు ఫెయిల్!.. ఇప్పటికి రిలీఫ్.. స్టోక్స్‌కు సైగ చేసి మరీ..