బీసీసీఐ కీలక నిర్ణయం.. ఆటగాళ్లకు ‘అగ్ని పరీక్ష’! | BCCI introduces New Bronco Test for Team India, What is This Fast Bowlers To | Sakshi
Sakshi News home page

బీసీసీఐ కీలక నిర్ణయం.. ఆటగాళ్లకు ‘అగ్ని పరీక్ష’.. ఏమిటీ బ్రోంకో టెస్టు?

Aug 21 2025 11:21 AM | Updated on Aug 21 2025 12:34 PM

BCCI introduces New Bronco Test for Team India, What is This Fast Bowlers To

టీమిండియా (PC: BCCI)

సెప్టెంబరులో ఆసియా కప్‌-2025 (Asia Cup) టోర్నమెంట్‌ మొదలు.. వరుస సిరీస్‌లతో టీమిండియా బిజీబిజీగా గడుపనుంది. ఈ ఖండాంతర ఈవెంట్‌ తర్వాత స్వదేశంలో అక్టోబరులో వెస్టిండీస్‌తో టెస్టులు.. అనంతరం ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే, టీ20 సిరీస్‌లు ఆడనుంది.

ఆటగాళ్లు ఫిట్‌గా ఉంటేనే..
ఆ తర్వాత నవంబరులో టీమిండియా సొంతగడ్డపై సౌతాఫ్రికా (IND vs SA)తో టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌లలో తలపడనుంది. మరి ఈ బిజీ షెడ్యూల్‌లో భారత జట్టు అనుకున్న ఫలితాలు రాబడుతూ సాఫీగా ముందుకు సాగాలంటే ఆటగాళ్లు ఫిట్‌గా ఉండటం అత్యంత ముఖ్యం.

బీసీసీఐ కీలక నిర్ణయం
ఇటీవల ఇంగ్లండ్‌ పర్యటనలో వర్క్‌లోడ్‌ మేనేజ్‌మెంట్‌లో భాగంగా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఐదింట.. కేవలం మూడు టెస్టులు మాత్రమే ఆడిన విషయం తెలిసిందే. ఫలితంగా టీమిండియా యాజమాన్యం తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఫిట్‌నెస్‌ పరీక్షలో భాగంగా బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ (CoE) సరికొత్త టెస్టును ప్రవేశపెట్టినట్లు సమాచారం. రగ్బీ, ఫుట్‌బాల్‌ క్రీడాకారులకు నిర్వహించే బ్రోంకో టెస్టు ద్వారా భారత ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను పరీక్షించనున్నట్లు తెలిసింది. బీసీసీఐ కాంట్రాక్టు ప్లేయర్లు, ముఖ్యంగా పేసర్లకు ఈ పరీక్ష ద్వారా ఫిట్‌నెస్‌ స్థాయి పెంచుకునే వీలు కలుగుతుందని భావిస్తున్నట్లు సమాచారం.

ఫాస్ట్‌ బౌలర్లు పరిగెత్తడం లేదు!
ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు మాట్లాడుతూ.. ‘‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ బ్రోంకో టెస్టును ప్రవేశపెట్టింది. కొంత మంది సెంట్రల్‌ కాంట్రాక్టు క్రికెటర్లు బెంగళూరుకు వెళ్లి ఈ పరీక్ష చేయించుకున్నారు. ఫిట్‌నెస్‌ ప్రమాణాలు పెంచేందుకే సీఓఈ ఈ నిర్ణయం తీసుకుంది.

భారత క్రికెటర్లలో చాలా మంది.. ముఖ్యంగా ఫాస్ట్‌​ బౌలర్లు జిమ్‌లో ఎక్కువ సమయం (స్పీడ్‌ రన్నింగ్‌) గడపడం లేదని తెలిసింది. తప్పకుండా ఎక్కువ సేపు రన్నింగ్‌ చేయాలని స్ట్రెంత్‌ అండ్‌ కండిషనింగ్‌ కోచ్‌ ఆడ్రియన్‌ లే రౌక్స్‌ వారికి చెప్పారు’’ అని పేర్కొన్నాయి.

ఇంతకీ ఏమిటీ బ్రోంకో టెస్టు?
ఇదొక రకమైన ఫిట్‌నెస్‌ పరీక్ష. ఇందులో భాగంగా ఆటగాడు తొలుత 20 మీటర్ల షటిల్‌ రన్‌ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 40 మీటర్లు, 60 మీటర్ల షటిల్‌ రన్‌లో పాల్గొంటాడు. ఈ మూడింటిని కలిపి ఒక సెట్‌గా వ్యవహరిస్తారు.

పరీక్ష సమయంలో ఆటగాడు ఇలాంటి ఐదు సెట్లు పూర్తి చేయాలి. అంటే.. మొత్తంగా 1200 మీటర్ల దూరం విరామం లేకుండా వేగంగా పరిగెత్తాలి. ఆరు నిమిషాల్లోనే సదరు ప్లేయర్‌ ఈ పని పూర్తి చేయాలి.

ఇదిలా ఉంటే.. రెండు కిలోమీటర్ల టైమ్‌ ట్రయల్‌లో ఫాస్ట్‌ బౌలర్లు ఎనిమిది నిమిషాల పదిహేను సెకండ్లలో బెంచ్‌ మార్కును అందుకోవాలి. మరోవైపు.. బ్యాటర్లు, వికెట్‌ కీపర్లు, స్పిన్నర్లకు ఎనిమిది నిమిషాల ముప్పై సెకండ్ల టైమ్‌ ఉంటుంది. కాగా అంతకు ముందు బీసీసీఐ ఆటగాళ్లకు యో-యో టెస్టు నిర్వహించేదన్న విషయం తెలిసిందే.

చదవండి: ఇదే ఫైనల్‌ స్క్వాడ్‌ కాదు.. వారికి మరో ఛాన్స్‌: అగార్కర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement