
ఆటగాళ్ల భద్రతకే ప్రాధాన్యం
ముందు దేశం... తర్వాతే వినోదం
బీసీసీఐ నిర్ణయం నేడు
ధర్మశాల: ఉగ్రవేటకు తలపెట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ను ఏమాత్రం జీర్ణించుకోలేని పాకిస్తాన్ మిలిటరీ కుటిలబుద్ధితో క్రూరమైన దాడులకు తెగబడుతోంది. సరిహద్దు రాష్ట్రాల పౌరులపై విచక్షణారహితంగా మోర్టార్లు, ఫిరంగులతో దాడులు చేస్తోంది. దీంతో భారత బలగాలు దీటుగా బదులిస్తున్నాయి. భారత్, పాకిస్తాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కాస్తా యుద్ధభూమిని తలపించడంతో భారత రక్షణ దళాలు కీలక నగరాల్లో విద్యుత్ సరఫరా (పవర్ బ్లాక్ అవుట్)ను నిలిపివేసింది. ఇంటర్నెట్, మొబైల్ సేవల్ని నిలిపివేసింది.
పాక్ ప్రయోగించిన మిస్సైళ్లు, డ్రోన్లను నిర్వీర్యం చేసేందుకు భారత సాయుధ బలగాలు రాత్రంతా శ్రమిస్తున్నాయి. ఇలా ప్రస్తుతం దేశం కోసం భారత త్రివిధ దళాలు ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే స్టేడియాల్లో ఐపీఎల్ వినోదం పట్ల నెట్టింట తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. భారత పౌరులు, ప్రధాన నగరాలే లక్ష్యంగా పాక్ ఆర్మీ విచక్షణా రహితంగా జరిపే దాడుల్ని తిప్పికొడుతున్నప్పటికీ... పొరపాటున ఏ మిసైల్, డ్రోన్ దాడి అయిన స్టేడియంలో పడితే... వేలల్లో ప్రేక్షకులు, పదుల సంఖ్యలోని విదేశీ, భారత క్రికెటర్లకు జరిగే ప్రాణనష్టం ఊహకందదు.
ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ను రద్దు చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉన్నతాధికారులు భావిస్తున్నారు. వినోదం కంటే కూడా దేశ రక్షణ, ఆటగాళ్ల భద్రతే తమకు ప్రధానమని బోర్డు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అందుబాటులో ఉన్న బీసీసీఐ ఉన్నతాధికారులతో నేడు సమావేశమై ఐపీఎల్‌పై తుది నిర్ణయం తీసుకుంటారు. శుక్రవారం ఐపీఎల్ రద్దు లేదంటే వాయిదా ప్రకటన వెలువడుతుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

నేటి మ్యాచ్ యథాతథం
ప్రస్తుత పరిస్థితులపై సమీక్షిస్తున్నాం. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత ఇంకా కొనసాగుతూనే ఉంది. ఐపీఎల్ మ్యాచ్‌ల విషయంలో ప్రభుత్వ మార్గదర్శకాల్ని పాటిస్తాం. ఇప్పటివరకైతే కేంద్రం నుంచి మాకెలాంటి సూచనలు రాలేదు. ఆటగాళ్ల భద్రత, రవాణా తదితర పరిస్థితుల్ని సమీక్షించాకే తుది నిర్ణయం తీసుకుంటాం. లక్నోలో శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు ఏ ఇబ్బందులు లేవు. కాబట్టి మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం జరిగే అవకాశాలే ఉన్నాయి. –ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్
ఐపీఎల్‌లో నేడు
లక్నో X బెంగళూరు
వేదిక: లక్నో
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం